Connection Corner
-
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
ఇంటిమసీ లేకుంటే మంటలు తప్పవు
కవిత, నరేందర్ లకు పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ ఉద్యోగం. అన్యోన్యంగా ఉంటారు. ఇంటి బాధ్యతలు ఇద్దరూ పంచుకుంటారు. వీకెండ్ పార్టీలు, ఫ్యామిలీ మీట్స్, టూర్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు.కానీ నెలకో, రెణ్నెళ్లకోసారి గొడవ గ్యారంటీ. చిన్న మాట పట్టింపులతో మొదలై తిట్టుకుని, కొట్టుకునే వరకూ వెళ్తోంది. వీళ్ల గొడవలు చూసి పిల్లలు భయపడుతున్నారు. కలిసుండి ఇలా రోజూ కొట్టుకునేకంటే విడిపోవడమే బెటరని నిర్ణయించుకున్నారు. మ్యూచువల్ డైవోర్స్ కోసం లాయర్‌ను కూడా సంప్రదించారు. కోర్టుకు వెళ్లకముందు ఒకసారి మేరిటల్ కౌన్సెలింగ్ కు వెళ్లమని ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడని వచ్చారు.కవిత, నరేందర్ లతో కలివిడిగానూ, విడివిడిగానూ మాట్లాడాక వాళ్ల మధ్య physical intimacy (శారీరక సాన్నిహిత్యం) తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. కవిత శాలరీ ఎంతో కూడా నరేందర్ కు తెలియదు. అడిగినా చెప్పదు. ‘‘ఇంటి ఖర్చులకు నా షేర్ నేను ఇస్తున్నా కదా. నా శాలరీ గురించి నీకెందుకు? డామినేట్ చేయాలని చూస్తున్నావా?’’ అంటూ గొడవ పడుతుంది.నరేందర్ శాలరీ ఏం చేస్తున్నాడో కవితకు తెలియదు. శాలరీ అంతా ఏం చేస్తున్నావ్? అని అడిగితే ‘‘నేనేదో చేస్తున్నా నీకెందుకు? నీ శాలరీ గురించి నాకు చెప్పనప్పుడు, నా శాలరీ గురించి అడిగే రైట్ నీకు లేదు’’ అని గొడవపడతాడు.ఇలాంటి గొడవలు వాళ్లకు మామూలే. ఇన్ని గొడవల మధ్యా వాళ్లకున్న సుగుణమేంటంటే... పగలెన్ని గొడవలున్నా రాత్రికి ఒకటైతే అన్ని గొడవలూ సర్దుకుంటాయని బలంగా నమ్ముతారు, ఆచరిస్తారు. కానీ మేరిటల్ రిలేషన్షిప్ బలపడాలంటే, నిలబడాలంటే ఫిజికల్ ఇంటిమసీ ఒక్కటే చాలదని, ఇంకా చాలా కావాలని వాళ్లకు తెలియదు. అందువల్ల ఆ దిశగా వాళ్లెలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా చిన్నచిన్న విషయాలకే పెద్దపెద్ద గొవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, విడాకుల ప్రయత్నాలు.జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇలా అనేకమందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యం కూడా ఉంటుంది. కానీ బంధాలు బలపడాలంటే అదొక్కటే సరిపోదు. ఇంకా చాలా కావాలి. వాటిగురించి ఈరోజు తెలుసుకుందాం.Types of IntimacyPhysical Intimacy: చేతులు పట్టుకోవడం, ముద్దులు పెట్టుకకోవడం, హగ్ చేసుకోవడం వంటివి ఫిజికల్ ఇంటిమసీకి ఉదాహరణలు. అయితే కవిత దీన్ని బహిరంగంగా ప్రదర్శిస్తుంది, నరేందర్ కు అది నచ్చదు. ఫిజికల్ ఇంటిమసీ బెడ్రూమ్ కే పరిమితం కావాలనేది అతని ఫిలాసఫీ.Emotional Intimacy: ఆఫీస్ లో ఆరోజు ఏం జరిగింది? పని ఒత్తిడి ఎలా ఉంది? ఏమైనా ఆందోళనగా ఉందా? భయమేస్తుందా? ఇలాంటి ఎమోషనల్ విషయాలను మాట్లాడుకోండం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవిత, నరేందర్ ల మధ్య ఇది శూన్యం.Intellectual Intimacy: చదివిన పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి మాట్లాడుకోవడం, వారి ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడం, చర్చించుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవితకు ఫిక్షన్ బుక్స్ అంటే ప్రాణం, నరేందర్ కు అసలు బుక్స్ అంటేనే చిరాకు. ఎప్పుడూ టీవీలో ప్రవచనాలు వింటూ ఉంటాడు.Experiential Intimacy: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలిసి పనిచేయడం, సమయాన్ని గడపడం ముఖ్యం. కవిత, నరేందర్ ల మధ్య ఇది ఫర్వాలేదు. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటారు.Spiritual Intimacy: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను పార్టనర్ తో చర్చించడమే స్పిరిచ్యువల్ ఇంటిమసీ. నరేందర్ పరమ భక్తుడు, కవిత ఆర్జీవీ రామూయిజం ఫాలోయర్. ఇది చాలు కదా గొడవలు పడటానికి.ఆత్మీయతకు ఆటంకాలుప్రతి రిలేషన్ లోనూ విభేదాలుంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో పార్టనర్ నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఇంటిమసీని దెబ్బతీస్తుంది. మితిమీరిన పని, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల కలిగే ఒత్తిడి కూడా దంపతుల మధ్య ఇంటిమసీని దూరం చేస్తుంది. పార్టనర్ తో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఇంటిమసీని పెంపొందించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా ఎక్స్ ప్రెస్ చేయలేకపోతే అది మీ ఇంటిమసీని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు, కొంతమంది గతానుభవాలు, గాయాల వల్ల పార్టనర్ తో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే fear of intimacy అంటారు. కవితలో ఇది కనిపించింది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే అన్ని రకాల ఇంటిమసీలు ఉండేలా చూసుకోవడం అవసరం. కవిత, నరేందర్ లకు వారి ఇంటిమసీల మధ్య విభేదాలు వివరించడంతోపాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఎక్సర్ సైజ్ లు చేయించాను. కొద్ది సెషనల్లోనే వారి మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగింది. వారిప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.ఇలా చేయండి... మీ జీవితంలోనూ సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. ఫిజికల్ ఇంటిమసీ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం, హగ్ చేసుకోవడం ఫిజికల్ ఇంటిమసీని పెంపొందిస్తాయి. మీ పార్టనర్ చెప్పే మాటలు వినడానికి, మీ ఆలోచనలు పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం పెంచుకోవడం ఎమోషనల్ ఇంటిమసీని పెంచుతుంది. భోజనం చేస్తున్నప్పుడు లేదా మీ పార్టనర్ తో కలిసి టీవీ చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్ దూరంగా ఉంచండి. ఇద్దరూ కలిసి కొత్త విషయాలను అనుభవించడం సరదాగా ఉంటుంది. అందుకే మీరిద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేయండి. కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీని పెంపొందిస్తుంది.మీకు నమ్మకమున్నా లేకపోయినా పార్టనర్ విశ్వాసాలను గౌరవిస్తూ అప్పుడప్పుడూ స్పిరిచ్యువల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ఏ బంధంలోనైనా గౌరవం ముఖ్యం
కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య... మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి. 👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు. 👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.శ్రద్ధగా వినడమే తొలి అడుగు... ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను. 👉ప్రారంభ సెషన్లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి. 👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్మెంట్ టెక్నిక్‌ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది. 👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను. 👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ది మానిప్యులేటివ్ పార్టనర్
ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.అపనమ్మకం...రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.గ్యాస్ లైటింగ్... డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.థెరపీతో పరిష్కారం... అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్. ⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ⇒నీకోసమే అలా చేశాను. ⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా? ⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. ⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.వాళ్ల మాటలు నమ్మొద్దు⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. ⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి. ⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. ⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి. ⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. ⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. ⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
అంతరాలు పెరిగితే మొదటికే మోసం
హాయ్, హలో ఎలా ఉన్నారు? గుర్తున్నానా? లేదా రెండు వారాల గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయారా? నిజాయితీగా మీ సమాధానం కామెంట్స్ లో చెప్పండి. సరే, ఈ రోజు టాపిక్ ఈ గ్యాప్ పైనే.మొన్నా మధ్య మా కౌన్సెలింగ్ సెంటర్ కు ఓ జంట వచ్చారు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం క్లయింట్ల పేర్లు చెప్పకూడదు కాబట్టి అరుణ, సాగర్ అనుకుందాం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగైదు లక్షలు సంసాదిస్తున్నారు. గచ్చిబౌలి లో ఫ్టాట్, మంచి కారు, వీకెండ్ పార్టీలు, మంత్లీ ట్రిప్స్, ఏడాదికోసారి ఇంటర్నేషనల్ టూర్. హ్యాపీ లైఫ్. ఇది అందరికీ కనిపించే విషయం.కానీ లోలోపల అగ్గి రగులుతోంది. ఇద్దరి మధ్యా వాదనలు పెరిగాయి. దూరం పెరిగింది. గత ఆరునెలలుగా తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం ఒక లాయర్ ను సజెస్ట్ చేయమని ఫ్రెండ్ ను అడిగారు. విడాకులకు అప్లయ్ చేశాక కూడా కౌన్సెలింగ్ కు వెళ్లాలని, దానికన్నా ముందే వెళ్లడం మంచిదని నా పేరు సజెస్ట్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. మొదటి సెషన్ లో వారిద్దరితో విడివిడిగానూ, కలివిడిగానూ మాట్లాడి సమాచారం తీసుకున్నా. వారిద్దరూ విడిపోవడానికి కారణం ప్రేమ లేకపోవడం కాదని, పెరుగుతున్న దూరమని అర్థమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా, శారీరికంగా కలుస్తున్నా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా దూరమవుతున్నారని వారి మాటల ద్వారా తెలిసింది. కౌన్సెలింగ్, మేరిటల్ థెరపీ, రిలేషన్షిప్ ఎక్సర్ సైజ్ ల ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేశాను. దాంతో విడాకుల ఆలోచనకు స్వస్తి పలికి ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటల మధ్య ఏర్పడే వివిధ రకాల అంతరాలు, అదేనండీ గ్యాప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.అంతరాలను అర్థం చేసుకోవడం...పగలెలా ఉన్నా రాత్రికి ఒక్కటైతే చాలు, అన్ని సమస్యలూ మాయమవుతాయని పెద్దలు చెప్తుంటారు. అది ఆ కాలంలో నడిచిందేమో కానీ, ఈ కాలంలో వర్కవుట్ కాదు. జంట మధ్య శారీరక దూరంతో పాటు, ఎమోషనల్, సైకలాజికల్, ఇంటలెక్చువల్, స్పిరిచ్యువల్ గ్యాప్స్ కూడా ఏర్పడవచ్చు. వాటికి సకాలంలో అడ్రస్ చేయకపోతే ఇద్దరి మధ్య కనిపించని అగాధం ఏర్పడుతుంది. అందుకే వాటి గురించి తెలుసుకుని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది.ఎమోషనల్ డిస్టెన్స్...జంటలు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలు, భావోద్వేగాలు పంచుకోవడం తగ్గించినప్పుడు, మానివేసినప్పుడు ఎమోషనల్ గ్యాప్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, అరుణ తన కెరీర్ పడుతున్న స్ట్రెస్ గురించి సాగర్ కు చెప్పినప్పుడు, అది అందరికీ ఉండేదేగా, ప్రత్యేకం ఏముంది? అంటూ కొట్టిపడేశాడు. ఒకటి రెండు సార్లు అలా అనేసరికి తన ఒత్తిళ్ల గురించి చెప్పడం మానేసింది. తన కష్టాల్లో సాగర్ అండగా లేడని బాధపడటం మొదలుపెట్టింది. అది వారిద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ కు కారణమైంది.ఇంటలెక్చువల్ డిస్టెన్స్...తమకు ఎక్సయిట్మెంట్, ఇంటలెక్చువల్ స్టిములేషన్ కలిగించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మానేసినప్పుడు ఇది జరుగుతుంది. అరుణకు యద్దనపూడి నవలలంటే ఇష్టం. సాగర్ నాన్ ఫిక్షన్ చదువుతాడు. అది అతనిష్టం. కానీ ఈ కాలంలో యద్దనపూడి నవలలు చదవడమేంటని అరుణను వెక్కిరిస్తాడు. దాంతో వారిద్దరి మధ్య ఇంటలెక్చువల్ షేరింగ్ పూర్తిగా ఆగిపోయింది. దూరం పెరిగింది.ఎక్స్ పీరియన్షియల్ డిస్టెన్స్... ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండకపోవడమే కాదు, జంట మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలా చేయనప్పుడు దూరం పెరుతుంది. అరుణ, సాగర్ బిజీ వర్క్ లో పడిపోయారు. కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం తగ్గిపోయింది. కలిసి వంట చేయడం సంగతి సరేసరి. ఎక్కువ సందర్భాల్లో స్విగ్గీ, జొమాటోలపైనే ఆధారపడుతున్నారు.స్పిరిచ్యువల్ డిస్టెన్స్... భాగస్వాముల నమ్మకాలు, ఆచారాలు ఏకోన్ముఖంగా లేనప్పుడు ఈ దూరం ఏర్పడుతుంది. అరుణకు ఓ గురువంటే అమితమైన భక్తి. సాగర్ నాస్తికుడు. ఆ గురువు మోసగాడని రోజూ విమర్థిస్తుంటాడు. కాలక్రమేణా, అది వారిద్దరి మధ్య నిశ్శబ్దానికి దారితీసింది.ఫిజికల్ డిస్టెన్స్... శారీరక దూరం అంటే సెక్స్ లేకపోవడం అని అర్థం కాదు, కానీ రోజువారీ పనుల్లో స్పర్శ, ఆప్యాయత లేకపోవడం. ఆప్యాయంగా అరుణ చేతులు పట్టుకోవడం, సున్నితంగా కౌగిలించుకోవడం సాగర్ పూర్తిగా మర్చి పోయాడు. దూరాలను తగ్గించుకోవాలి... అరుణ, సాగర్ లానే మీ మధ్య కూడా ఇలాంటి దూరాలు, అంతరాలు ఉన్నాయా? భయపడాల్సిన అవసరమేం లేదు. ఆ అంతరాలను తగ్గించుకోవడానికి మీరిద్దరూ ప్రయత్నం చేస్తే చాలు. అరుణ, సాగర్ లకు చెప్పిన కొన్ని టిప్స్ ఇప్పుడు మీకు కూడా చెప్తా. మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతిరోజూ సమయాన్ని కేటాయించండి. గంటలు గంటలు అవసరం లేదు. కాఫీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఆ సమయంలో మొబైల్ చూడకుండా పార్టనర్ చెప్పేది వినాలి. మీ మీ వ్యక్తిగత అభిరుచులను అలాగే ఉంచుకుంటూ, ఇద్దరికీ ఇష్టమైన ఇంటలెక్చువల్ అంశం కనుక్కోండి, తరచూ దాని గురించి చర్చించుకోండి. మీరిద్దరూ ఎంజాయ్ చేసే వనులకు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించండి. ఇది కలిసి వంట చేయడం, నడవడం లేదా అడ్వంచర్ ట్రిప్ లాంటిది ఏదైనా కావచ్చు.ఒకరి ఆధ్యాత్మిక విశ్వాసాలను మరొకరు గౌరవించుకోండి. మీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయండి. శారీరక సాన్నిహిత్యం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. దగ్గరగా కూర్చోవడం, చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులు ఫిజికల్ ఇంటిమసీని పెంచుతాయి. కొన్ని జంటలు ఈ పనులన్నీ చేస్తున్నా గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. ఇరువురి మధ్య పరిష్కరించుకోని వైరుధ్యాలు, కనిపించని ఒత్తిళ్లు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, ఫియర్ ఆఫ్ వల్నరబిలిటీ అందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేకంటే కౌన్సెలింగ్ సెంటర్ కు వెళ్లడం మంచిదని గుర్తించండి. విష్ యూ హ్యాపీ లైఫ్.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066Psy.vishesh@gmail.com -
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్‌ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
ఏ బంధంలోనైనా హద్దులు అవసరం
ప్రియకు 28 ఏళ్లు. ఒక అంతర్జాతీయ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. రోహిత్‌తో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. మొదట్లో అంతా బానే ఉంది. కాలం గడిచేకొద్దీ వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. తన డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్ వరకూ అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. తన ప్రవర్తనను, స్నేహాలను కూడా నియంత్రించడం ప్రియకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు రోహిత్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. తానేం చేయాలో ప్రియకు అర్థంకాక కౌన్సెలింగ్ కు వచ్చింది.స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయంప్రేమంటే రెండు మనసుల కలయిక, పెళ్లంటే రెండు జీవితాల కలయిక. మనదేశంలో మాత్రం పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కనీస అవగాహన లేకపోయినా... కులం, మతం, జాతకం, ఆర్థిక స్థాయిలు కలిస్తే చాలు, పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ జంటపై ఉంటుంది. ఇప్పుడదే భారం ప్రియపై ఉంది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి.. కుటుంబ గౌరవానికి, సంప్రదాయానికి మధ్య పోరాటం నడుస్తోంది.కాలంతో పాటు మారని మనుషులు... సాంప్రదాయ పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన వివాహంలో.. భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రోజులొచ్చినా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే నడవాలనే భావజాలంలోనే ఉంటారు, ఉంటున్నారు. రోహిత్ ది కూడా అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రియ తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ కు వచ్చింది. ఆమె చెప్పినదంతా విన్నాక, వారికి ‘హెల్తీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని అర్థమైంది.టాక్సిక్ రిలేషన్స్ లక్షణాలు...• జంటలో ఒకరి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం• తరచుగా వ్యంగ్యం, నిందలు, అవమానాలు• ఫోన్ చెక్ చేయడం, ఫ్రెండ్స్, పేరెంట్స్‌కు దూరం చేయడం• పార్టనర్ ను సంప్రదించకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం• పార్టనర్ ను కంట్రోల్ చేయడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం• పార్టనర్ తెలివిని, నిర్ణయాలనూ చులకన చేయడం• ఎవరితో క్లోజ్‌గా ఉన్నా అసూయ పడటం, దూరం చేయడానికి ప్రయత్నించడం• ప్రతీ చిన్న విషయానికీ గొడవపడుతుండటంసరిహద్దుల అవసరం... ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలనీ, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలనీ అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు, మీ అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతీ జంటకూ హెల్తీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. • ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. • ‘‘నువ్వలా చేస్తున్నావు’’, ‘‘నువ్విలా అంటున్నావు’’ అని కాకుండా... ‘‘నేనిలా అనుకుంటున్నాను’’, ‘‘నేనిలా ఫీలవుతున్నాను’’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉదాహరణకు, ‘‘నేనే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పినప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇద్దరికీ నచ్చేదాని గురించి మాట్లాడుకుందామా?’’ అని చెప్పడం, ఇష్టంలేకుండా ఒప్పుకోవడం నుంచి మాట్లాడి పరిష్కరించుకోవడానికి దారితీస్తుంది. • ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. వారి స్వేచ్ఛకు, స్నేహాలకు విలువనివ్వడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. అది వారిని నచ్చిన పాటలు వినడం కావచ్చు, తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం కావచ్చు. • మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాల్లోనూ మార్పు వస్తుందని గుర్తించాలి. సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతుల్యత సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. • సరిహద్దులను సెట్ చేయడం సవాలే. మీ భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. • మీ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.ప్రియ, రోహిత్ లకు మూడు సెషన్లలో వీటిని వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయించాను. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ వాట్సప్ లో పలకరిస్తుంటారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
అన్ని బంధాలకూ మూలం బాల్యంలోనే!
హలో ఫ్రెండ్స్,గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.నాలుగు రకాలు... Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.మరేం చెయ్యాలి?సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.• మీ అటాచ్మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు. • మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది. • బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. • రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. • బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
నీ కోసం నువ్వు.. అన్ని బంధాలకూ మూలమిదే!
కనెక్షన్ కార్నర్‌కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.ప్రేమించలేని మాయ..మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది. మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను. 👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది. 👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది. 👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్లకు దారితీసింది.మీకోసం కొన్ని చిట్కాలు.. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి. 👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి. 👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి. 👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. 👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి. 👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది. 👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది. 👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి. 👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com