కాపురాలు కూలుస్తున్న సోషల్ మీడియా
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..
ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.
కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.
అందమైన సినిమా...
సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.
విశ్వాస ఉల్లంఘన
ప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.
రెండువైపులా పదునున్న కత్తి
సోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి.
సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది.
పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం.
మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్‌ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు.
పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు.
సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది.వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది.
తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది.
సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది.
ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.
ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.
సోషల్ మీడియా బ్యాలెన్స్...
రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను.సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను.
ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను.
తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను.
ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను.
అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను.
అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.
-సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment