ప్రియకు 28 ఏళ్లు. ఒక అంతర్జాతీయ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. రోహిత్‌తో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. మొదట్లో అంతా బానే ఉంది. కాలం గడిచేకొద్దీ వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. తన డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్ వరకూ అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు.
తన ప్రవర్తనను, స్నేహాలను కూడా నియంత్రించడం ప్రియకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు రోహిత్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. తానేం చేయాలో ప్రియకు అర్థంకాక కౌన్సెలింగ్ కు వచ్చింది.
స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయం
ప్రేమంటే రెండు మనసుల కలయిక, పెళ్లంటే రెండు జీవితాల కలయిక. మనదేశంలో మాత్రం పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కనీస అవగాహన లేకపోయినా... కులం, మతం, జాతకం, ఆర్థిక స్థాయిలు కలిస్తే చాలు, పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ జంటపై ఉంటుంది. ఇప్పుడదే భారం ప్రియపై ఉంది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి.. కుటుంబ గౌరవానికి, సంప్రదాయానికి మధ్య పోరాటం నడుస్తోంది.
కాలంతో పాటు మారని మనుషులు...
సాంప్రదాయ పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన వివాహంలో.. భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రోజులొచ్చినా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే నడవాలనే భావజాలంలోనే ఉంటారు, ఉంటున్నారు. రోహిత్ ది కూడా అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు.
ఆ క్రమంలో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రియ తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ కు వచ్చింది. ఆమె చెప్పినదంతా విన్నాక, వారికి ‘హెల్తీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని అర్థమైంది.
టాక్సిక్ రిలేషన్స్ లక్షణాలు...
• జంటలో ఒకరి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం
• తరచుగా వ్యంగ్యం, నిందలు, అవమానాలు
• ఫోన్ చెక్ చేయడం, ఫ్రెండ్స్, పేరెంట్స్‌కు దూరం చేయడం
• పార్టనర్ ను సంప్రదించకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం
• పార్టనర్ ను కంట్రోల్ చేయడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం
• పార్టనర్ తెలివిని, నిర్ణయాలనూ చులకన చేయడం
• ఎవరితో క్లోజ్‌గా ఉన్నా అసూయ పడటం, దూరం చేయడానికి ప్రయత్నించడం
• ప్రతీ చిన్న విషయానికీ గొడవపడుతుండటం
సరిహద్దుల అవసరం...
ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలనీ, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలనీ అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు, మీ అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతీ జంటకూ హెల్తీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం.
• ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం.
• ‘‘నువ్వలా చేస్తున్నావు’’, ‘‘నువ్విలా అంటున్నావు’’ అని కాకుండా... ‘‘నేనిలా అనుకుంటున్నాను’’, ‘‘నేనిలా ఫీలవుతున్నాను’’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉదాహరణకు, ‘‘నేనే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పినప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇద్దరికీ నచ్చేదాని గురించి మాట్లాడుకుందామా?’’ అని చెప్పడం, ఇష్టంలేకుండా ఒప్పుకోవడం నుంచి మాట్లాడి పరిష్కరించుకోవడానికి దారితీస్తుంది.
• ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. వారి స్వేచ్ఛకు, స్నేహాలకు విలువనివ్వడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. అది వారిని నచ్చిన పాటలు వినడం కావచ్చు, తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం కావచ్చు.
• మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాల్లోనూ మార్పు వస్తుందని గుర్తించాలి. సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతుల్యత సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది.
• సరిహద్దులను సెట్ చేయడం సవాలే. మీ భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి.
• మీ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.
ప్రియ, రోహిత్ లకు మూడు సెషన్లలో వీటిని వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయించాను. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ వాట్సప్ లో పలకరిస్తుంటారు.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment