దేశంలోని ప్రతి టీనేజర్ రాత్రి నిద్రకు ముందు, ఉదయం నిద్ర లేవగానే చూసేది సోషల్ మీడియానే అంటే అతిశయోక్తి కాదేమో! ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, స్నాప్ చాట్, షేర్ చాట్, డిస్కార్డ్, వాట్సప్, టెలిగ్రామ్.. ఒకటా రెండా, అనేకానేక సోషల్ మీడియా యాప్‌లు యువత జీవితాలను చుట్టేస్తున్నాయి. సోషల్ మీడియా లేకుండా బతకడం లేదా దాన్ని తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది.
అయితే సోషల్ మీడియా కేవలం కమ్యూనికేషన్ సాధనంగా కాకుండా, టీనేజర్లు తమను తాము ఎలా చూసుకుంటున్నారనేదాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వారి బాడీ ఇమేజ్, సోషల్ లైఫ్, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.
మానసిక ఆరోగ్య సమస్యలు
సోషల్ మీడియా విపరీత వినియోగానికీ ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం వంటి సమస్యలకూ మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూపించే లైఫ్‌స్టయిల్, ఐడియలైజ్డ్ ఇమేజ్‌లు టీనేజర్లలో అసంతృప్తికి, ఆత్మవిశ్వాసలోపానికి దారితీస్తాయి. ఇన్‌ఫ్లుయెన్సర్లు సృష్టించే స్టాండర్డ్‌లు అందుకోలేక తామెందుకూ పనికిరామనే భావనకు లోనవుతారు.
సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వారిలో తమ ఫ్రెండ్స్ గురించి అప్‌డేటెడ్‌గా ఉండాలన్న ఒత్తిడి ఉంటుంది. ఫ్రెండ్స్ పోస్టులు ఎప్పటికప్పుడు చూడకపోతే ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అంతులేని సోషల్ మీడియా ఫీడ్స్ చూసి, లైకులు, కామెంట్స్ కోసం ఎదురుచూడటం వారి ఆత్మవిశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వీటితోపాటు ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’ అనే సమస్య కూడా టీనేజర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
బాడీ ఇమేజ్‌పై దుష్ప్రభావం..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందం, విజయానికి సంబంధించిన ఐడియలైజ్డ్ వర్షన్లను చూపడం వల్ల టీనేజర్లలో తమ శరీరం పట్ల ప్రతికూల ప్రభావం పడుతోంది. నాజూకుగా ఉండే ఫొటోలను పదేపదే చూడటం వల్ల కాస్తంత బొద్దుగా ఉన్న తాను బాలేనని అసంతృప్తికి లోనవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ‘ఫిట్స్‌పిరేషన్’,‘థిన్సిపిరేషన్’ వంటి కంటెంట్‌ల వల్ల టీనేజర్లు తక్కువ బరువు, ప్రత్యేకమైన శరీరాకృతికై తహతహలాడుతుంటారు. జీరోసైజ్ చేరుకోవాలని లేదా సిక్స్ ప్యాక్ సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఇది అనారోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రేరేపిస్తుంది.
సామాజిక సంబంధాలకు దూరంగా..
సామాజిక సంబంధాలను ఎలా ఏర్పరచుకోవాలో, ఎలా నిర్వహించాలో సోషల్ మీడియా పూర్తిగా మార్చేస్తుంది. ఒకవైపు, తమలాంటి అభిరుచులున్న వ్యక్తులను కలుసుకునేందుకు, అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మరోవైపు, వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవడానికి అంతరాయం కలిగిస్తుంది.
డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియాలపై విపరీతంగా ఆధారపడటం వల్ల అవసరమైన సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉండే టీనేజర్లు కూడా వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్తవారితో కలవాలంటే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సైబర్ బుల్లీయింగ్, ట్రోలింగ్ వల్ల అనేకమంది మానసిక సమస్యల పాలవుతున్నారు.
మరోవైపు నిజమైన స్నేహానికి, ఆన్‌లైన్ కనెక్షన్ల సంఖ్యకు తేడా గుర్తించలేకపోతున్నారు. ఎంత ఎక్కువమంది ఆన్‌లైన్ స్నేహితులు లేదా ఫాలోయర్లు ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నారు. కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వారెవ్వరూ తోడురాక ఒంటరితనానికి లోనవుతున్నారు. వీటన్నింటి నుంచీ తప్పించుకోవాలంటే సోషల్ మీడియాను పరిమితంగా వాడటం నేర్చుకోవాలి.
మరేం చెయ్యాలి?
👉 స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. విరామాలు తీసుకోండి ∙కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడండి
👉 రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి ∙సమతుల ఆహారం తీసుకోండి, సరిపడినంత నీటిని తాగండి ∙స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేసుకోండి. దాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకోండి
👉మీ ఆలోచనలు, భావాలు, అనుభవాలు రోజూ రాయండి. అలాగే ప్రతిరోజూ మీరు కృతజ్ఞత తెలపాల్సిన మూడు విషయాలను రాసుకోండి
👉ఏ తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి
👉మీ గురించిన నెగటివ్ ఆలోచనలను సవాలు చేయండి. మీ పట్ల మీరు క్షమతో ఉండండి
👉మీ హాబీలపై సమయాన్ని పెంచండి. మీరు ఆస్వాదించే కార్యక్రమాల్లో పాల్గొనండి ∙ఇవన్నీ చేసినా మీరు ఒత్తిడికి లోనవుతుంటే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడానికి సందేహించకండి.
Comments
Please login to add a commentAdd a comment