
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ, నటి సంగీత దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో సంగీత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. లేటు వయసులో 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు తమకు కుమార్తె జన్మించినట్లు సోషల్‌మీడియా ద్వారా నటి సంగీత తెలిపింది. దీంతో వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
రెడిన్ కింగ్‌స్లీ, నటి సంగీత దంపతులకు కుమార్తె జన్మించడంతో వారి కుటుంబంలో మరింత సంతోషం నెలకొంది. ఈ క్రమంలో ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది. 'మా లిటిల్ ప్రిన్సెస్‌ను అందరూ ఆశీర్వదించాలని సంగీత కోరింది. మా జీవితంలో అద్బుతమైన కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో మీరందరూ నన్ను ఎంతగానో ప్రేమించారు. ఈ శుభవార్తతో మా ఫ్యామిలీ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇంతకు మించిన మధురమైన క్షణాలు ఏవీ ఉండవు అనుకుంటున్నాను.' అని సంగీత తెలిపింది.

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమాతో రెడిన్ కింగ్‌స్లీ బాగా పాపులర్ అయ్యాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.
సంగీతకు రెండో పెళ్లి
గతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్‌తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది.