కన్నతల్లిని నిష్టూరం ఆడిననటి సంగీత. తల్లీకూతుళ్ల మధ్య ఆస్తిపాస్తుల అగ్గి
నటీనటుల జీవితాలు వెండితెర మీద వెలుగుతూ ఉంటాయి. కాని చాలామంది తారలు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు ‘మా జీవితాలు పూలపాన్పులు కావు... ముళ్లబాటలు’ అని. కీర్తి ఉన్నచోట, సంపద ఉన్న చోట కుటుంబ సంబంధాలు మలుపులు తిరుగుతుంటాయి. పరీక్షకు నిలబెడుతుంటాయి. సొంత మనుషులు, స్నేహితులు, దూరపు చుట్టాలు అందరూ ఏదో ఒక మేరకు ‘గేమ్’ ఆడే పరిస్థితులు ఉంటాయి. వాటిలోకి దిగని మనుషులను పొందిన వారు ధన్యులు. లేని వారు దురదృష్టవంతులు. నటి కాంచన ఉదంతం మనకు తెలుసు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ కన్న తల్లి కన్నతండ్రి నిర్దాక్షిణ్యత వల్ల ఆస్తులన్నింటినీ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. సొంత వాళ్లే ద్రోహం తలపెట్టారని తెలిసి తట్టుకోలేక ఏళ్ల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లి జీవించింది. చివరకు ఆమెకు కొద్దిపాటి ఆస్తి దక్కింది కానీ ఈలోపు ఆమె పడిన క్షోభ మామూలు కాదు.
సీనియర్ నటి మంజులకు, ఆమె కుమార్తె వనితకు జరిగిన ఘర్షణ కూడా లోక విదితం. కుమార్తె ప్రేమ వివాహాన్ని అంగీకరించని మంజుల ఆమెకు పుట్టిన కుమారుణ్ణి తన పెంపకంలో ఉంచుకుంది. ఆ తర్వాత గొడవ కోర్టులకెక్కింది. నటి సౌందర్య ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తున్నాయి. 2004 నాటి విమాన ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్‌నాథ్ చనిపోయారు. అయితే 2003లోనే ఆమె ఒక విల్లు రాసిందని ఆమె ఆస్తిపాస్తులు కుటుంబ సభ్యులకు సమానంగా చెందాలని అందులో ఉందని సౌందర్య తల్లి కె.ఎస్.మంజుల, సౌందర్య భర్త రఘు ఒక విల్లును ప్రవేశ పెట్టారు. కాని ఆ ప్రకారం చూసినా తమ వాటా తమకు దక్కకుండా చూస్తున్నారని సౌందర్య వదిన నిర్మల తన కుమారుడి చేత కోర్టులో కేసు వేయించింది. తాజాగా ఇప్పుడు నటి సంగీత ఇంటి గొడవ వార్తలకెక్కింది.
‘శివపుత్రుడు’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖడ్గం’ వంటి సినిమాలతో తెలుగులో ప్రాచుర్యం పొందిన సంగీత చెన్నైలో భర్త క్రిష్, కుమార్తె షివియాతో తన సొంత ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే పై అంతస్తులో ఆమె, కింది అంతస్తులో ఆమె తల్లి భానుమతి ఉంటారు. కాని ఇటీవల సంగీత తల్లి భానుమతి సంగీత మీద బహిరంగ ఆరోపణలు చేసింది. ‘నా కుమార్తె నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. ఆ ఇల్లు మా మామగారి కాలం నుంచి మాకు వచ్చింది. అందులో సంగీతకు భాగం లేదు’ అనేది ఆమె ఆరోపణ. దీని మీద సంగీతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినపడ్డాయి. మూడు రోజుల క్రితం సంగీత ట్విట్టర్ ద్వారా తల్లిని భావోద్వేగంతో నిష్టూరం ఆడారు.
ఆ ట్వీట్ ఇలా ఉంది:
‘అమ్మా... నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. చదువుకుంటూ ఉండగా 13 ఏళ్ల వయసులో స్కూలు మాన్పించినందుకు కృతజ్ఞతలు. నా చేత ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు. మద్యానికీ డ్రగ్స్‌కూ బానిసయ్యి ఏనాడూ పని చేయని నీ ఇద్దరు కొడుకుల సౌఖ్యం కోసం నన్ను దగా చేసినందుకు కృతజ్ఞతలు. నీ ఆదేశాలు లెక్కచేయలేదని మన సొంత ఇంటిలో నన్ను ఒంటరిని చేసినందుకు కృతజ్ఞతలు. నాకై నేను పోరాడి దారి ఏర్పరుచుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడినందుకు కృతజ్ఞతలు. పెళ్లయ్యాక నిత్యం నాకూ నా భర్తకూ అంతరాయం కలిగిస్తూ మా మానసిక శాంతిని దెబ్బ తీసినందుకు కృతజ్ఞతలు.
ఒక తల్లి ఎలా ఉండకూడదో నాకు నేర్పినందుకు కృతజ్ఞతలు. ఆఖరుగా ఇటీవలి నిందలకు, ఆరోపణలకు కృతజ్ఞతలు. తెలుసో తెలియకో నువ్వు చేసిన మంచిపని ఏమిటంటే నన్ను ఒక దద్దమ్మ స్థాయి నుంచి ఒక పోరాడే మహిళగా, శక్తిమంతమైన ఇల్లాలిగా నిలబడేలా చేశావు అందుకు తప్పకుండా నేను నీకు కృతజ్ఞురాలినై ఉంటాను. నీ అహం నుంచి బయటపడిన నాడు తప్పక నన్ను చూసి గర్వపడతావు’...
సంగీత భర్త, గాయకుడు అయిన క్రిష్ కూడా సంగీతకు బాసటగా నిలిచాడు. ‘నీ నిర్ణయాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని అతడు ట్వీట్ చేశాడు.సంగీత ట్వీట్‌లో ఎంతో నొప్పి ఉందని చదివిన వాళ్లకు అనిపిస్తుంది.వెలిగే తారల జీవితాల్లోని ఇటువంటి పార్శా్వలను మన జీవితాల ఘటనలతో పోల్చి చూసుకోవాలనే ఆలోచన వస్తుంది.
మానవ సంబంధాలు బూటకమో శాశ్వతమో అనే చింతను రాజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment