
మొబైల్లో వెచ్చించిన సమయం 4.2 లక్షల కోట్ల గంటలు
అరచేతిలో స్మార్ట్‌ఫోన్– స్మార్ట్‌ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్‌తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.
మనం వాడే స్మార్ట్‌ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్‌లోను, మొబైల్‌లో యాప్స్‌పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.
మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్‌తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్‌లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్‌గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు.
గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్‌లో ‘పబ్‌జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్‌లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్‌సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.
అంతర్జాతీయంగా యాప్స్ తీరు
ప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్‌డౌన్‌ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్‌లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్‌డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్‌సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్‌లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్‌మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్‌వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి.
మన దేశంలో ఇలా..
పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్‌ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్‌దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్‌లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్‌లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్‌లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.
‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్‌ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్‌గా నిలిచాయి. యాప్స్‌లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్‌టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్‌జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్‌ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి.
‘గేమ్’చేంజర్స్
బిలియన్ డాలర్ క్లబ్‌లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్‌లో లాస్ట్ వార్, వైట్‌ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్‌తోపాటు నాన్ –గేమ్స్‌లో వీటీవీ ఈ క్లబ్‌లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్‌లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.
సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్‌స్టైల్, టేబుల్‌టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్‌లో సబ్‌వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్‌లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్‌లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్‌లో భారత్‌లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది.
సోషల్ మీడియా దూకుడు
సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్‌లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్‌కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.

చాట్ జీపీటీ మూడంకెల వృద్ధి
ఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్‌టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్‌కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.
ఏఐ చాట్‌బాట్స్ హవా
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్‌బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్‌బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్‌లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్‌బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్‌బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.
నాన్ –గేమ్స్ ఆదాయం
ఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్‌గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.
⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024
⇒ ప్రపంచ జనాలు మొబైల్‌లో వెచ్చించిన సమయం
⇒ ప్రపంచ జనాలు యాప్స్‌తో గడిపిన సగటు సమయం 500 గంటలు
⇒ ఒక్కొక్కరు మొబైల్‌తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు
⇒ నిద్రలేవగానే మొబైల్‌తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు
⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7
⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు
⇒యాప్స్ డౌన్‌లోడ్స్ 13,600 కోట్లు
⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్‌లోడ్స్ 2.58 లక్షలు
⇒మొత్తం డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా 17.91 శాతం
Comments
Please login to add a commentAdd a comment