బెంగళూరు కేంద్రంగా సాగుతున్న వ్యవహారం
పెడ్లర్స్ అక్కడ..డెలివరీ బాయిస్ ఇక్కడ
పోలీసు నిఘాకు చిక్కకుండా పక్కా పథకం
అంతర్జాతీయ ముఠాలకు చెక్ చెప్పిన హెచ్ న్యూ
నలుగురి అరెస్టు, రూ.20 లక్షల సరుకు స్వాదీనం
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా ద్వారా సంప్రదింపులు... యూపీఐ యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు.. డెడ్ డ్రాప్ విధానంలో సరుకు డెలివరీ... బెంగళూరు కేంద్రంగా ఈ పంథాలో వ్యవస్థీకృతంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు చెక్ చెప్పారు. రెండు ముఠాలకు చెందిన ఐదుగురిని పట్టుకున్నామని, నలుగురిని అరెస్టు చేసి, మరొకరిని అతడి దేశానికి డిపోర్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కొత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి శుక్రవారం బంజారాహిల్స్‌లోని టీజీ సీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బెంగళూరు నుంచి నగరంలో ‘వ్యాపారం’...
నైజీరియాకు చెందిన యాకూబ్ అలియాస్ కుర్బా కొన్నేళ్ల క్రితం స్టడీ వీసాపై నగరానికి వచ్చాడు. సైనిక్‌పురి, టోలిచౌకీ ప్రాంతాల్లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తూ పోలీసులకు మూడుసార్లు చిక్కాడు. ఇతడిపై కుషాయిగూడ, ఫలక్‌నుమ, రాజేంద్రనగర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పోలీసు నిఘా తప్పించుకోవడానికి తన మకాం బెంగళూరుకు మార్చాడు. అక్కడి నుంచే డ్రగ్స్ దందా చేస్తున్నాడు. 2016లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి వచి్చన అబ్దుల్ రెహా్మన్ ఉస్మాన్ ఇంగ్లిష్ కోర్సు చేసి తిరిగి వెళ్లాడు. 2018లో నాలుగేళ్ల వీసాపై వచ్చి ఉత్తరప్రదేశ్‌లో బీసీఏ కోర్సులో చేరి... కరోనా సమయంలో స్వదేశానికి వెళ్లాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ వచి్చన అతను కోర్సు పూర్తి చేసి సిటీకి వచ్చాడు. టోలిచౌకి ఉంటూ జల్సాల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు.
ఆ ఐదుగురికీ డెలివరీ బాయ్‌గా...
ఇతడికి బెంగళూరులో స్థిరపడిన యాకూబ్‌తో పాటు నైజీరియా, టాంజానియా నుంచి వచ్చి అక్కడ ఉంటున్న రోమియో, గడాఫీ, జాన్‌పాల్, కేరళ వాసి జాకబ్‌లతో ఆన్‌లైన్‌లో పరిచయమైంది. వీరు ఐదుగురూ హైదరాబాద్‌లో ఉన్న డ్రగ్ వినియోగదారులతో సోషల్‌మీడియా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. బేరం కుదిరిన తర్వాత ఆ మొత్తాన్ని కస్టమర్ యూపీఐ ద్వారా చెల్లిస్తారు. ఇందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు కూడా డమ్మీ వ్యక్తులవే అయి ఉంటున్నాయి. ఆపై వారు ఇక్కడకు రావడం ద్వారా లేదా ఉస్మాన్‌ను బెంగళూరు పిలిపించడం ద్వారా సరుకు నగరానికి చేరుతుంది. ప్రధానంగా రోడ్డు మార్గంలోనే మాదకద్రవ్యాలను నగరానికి తీసుకు వస్తున్నారు. కస్టమర్, డెలివరీ బాయ్ నగరంలోనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు.
సీఓడీ విధానంలోనూ మరో ముఠా..
బెంగళూరు కేంద్రంగానే పని చేస్తున్న మరో ముఠా డెడ్ డ్రాప్‌తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విధానంలో డ్రగ్స్ సరఫరా చేస్తోంది. బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. కుటుంబీకులు ఓ రీహాబ్ సెంటర్‌లో చేర్చినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ డ్రగ్స్ దందాలోకి దిగిన అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో నాంపల్లి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి వచి్చన తర్వాత టోలిచౌకీలో కుటుంబానికి దూరంగా నివసిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన చుక్వా ఒబైయ్ డెడ్ డ్రాప్ ద్వారా కేరళ నుంచి వచ్చి బెంగళూరులో ఉంటున్న నందకుమార్‌ను డ్రగ్స్ అందిస్తాడు. ఇవి ఇతడి నుంచి చందానగర్‌కు చెందిన నవీన్‌కు చేరుతున్నాయి. అతడి నుంచి లేదా ఒక్కోసారి నేరుగా బెంగళూరు వెళ్లడం ద్వారా ఇమ్రాన్ ఈ సరుకు తీసుకువస్తున్నాడు. ఆపై డెడ్ డ్రాప్ లేదా సీఓడీ విధానంలో కస్టమర్లకు అందిస్తున్నాడు.
నలుగురి అరెస్టు..
ఈ రెండు గ్యాంగ్‌లపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్‌స్పెక్టర్లు కె.శ్రీనివాస్, జీఎస్ డానియేల్, ఎస్సై సి.వెంకట రాములు తమ బృందాలతో రంగంలోకి దిగారు. దాదాపు నెల రోజులు నిఘా ఉంచి ఉస్మాన్, యాకూబ్, నందకుమార్, మహ్మద్ ఇమ్రాన్, నవీన్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్‌ఎస్డీ బోల్డ్స్‌తో పాటు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. మిగిలిన నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు యాకూబ్‌ను అతడి దేశానికి డిపోర్టేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరి నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్ల ద్వారా ఈ నెట్‌వర్క్‌లోని ప్రధాన సూత్రధారులు, తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కస్టమర్ల పాత్రను బట్టి రీహాబ్‌కు తరలించడం లేదా అరెస్టు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఫొటో, లోకేషన్ షేర్ చేయడం ద్వారా...
ఈ డ్రగ్‌ను డెలివరీ బాయ్ ఉస్మాన్ డెడ్ డ్రాప్ విధానంలో కస్టమర్‌కు చేరుస్తాడు. బహిరంగ ప్రదేశంలో ఎవరికీ అనుమానం రాని ప్రాంతంలో డ్రగ్ ప్యాకెట్‌ను ఉంచుతాడు. ఎండ, వానల వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాక్ చేస్తాడు. దీని ఫొటో, లోకేషన్‌ను వాట్సాప్ ద్వారా బెంగళూరులోని సప్లయర్‌కు పంపిస్తాడు. అతడు ఇదే సమాచారం కస్టమర్‌కు షేర్ చేస్తాడు. వీటి ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లే కస్టమర్ ఆ సరుకు తీసుకుంటాడు. దీనినే డెడ్ డ్రాప్ విధానం అని పిలుస్తుంటారు. డెడ్ డ్రాప్ చేయడానికి డెలివరీ బాయ్ ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్లు, పాన్ డబ్బాలు, మెట్రో పిల్లర్లు తదితరాలను ఎంచుకుంటున్నారు. పెడ్లర్స్, సప్లయర్స్ ఇలా తాము సంపాదించిన మొత్తంలో 30 నుంచి 40 శాతం డెలివరీ బాయ్‌కు చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment