
నటి సంగీత ఒకప్పుడు సౌత్ ఇండియాలో పాపులర్ హీరోయిన్‌గా కొనసాగింది. తెలుగులో ఖడ్గం చిత్రంలో పెద్ద సినిమా నటి కావాలన్న ఆశతో పల్లెటూరి నుంచి తల్లితో కలిసి హైదరబాద్‌కు వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమలాడుతూ కంట తడిపెట్టే సన్నివేశంలో ఆమె నటనను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అలాంటి సంగీత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగునే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించిన ఈమె గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు.

వివాహానంతరం గుణ చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పారు. కారణం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుందన్నారు. తనకు తమిళంలో నటించడం ఇష్టం లేదు అంటే తమిళ అభిమానులు ఆగ్రహించవచ్చని అయినా తాను నిజమే చెబుతున్నానన్నారు. కోలీవుడ్‌లో నటించేటప్పుడు సరైన మర్యాద ఉండదన్నారు.

నిజం చెప్పాలంటే తమిళంలో తానెవరినీ అవకాశాలు అడిగింది కూడా లేదన్నారు. ఎందుకంటే తెలుగులో తనకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. అంతే కాదు మంచి పారితోషికం, అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే తమిళంలో కొందరు అవకాశాల కోసం ఫోన్ చేసినా, వారు మర్యాద లేకుండా మాట్లాడతారన్నారు. వారే తనకు జీవితాన్ని ఇస్తున్నట్లు మాట్లాడతారని అన్నారు. తన పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించేసి వచ్చి నటించి వెళ్లండి అని అంటారన్నారు. తనకు తమిళ చిత్ర పరిశ్రమలో మర్యాద లేదని, అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదని సేర్కొన్నారు. ఈమె చెప్పిన విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment