కనెక్షన్ కార్నర్‌కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం.
కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.
ప్రేమించలేని మాయ..
మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది.
మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.
బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.
అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..
కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను.
👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.
👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది.
👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది.
👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్‌లకు దారితీసింది.
మీకోసం కొన్ని చిట్కాలు..
మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి.
👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి.
👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి.
👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి.
👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి.
👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది.
👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది.
👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.
👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి.
👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.
సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment