ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా గంధం క్వీని విక్టోరియా గుర్తింపు పొందారు. హైదరాబాద్ వాసి అయిన విక్టోరియా ఈ నెల 19న ‘సేవ్ అవర్ ఓషన్స్’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా నవతరాన్ని ప్రోత్సహించడం కోసం ముంబయి సమీపంలోని మండ్వాజెట్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు తన కుమారుడు స్టీఫెన్ కుమార్‌తో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేశారు. తల్లీ కుమారుడు కలిసి ఓపెన్ స్విమ్మింగ్‌లోపాల్గొనడం దేశంలోనే మొదటిసారి. సప్తసముద్రాలను పిల్లలతో కలిసి ఈదుతా అంటూ తన కలల అలలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
హైదరాబాద్ బర్కత్‌పురలో ఉంటున్న గంధం క్వీని విక్టోరియా గృహిణిగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన కలల సాధనకోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ‘‘నా పిల్లల కలలకు ఓ మార్గం వేయాలనుకున్నాను. పిల్లలు చురుగ్గా ఉండాలంటే వారికి స్పోర్ట్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో భాగంగా వారిని స్కూల్ ఏజ్‌లో స్విమ్మింగ్‌లో చేర్చాను. నేనూ వారితోపాటు స్విమ్మింగ్‌లో చేరాను. పిల్లల కోసం నేర్చుకున్న స్విమ్మింగ్ నేను ఇంగ్లిష్ ఛానెల్ ఈదేంత వరకు వెళ్లింది. గుర్తింపు వచ్చింది.
విమర్శలను పక్కన పెట్టి..
చాలా మంది విమర్శించారు. ఈ వయసులో స్విమ్మింగ్ అవసరమా? అన్నవాళ్లు ఉన్నారు. గుర్తింపు కోసం చేస్తున్న తపన అని, డబ్బులు ఎక్కువయ్యాయి అని.. ఒక్కొక్కరు ఒక్కో మాట. మాది మధ్య తరగతి కుటుంబం. పెళ్లితో ఆగిపోయిన ఇంటర్మీడియెట్ చదువును కొనసాగించాను. పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీతోపాటు బీఎడ్ చేశాను. మావారు అనిల్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు పిల్లల పెంపకంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో నాకు వచ్చిన కుట్టుపనితో టైలర్‌గా మారాను. మా వారి సంపాదనకు తోడుగా బొటిక్‌లో వచ్చిన ఆదాయంతో నిలదొక్కుకున్నాం.
పిల్లలు మాట విన్నారు...
పిల్లలతోపాటు స్విమ్మింగ్‌లో చేస్తున్నప్పుడు నీటి కాలుష్యం గురించి అనేక ఆలోచనలు వచ్చేవి. స్విమ్మింగ్ పూల్స్ నుంచి నదుల్లో ఈత వరకు నా ప్రయాణం, అటునుంచి సముద్రాలను ఈదాలనే తపనను పెంచింది. దాంట్లో భాగంగా ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు వచ్చింది. సముద్రాలలో ఉండే శక్తి అర్థమైంది. ఆ ఆనందంలో ఉండగా నా పిల్లల గురించి ఆలోచన చేశాను. నేను నా ప్రయాణంలో ముందుకు వెళుతున్నాను. కానీ, నా పిల్లలు వెనకబడి పోతున్నారా.. అని ఆలోచించాను. మా అమ్మాయి ఎలిజబెత్ క్వీన్, అబ్బాయి స్టీఫెన్ కుమార్‌లను కూర్చోబెట్టి వారితో చర్చించాను.
‘సప్తసముద్రాలను మీతో కలిసి ఈదాలని ఉంది’ అన్నాను. ఇద్దరూ నా మాటలతో ఏకీభవించారు. అయితే, ఆర్థిక సమస్యలతో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మా అమ్మాయి ప్రస్తావించింది. ‘సముద్రాలను ఈదాలంటే ఖర్చుతో కూడిన పని. ముగ్గురంపాల్గొంటే డబ్బు సమస్యలను ఎదుర్కోవాలి. ముందు మీ ఇద్దరుపాల్గొనండి. తర్వాత నేనూ జాయిన్ అవుతాను’ అంది. దీంతో ‘సేవ్ అవర్ ఓషన్స్’ కాన్సెప్ట్‌తో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా అబ్బాయి స్టీఫెన్ కుమార్‌తో కలిసి, ఈ నెల 19న అరేబియా సముద్రంలోని మాండ్వా జెట్ నుంచి ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వరకు 17.1/2 కి.మీ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి, రికార్డు నెలకొల్పాం.
తల్లిదండ్రులకు అవగాహన
ఉదయం 7 గంటల 36 నిమిషాలకు స్విమ్మింగ్ చేయడం ్రపారంభిస్తే మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాలకు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకున్నాం. చివరి 800 మీటర్ల స్విమ్మింగ్ మాత్రం గంటకు పైగా సమయం పట్టింది. తల్లిదండ్రులు స్పోర్ట్స్ నుంచి వారి పిల్లలను యాక్టివిటీస్‌కు దూరం పెడుతున్నారు. వీటివల్ల ఏం లాభం అనుకుంటున్నారు. కానీ, పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎలా తోడ్పడతాయో గుర్తించడం లేదు. ఆ ఆలోచన కూడా కలిగించాలనేది మరో ఉద్దేశ్యం.
డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు
సోషల్ మీడియా నుంచి, ఒత్తిడితో కూడుకున్న చదువుల నుంచి నా పిల్లలను బయటకు తీసుకు రావాలనుకున్నాను. అది క్రీడల వల్ల సాధ్యం అవుతుందని నమ్మాను. పిల్లలతో తల్లిదండ్రులు టైమ్ గడపాలంటే ఏదో ఒకటి ఇలాంటి యాక్టివిటీ పెట్టుకోవాలి అనుకున్నాను. ముందు పిల్లల ప్రపంచంలోకి నేను వెళ్లాను. ఇప్పుడు మా ప్రపంచం ఒకటే అయ్యింది. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం 4 గంటలు స్విమ్మింగ్‌కి కేటాయిస్తాం. పోటీ ఉంటే మాత్రం మరో రెండు గంటల సమయం కేటాయిస్తాం. శరీరానికి కావల్సిన శక్తి కోసం పోషకాహారాన్ని ఇంట్లోనే తయారు చేస్తాను. టైలరింగ్ చేస్తాను. పిల్లలిద్దరూ డిగ్రీ చేస్తున్నారు. వాళ్లతో కలిసి ప్రపంచంలోని ఏడు మహా సముద్రాలను ఈదాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాం.
ప్రతిరోజూ నాకు వచ్చే ఆదాయంలో కొంత ఈ ఇవెంట్స్ కోసం ΄÷దుపు చేస్తుంటాను. చివరి నిమిషంలో అమౌంట్ తక్కువ పడితే మా వారి సాయం, లోన్, స్పాన్సర్స్ కోసం ట్రై చేస్తుంటాం. మొన్న జరిగిన ఈవెంట్‌కు సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్, డ్రీమాక్సిజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, నా దగ్గర బట్టలు కుట్టించుకునేవారు సాయం అందించారు. రాబోయే ఏప్రిల్‌లో సౌత్ ఆఫ్రికాలోని రాబిన్ ఐలాండ్‌లో స్విమ్ చేయడానికి సాధన చేస్తున్నాం. కొందరు ఈ వయసులో అవసరమా.. అని కామెంట్ చేస్తుంటారు. సముద్రాల్లో ఈదుతూ ఉంటే ఇంటిని వదిలేసినట్టేగా అని సెటైర్లు వేస్తుంటారు.
ఏ స్త్రీ అయినా వారి వయసుకు సంబంధం లేకుండా సాహసాలు చేస్తోందంటే దాని వెనక ఎన్నో కలలు, లక్ష్యాలు ఉంటాయి. భవిష్యత్తులో ఎవరైనా క్వీని విక్టోరియా అనగానే తన ఇద్దరు పిల్లలతో కలిసి సప్త సముద్రాలను ఈదింది అనే గుర్తింపు, తల్లిగా తన విజయంలో పిల్లలను ఎలా భాగస్వామ్యం చేసింది.. అనే విషయాలు అందరికీ గుర్తుకు రావాలి. తల్లిదండ్రులు చేసే కృషిని పిల్లలు ఎంత బాగా అర్థం చేసుకుంటారో కూడా మా ఈ ప్రయత్నం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను’ అని వివరించారు విక్టోరియా.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment