సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది.
కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.
అప్పటి బాధ.. ఇప్పుడు భయం..
సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.
బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు.
ఆరు నెలల్లో ఆందోళన దూరం...
కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.
ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది.
సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.
ఆరు నెలల తర్వాత సారా డేవిడ్‌ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.
సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.
సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment