కూల్చివేసిన నిర్మాణాలు, ఎడ్విన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ డాన్‌గా మారి.. దేశ వ్యాప్తంగా వేల మంది పెడ్లర్స్‌ను ఏర్పాటు చేసుకుని, యువతను నిర్వీర్యం చేస్తున్న ఎడ్విన్ న్యూన్స్ ఆర్థిక మూలాలపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎడ్విన్‌ను నార్కోటిక్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం కేసులు, అరెస్టులతో సరిపెట్టడం కాదని.., అతడి ఆర్థిక మూలాలు, అక్రమ ఆస్తులను దెబ్బ తీస్తేనే మాదక ద్రవ్యాల వ్యాపారానికి పూర్తిగా చెక్ పెట్టవచ్చన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలోనే హెచ్–న్యూ అధికారులు ఓ పక్క ఎడ్విన్ కోసం గాలిస్తూనే మరోపక్క అతని ఉల్లంఘనలు, బలహీనతలు, లొసుగులపై అధ్యయనం చేశారు. ఫలితంగా అతడి ప్రధాన ఆర్థిక వనరు, డ్రగ్స్ సూపర్ మార్కెట్లుగా పేరున్న కర్లీస్ షాక్స్ (బీచ్‌లలో ఉండే రెస్టారెంట్లు)తో పాటు రెండు ఇళ్లు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. హెచ్–న్యూ పోరు ఫలితంగా ఎట్టకేలకు స్పందించిన గోవా యంత్రాంగం వాటిని రెండు వారాల క్రితం నేలమట్టం చేసింది.
ఏళ్లుగా దన్నుగా నిలిచిన యంత్రాంగాలు..
గోవా అధికారులు ఏళ్లుగా ఎడ్విన్‌కు అండగా నిలుస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అతడి ఆస్తులను పరిశీలించిన హెచ్–న్యూ అధికారులు కర్లీస్ తో పాటు రెండు ఇళ్లు సముద్ర తీరంలో ఉన్నాయని గుర్తించారు. వీటిపై లోతుగా ఆరా తీయగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) గతంలోనే వాటిని కూల్చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిందని తెలుసుకున్నారు.
అయితే ఈ ఆదేశాలను పట్టించుకోని గోవా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (జీసీజెడ్‌ఎంఏ) ఎడ్విన్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు గుర్తించారు. దీంతో గోవా పోలీసులతో పాటు కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ పైనా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో హడావుడిగా రంగంలోకి దిగిన ఈ యంత్రాంగాలు ఎడ్విన్ అక్రమంగా నిర్మించిన ఆస్తులను కూల్చేశాయి. దీనిని అడ్డుకోవడానికి ఎడ్విన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఫలితం దక్కలేదని అధికారవర్గాలు తెలిపాయి. మరోపక్క హైదరాబాద్ పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎడ్విన్ మూడు నెలల వ్యవధిలో వివిధ కోర్టుల్లో లాయర్ల కోసం రూ.1.4 కోట్లు ఖర్చు పెట్టాడని పోలీసులు చెపుతున్నారు.
సంజయ్ గోవేకర్ కోసం వేట ముమ్మరం
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 మంది కస్టమర్లను ఏర్పాటు చేసుకుని దందా చేస్తూ చిక్కిన డ్రగ్ పెడ్లర్ ప్రీతీశ్ నారాయణ్ బోర్కర్‌ను అరెస్టు చేయడంతో ఎడ్విన్ పేరు వెలుగులోకి వచ్చింది. గోవాలోని అంజునా బీచ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న ఘరానా డ్రగ్ పెడ్లర్ ప్రీతీశ్ నారాయణ్ బోర్కర్ మూడు నెలల కిందట పట్టుబడ్డాడు. ఇతడిని విచారించగా స్టీవ్, ఎడ్విన్ సహా ఆరుగురు డ్రగ్ సప్లయర్ల వివరాలు బయటపడ్డాయి.
ఈ వివరాలను అంజునా పోలీసులకు పంపిన హైదరాబాద్ అధికారులు వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు. నటి, రాజకీయ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్య కేసులోనూ వీరిలో కొందరు ఉన్నారు. కాగా, ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేయగా, సంజయ్ గోవేకర్ అనే సప్లయర్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నట్లు చెపుతున్న పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎడ్విన్ అరెస్టుతో గోవా కేంద్రంగా సాగే డ్రగ్స్ నెట్‌వర్క్ కుప్పకూలినట్లేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
హైదరాబాద్ పేరు చెప్తే హడలే..
హైదరాబాద్ పోలీసు విభాగంలో హెచ్–న్యూ ఏర్పాటైన నాటి నుంచి అధికారులు వివిధ అంచెల్లో డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్నారు. తొలుత స్థానికంగా ఉన్న వినియోగదారులు, విక్రేతలపై దృష్టి పెట్టి చెక్ చెప్పారు. ఆపై వీరికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని పట్టుకున్నారు. మూడో అంచెలో అంతర్రాష్ట్ర పెడ్లర్లు, సప్లయర్లను కటకటాల్లోకి పంపారు. నాలుగో దశలో స్టీవ్, ఎడ్విన్ వంటి డ్రగ్ డాన్‌లను అరెస్టు చేశారు.
ఇప్పుడు ఐదో అంచెలోకి అడుగుపెట్టిన పోలీసులు అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు. దీనికి చెక్ చెప్పడానికి ఐబీ, ఎన్సీబీ సహా వివిధ ఏజెన్సీల సహాయం తీసుకోనున్నారు. గోవా, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులంటే హడలిపోయే పరిస్థితి వచ్చింది. వరుసపెట్టి హెచ్–న్యూ పోలీసులు అరెస్టులు చేస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చి డ్రగ్స్ అమ్మడానికి, ఇక్కడి వారికి సరఫరా చేయడానికి, చివరకు హైదరాబాద్ వాసులు ఆయా ప్రాంతాలకు వెళ్లినా ఇవ్వడానికి పెడ్లర్స్ బెంబేలెత్తిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment