family affairs
-
వదిలేస్తారనే భయంతో పెళ్లికి దూరం..
సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది. కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.అప్పటి బాధ.. ఇప్పుడు భయం..సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు. ఆరు నెలల్లో ఆందోళన దూరం... కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది. సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆరు నెలల తర్వాత సారా డేవిడ్‌ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
నీ కోసం నువ్వు.. అన్ని బంధాలకూ మూలమిదే!
కనెక్షన్ కార్నర్‌కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.ప్రేమించలేని మాయ..మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది. మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను. 👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది. 👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది. 👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్లకు దారితీసింది.మీకోసం కొన్ని చిట్కాలు.. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి. 👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి. 👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి. 👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. 👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి. 👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది. 👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది. 👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి. 👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
బంధాలే నిజమైన బలం
హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.బంధాలే జీవితం..జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్‌వర్క్‌లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి. ఆరోగ్యానికి బూస్టర్లు..మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది. తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.బంధాల తోటను సాగుచేద్దాం.. జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.మీ.. సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
‘అమ్మా... నీకు కృతజ్ఞతలు’
కన్నతల్లిని నిష్టూరం ఆడిననటి సంగీత. తల్లీకూతుళ్ల మధ్య ఆస్తిపాస్తుల అగ్గి నటీనటుల జీవితాలు వెండితెర మీద వెలుగుతూ ఉంటాయి. కాని చాలామంది తారలు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు ‘మా జీవితాలు పూలపాన్పులు కావు... ముళ్లబాటలు’ అని. కీర్తి ఉన్నచోట, సంపద ఉన్న చోట కుటుంబ సంబంధాలు మలుపులు తిరుగుతుంటాయి. పరీక్షకు నిలబెడుతుంటాయి. సొంత మనుషులు, స్నేహితులు, దూరపు చుట్టాలు అందరూ ఏదో ఒక మేరకు ‘గేమ్’ ఆడే పరిస్థితులు ఉంటాయి. వాటిలోకి దిగని మనుషులను పొందిన వారు ధన్యులు. లేని వారు దురదృష్టవంతులు. నటి కాంచన ఉదంతం మనకు తెలుసు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ కన్న తల్లి కన్నతండ్రి నిర్దాక్షిణ్యత వల్ల ఆస్తులన్నింటినీ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. సొంత వాళ్లే ద్రోహం తలపెట్టారని తెలిసి తట్టుకోలేక ఏళ్ల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లి జీవించింది. చివరకు ఆమెకు కొద్దిపాటి ఆస్తి దక్కింది కానీ ఈలోపు ఆమె పడిన క్షోభ మామూలు కాదు. సీనియర్ నటి మంజులకు, ఆమె కుమార్తె వనితకు జరిగిన ఘర్షణ కూడా లోక విదితం. కుమార్తె ప్రేమ వివాహాన్ని అంగీకరించని మంజుల ఆమెకు పుట్టిన కుమారుణ్ణి తన పెంపకంలో ఉంచుకుంది. ఆ తర్వాత గొడవ కోర్టులకెక్కింది. నటి సౌందర్య ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తున్నాయి. 2004 నాటి విమాన ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ చనిపోయారు. అయితే 2003లోనే ఆమె ఒక విల్లు రాసిందని ఆమె ఆస్తిపాస్తులు కుటుంబ సభ్యులకు సమానంగా చెందాలని అందులో ఉందని సౌందర్య తల్లి కె.ఎస్.మంజుల, సౌందర్య భర్త రఘు ఒక విల్లును ప్రవేశ పెట్టారు. కాని ఆ ప్రకారం చూసినా తమ వాటా తమకు దక్కకుండా చూస్తున్నారని సౌందర్య వదిన నిర్మల తన కుమారుడి చేత కోర్టులో కేసు వేయించింది. తాజాగా ఇప్పుడు నటి సంగీత ఇంటి గొడవ వార్తలకెక్కింది. ‘శివపుత్రుడు’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖడ్గం’ వంటి సినిమాలతో తెలుగులో ప్రాచుర్యం పొందిన సంగీత చెన్నైలో భర్త క్రిష్, కుమార్తె షివియాతో తన సొంత ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే పై అంతస్తులో ఆమె, కింది అంతస్తులో ఆమె తల్లి భానుమతి ఉంటారు. కాని ఇటీవల సంగీత తల్లి భానుమతి సంగీత మీద బహిరంగ ఆరోపణలు చేసింది. ‘నా కుమార్తె నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. ఆ ఇల్లు మా మామగారి కాలం నుంచి మాకు వచ్చింది. అందులో సంగీతకు భాగం లేదు’ అనేది ఆమె ఆరోపణ. దీని మీద సంగీతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినపడ్డాయి. మూడు రోజుల క్రితం సంగీత ట్విట్టర్ ద్వారా తల్లిని భావోద్వేగంతో నిష్టూరం ఆడారు. ఆ ట్వీట్ ఇలా ఉంది: ‘అమ్మా... నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. చదువుకుంటూ ఉండగా 13 ఏళ్ల వయసులో స్కూలు మాన్పించినందుకు కృతజ్ఞతలు. నా చేత ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు. మద్యానికీ డ్రగ్స్‌కూ బానిసయ్యి ఏనాడూ పని చేయని నీ ఇద్దరు కొడుకుల సౌఖ్యం కోసం నన్ను దగా చేసినందుకు కృతజ్ఞతలు. నీ ఆదేశాలు లెక్కచేయలేదని మన సొంత ఇంటిలో నన్ను ఒంటరిని చేసినందుకు కృతజ్ఞతలు. నాకై నేను పోరాడి దారి ఏర్పరుచుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడినందుకు కృతజ్ఞతలు. పెళ్లయ్యాక నిత్యం నాకూ నా భర్తకూ అంతరాయం కలిగిస్తూ మా మానసిక శాంతిని దెబ్బ తీసినందుకు కృతజ్ఞతలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో నాకు నేర్పినందుకు కృతజ్ఞతలు. ఆఖరుగా ఇటీవలి నిందలకు, ఆరోపణలకు కృతజ్ఞతలు. తెలుసో తెలియకో నువ్వు చేసిన మంచిపని ఏమిటంటే నన్ను ఒక దద్దమ్మ స్థాయి నుంచి ఒక పోరాడే మహిళగా, శక్తిమంతమైన ఇల్లాలిగా నిలబడేలా చేశావు అందుకు తప్పకుండా నేను నీకు కృతజ్ఞురాలినై ఉంటాను. నీ అహం నుంచి బయటపడిన నాడు తప్పక నన్ను చూసి గర్వపడతావు’... సంగీత భర్త, గాయకుడు అయిన క్రిష్ కూడా సంగీతకు బాసటగా నిలిచాడు. ‘నీ నిర్ణయాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని అతడు ట్వీట్ చేశాడు.సంగీత ట్వీట్లో ఎంతో నొప్పి ఉందని చదివిన వాళ్లకు అనిపిస్తుంది.వెలిగే తారల జీవితాల్లోని ఇటువంటి పార్శా్వలను మన జీవితాల ఘటనలతో పోల్చి చూసుకోవాలనే ఆలోచన వస్తుంది. మానవ సంబంధాలు బూటకమో శాశ్వతమో అనే చింతను రాజేస్తుంది. -
'ఆడాళ్లకు మాతో వేగడం కష్టమే'
తమలా తరచు ప్రయాణాలు చేసే క్రీడాకారులతో వేగడం ఆడాళ్లకు కష్టమేనని దక్షిణాఫ్రికాకు చెందిన సన్‌రైజర్స్ ఫాస్ట్‌బౌలర్ డేల్ స్టెయిన్ అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స జట్టుతో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వచ్చిన స్టెయిన్.. మీడియాతో మాట్లాడాడు. జీవితంలో చాలా కాలం పాటు తాము కుటుంబానికి దూరంగానే గడపాల్సి ఉంటుందని, అదే వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని అన్నాడు. అయితే తాను చెప్పేది శృంగార జీవితం గురించి మాత్రం కాదని, అసలు భార్యాభర్తల బంధానికే ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమని స్టెయిన్ చెప్పాడు. అసలు ఇంటికి వెళ్తున్నామో, వస్తున్నామో కూడా తెలియకుండా భాగస్వామి గడపడం చాలా కష్టమన్నాడు. ఇక ఇప్పుడు మాత్రం తాను ఏ దేశం వెళ్లాల్సి వచ్చినా ముందుగానే తన భార్యను కూడా అక్కడకు తీసుకొస్తున్నానని తెలిపాడు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ కూడా తనతో చాలా తిరిగేదని అన్నాడు.