సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేయించారు వ్యవస్థీకృత బుకీలు... దీని లింకును నిర్వాహకులకు షేర్ చేయడం ద్వారా ప్రతి పందెం పైనా 3 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. దీంతో పందేలన్నీ యాప్ ద్వారా జరుగుతుండగా, నగదు మార్పిడి మాత్రం హవాలా మార్గంలో సాగుతున్నాయి. ఇలా హైటెక్ పంథాలో పందాలు నిర్వహిస్తున్న ఈ ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధా కిషన్‌రావు గురువారం తెలిపారు. బెట్టింగ్స్‌లో పందేలు నిర్వహించే వారిని బుకీ అని, వాటిని కాసే వారిని పంటర్ అని అంటారు. నగరంలోని బహదూర్‌పుర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అగర్వాల్, గౌలిగూడకు చెందిన లఖన్ శ్రద్ధ్ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించే బుకీలుగా పని చేస్తున్నారు. తొలినాళ్ళల్లో బుకీలు పరిచయస్తులైన పంటర్ల నుంచి పందేలు అంగీకరిస్తూ ఆ లెక్కల్ని మాన్యువల్‌గా రికార్డుల్లో నోట్ చేసుకునే వారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్ రేష్యోను సూత్రధారుల నుంచి ఫోన్‌లో తెలుసుకునే వారు.
ఎప్పటికప్పుడు క్రికెట్ అప్‌డేట్‌ను పంటర్లకు ఫోన్ ద్వారా వివరిస్తూ ఉండేవారు. ఇలా అవసరం లేకుండా అంతా ఆన్‌లైన్‌లో సాగే మాదిరిగా అంతర్జాతీయ బుకీలు ప్రత్యేకంగా ‘రాయల్ ఎక్ఛ్సేంజ్’ పేరుతో ఓ యాప్‌ను సృష్టించారు. రాజస్థాన్‌కు చెందిన సంకేత్ అనే కీలక బుకీ అనేక మంది చిన్న బుకీలకు దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ఉండటాడు. కొన్నాళ్ళ క్రితం ప్రవీణ్, లఖన్‌లకు ఇతడితో పరిచయం ఏర్పడింది. అతడు అందించిన వివరాల ఆధారంగా దీన్ని ప్రత్యేక పద్ధతిలో తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. దానిలోకి లాగిన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను సంకేత్ రహస్యంగా అందిస్తాడు. ఇలా ఇచ్చినందుకు అతడు ఆ యాప్ ద్వారా జరిగే లావాదేవీల్లో 3 శాతం కమీషన్ తీసుకుంటారు.
ప్రవీణ్, లఖన్ సైతం తమ పంటర్లకు ఈ యాప్ లింకు పంపడం ద్వారా తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయిస్తున్నారు. ఆ యాప్స్‌లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలు అక్కడే కనిపిస్తాయి. ఒక్క దేశీయ క్రికెట్‌కే కాకుండా ప్రపంచంలో ఏ మూలన జరిగే, ఏ క్రీడకైనా పందాలు కాసేకోవచ్చు. ఇలా ఈ యాప్‌లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది వాటిలో రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు మాత్రం నేరుగా లేదా ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. ఏదైనా సందేశాలు, సమస్యలు ఉండే అతడితో ఇక్కడి బుకీలు వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి. ఇప్పటికే అనేక మ్యాచ్‌లకు బెట్టింగ్ నిర్వహించిన ప్రవీణ్, లఖన్‌లు తాజాగా జరుగుతున్న టెస్ట్, టీ20 మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పర్‌మేశ్వర్ దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించిన అధికారులు పరారీలో ఉన్న సంకేత్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment