ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.
రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.
కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.
చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.
ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.
ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.
వాదనలు వర్సెస్ తగాదాలు
మనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం.
👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు
👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు.
👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే.
👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు.
👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది.
కౌన్సెలింగ్ తో పరిష్కారం...
రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను.
👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.
👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.
👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు.
👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు.
సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment