bonding
-
వదిలేస్తారనే భయంతో పెళ్లికి దూరం..
సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది. కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.అప్పటి బాధ.. ఇప్పుడు భయం..సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు. ఆరు నెలల్లో ఆందోళన దూరం... కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది. సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆరు నెలల తర్వాత సారా డేవిడ్‌ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
బంధాలే నిజమైన బలం
హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.బంధాలే జీవితం..జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్‌వర్క్‌లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి. ఆరోగ్యానికి బూస్టర్లు..మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది. తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.బంధాల తోటను సాగుచేద్దాం.. జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.మీ.. సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
నా కూతురితో అలా ఉంటాను కాబట్టే...భానుమతి గారు నన్ను అలా చేసేసరికి నాకు
-
ఒకనాటి వేసవి
రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి ఉంచేవారు. తెల్లారి పచ్చిమిర్చి అందుకునేవారు. దాన్ని మధ్యకు చీల్చి, ఉప్పుగల్లు దూర్చి, నాష్టాలో ఒక ముద్ద అది... పంటి కింద ఇది. బాగుండేది. నీటిసొద జాస్తి. దూరం దూరం పోయి, చాలని తాడుకు కొత్తది ముడివేసి, అడుగు నుంచి లాగి, బిందె భుజాన మోసి... అయితేనేం? నేస్తులతో కలసి కబుర్లాడుకుంటూ నడుస్తుంటే బాగుండేది. తొణికే నీళ్లు వీపున చరుస్తూ ఉన్నా బాగుండేది. కలిగిన వాళ్లు కొత్త తాటాకుల పందిరి వేసేవారు. కుదిరినవారు కొబ్బరాకులతో నీడ పరిచే వారు. కింద నిలబడితే ఆ చలువదనం బాగుండేది. ఐసుబండి ఆపితే ఆ జిల్లుదనమూ బాగుండేది. కోసి చూపించమని అడక్కుండా పుచ్చకాయ కొనేదే లేదు. త్రికోణాకార ముక్కను అప్పటికప్పుడు తినకుండా వదిలిందీ లేదు. ముంతమామిళ్లవి పలు రంగులు. వాటి మరకలు బట్టలు మీద పడితే వీపు మీద అమ్మ జాజ్ డ్రమ్ కొట్టేది. పచ్చి తాటాకుల పొట్లాల్లో ముంజలు తెచ్చేవారు. ఆపి బేరం చేస్తే ఒకో పొట్లాన్ని కొడవలితో కోసి విడిపించేవారు. ముదురు ముంజకాయ కొబ్బరికి అటుఇటుగా ఉండేది. లేతది నోట అమృతం చిమ్మేది. తాటికాయలతో చేసిన బండికి టోల్గేట్ అడిగే దమ్ము ఎవరికీ లేదు. తెల్లరంగు స్ట్రాంగ్ పిప్పరమెంట్ దవడన పెట్టుకుంటే అదే పెట్రోలుగా పరుగు తీసేది. చింత చిగురొచ్చేది. బంగారం రేటుతో తూగేది. మునగచెట్లు విరగ గాసేవి. వేపచెట్టు బ్రాండు ఏ.సి ప్రతి రచ్చబండ దగ్గర కూల్ టెంపరేచర్ మెయిన్ టెయిన్ చేసేది. వీధిన తిరగలేని అవ్వ వేరుశనక్కాయలను అక్కడే అమ్మేది. రూపాయి చేజిక్కించుకుని మ్యాట్నీకి దౌడు తీస్తే ఉబ్బరింత. బాగుండేది. కరెంటు పోయి తలుపులు తీస్తే జొరబడే చల్లగాలి. బాగుండేది. కడప నుంచి కర్బూజ పండ్లు వస్తాయి. చక్కెర జల్లి కాసేపు వదిలి తింటే జీరాను తలపిస్తాయి. నిమ్మకాయల రేటు గజనిమ్మకాయల సైజుకు వెళుతుంది. సుగంధ వేర్లు... హలో మేమున్నాం అంటాయి. ఆరెంజి సోడా ఆగిఆగి తాగమని షోకులు పోతుంది. చలివేంద్రాల దగ్గరుండే పొడవు కాడల గరిటెలు ఆ తర్వాత ఏమవుతాయో ఏమో! పాత గొడుగులకు మర్యాద దక్కి డ్యూటీ ఎక్కుతాయి. వాసానికి దూర్చిన విసనకర్ర దగ్గరి స్నేహితుడిలా పలకరిస్తుంది. పిచ్చుకల హడావిడి మీటింగుల మధ్య మధ్యాహ్నపు కునుకు అమోఘంగా ఉంటుంది. సాయంత్రం నాలుగు లోటాలు కుమ్మరించుకుంటే అదే స్వర్గం. డాబా మీద నీళ్లు జల్లితే రాత్రికి చుక్కలు చల్లగా పలకరిస్తాయి. నిద్రకు ఇంటిల్లిపాది మేడెక్కితే పరుపులున్నవారు శ్రీమంతులు. టేబుల్ ఫ్యాను తిప్పగలిగేవారు కుబేరులు. తల దగ్గర నీళ్ల చెంబుకు బోర్లించిన గ్లాసే మూతవుతుంది. మేను వాల్చాక స్తంభించ కుండా గాలి వీస్తే పరమ పరవశం. ఆవకాయ సెంటిమెంట్. అర ఎకరం అమ్మైనా లంక మిరపకాయలు, గానుగ నూనె, ఆవాలు, మెంతులు, పచ్చడి మామిడి కాయలు వెల జరిగేవి. ముహూర్తం చూసి మరీ అమ్మమ్మ పని మొదలెట్టేది. కొడుకు నడుం మీద చేతులతో సాయానికి సిద్ధమయ్యేవాడు. కోడలు చూపుతో చెప్తే చేత్తో అందుకునేది. పిల్లలు కిలకిలారావాలు చేసేవారు. ఎర్రగా కలిపిన తొలిముద్ద పెట్టడానికి ప్రతి చిన్నారికి ఇంట పెద్ద తలకాయ ఉండేది. చుట్టాలొచ్చేవారు. పిల్లల్ని తెచ్చేవారు. ఆటల్లో ఉత్తుత్తి విందు ఒండి బాదం ఆకుల్లో బలవంతాన తినిపించేవారు. ఏటికి చాటుగా వెళ్లినవారు జేబుల్లో ఇసుకతో దొరికిపోయేవారు. ఆడపిల్లలు తీరిగ్గా గోరింటాకు పెట్టుకుని పడుకుంటే తెల్లారేసరికి అరచేతుల్లో చంద్రుళ్లు ఉదయించేవారు. పైతరగతికి వెళ్లే ముందొచ్చే వేసవికై పిల్లలు ఎదురు చూసేవారు. తీక్షణ ఆనందాల ఎండలకై ఆరాటపడేవారు. ఇప్పటిలా కాక రోషమున్న మల్లెలు వేసవిలోనే గుబాళించేవి. సీజను ముగియక ముందే స్త్రీలను జడల్లో వీలైనన్ని తురుముకోమనేవి. కనకాంబరాలతో కలిపి అల్లితే వాటిదొక అందం. మరువంతో, దవనంతో జత చేస్తే మరో చందం. మాలలు కట్టడానికి అమ్మలక్కలంతా కూడి ఇకఇకలు పకపకలు పోతుంటే చూడటం బాగుండేది. ప్రతి ఇంటి గోడ మీద అమ్మాయి పూలజడ ఫోటో కళకళలాడేది. తీపి మామిడిపండ్లు ఈ దేశవాసుల కోసమే కాసేవి. దిల్ పసంద్ ఎంతో పసందుగా ఉండేది. బంగినపల్లి ప్రతి ఇంటా కనీసం చేరేది. రసాలు మాత్రమే పిండుకు తాగేవారు కొందరు. ఇమాం పసంద్కై పట్టుబట్టే వారు ఇంకొందరు. నీలాలు ఆఖరున వచ్చేవి. తోతాపురికి ఉప్పూకారాలే గతి. బిగ్ బాస్కెట్ లేని కాలంలో కారు మాట్లాడుకుని చలో చిత్తూరనేవారు. నూజివీడుకు పదమనేవారు. మధుర ఫలాల బుట్టలు ప్రాప్తమున్నవారికి దక్కేవి. యుగాలుగా వేసవి ఇలాగే ఉంది. ప్రియజనుల కోసం ఇలా పునరావృతం అవుతూనే ఉంది. మనిషే ఈ రుతువుల సౌందర్యానికి ఎడంగా జరుగుతున్నాడు. వేసవి చెప్పే తీర్పు– విరామం ప్రకటించుకోమని, ఆటవిడుపుపై దృష్టి పెట్టమని, అయినవారి సాంగత్యాన్ని ఆస్వాదించమని! ఇవాళ మనిషి వెళ్లడానికి ఊరు లేనివాడు. పిల్లలతో వెళ్లడానికి బంధువులు, బంధాలు నిలబెట్టుకోని వాడు. అన్నీ ఉన్నా ఎందుచేతనో మనసు ఇరుకు చేసుకుంటున్నాడు. ఇంటి సభ్యులు తప్ప బయటి మనిషి వచ్చి ఒకపూట చేయి కడగని నిరుపేదవుతున్నాడు. సూర్యనారాయణమూర్తి వేసవిలో తన దగ్గర ఉన్నది ఏదీ దాచుకోకుండా ధారాళంగా భూమి మీద ప్రసరింపజేసి ఆ వెంటనే మొలకలెత్తే వర్షానికి కారకుడవుతాడు. ఈ వేసవిలో మనం కూడా మనలో దాగి ఉన్న, ఎక్కడో అణిచివేయబడి ఉన్న, మరుపున పడి ఉన్న అనుబంధాల్ని ఏదో మేరకు వెలికి తీసి, ఒకనాటి వేసవిని, ఒకనాటి ఆనందాల్ని పొందలేమా? ప్రయత్నిద్దామా? బాగుంటుంది. -
Viral Video: అన్న, చెల్లెల బాండింగ్ చూస్తే ముచ్చటేస్తుంది ..!
-
అతడు ఆమె ఫోన్
స్త్రీ పురుష సంబంధాలు ఎంత ఆకర్షణీయమైనవో అంత లోతైనవి. సామాజిక సూత్రాలకు, నైతిక విలువలకు ఎడంగా జరిగి స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పడితే అది ఏ ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేము. ఆగి, ఆలోచించుకునే వాస్తవిక స్పృహ ఇవ్వకుండా స్త్రీ పురుషుల అనంగీకార అనుబంధాలకు ఎడతెగని వాహికగా ఉంటున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎటు తీసుకెళుతోంది అని కూడా ఆలోచింపచేస్తున్న సినిమా ‘గెహరాయియా’. అమేజాన్‌లో తాజా విడుదల. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. కాని ఎల్లకాలం ఎల్లవేళలా ఇరుపక్షాల మనసు అన్ని రకాల కట్టుబాట్లకు లొంగదు. అది ఒక్కోసారి ‘ఇదే నాకు కావలసింది’ అనుకుంటుంది. ‘ఉన్నది సరి కాదు... ఇది సరిౖయెనది’ అనుకుంటుంది. ‘ఉన్నది ఉండగా... ఇది కూడా ఉంటే ఏమవుతుంది?’ అనుకోనూవచ్చు. ‘ఇది ఒక చిన్న సరదా... ఎవరికి తెలుస్తుందిలే’ అని భావించవచ్చు. స్త్రీ, పురుషుల అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. ఒకసారి రంగంలోకి దిగాక పరిణామాలు అంచనాలకు తగినట్టుగా ఉండవు. సంక్షోభాలు తెచ్చిపెడతాయి. అశాంతి, ప్రమాదం, హింస, పగ, పరారీ... ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఈ పరిణామాలు వేగంగా జరిగే అవకాశం తక్కువ కమ్యూనికేషన్ పరిమితుల వల్ల. ఇవాళ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. అది అనుక్షణ ప్రసారానికి సంభాషణకి వీలు కల్పిస్తోంది. దీని వల్ల ఎలాంటి మంచి జరుగుతున్నదో కాని పత్రికలలో చెడు పరిణామాల వార్తలే చూస్తూ ఉంటాం. ఈ సినిమా కథ ఏమిటి? రెండు జంటలు. దీపికా పడుకోన్– ధైర్య కరవా... సిద్ధాంత్ చతుర్వేది– అనన్యా పాండే. రెండు జంటలూ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాయి. రెండు జంటలూ పెళ్లి ఆలోచనల్లో కూడా ఉంటాయి. దీపికా యోగా ఇన్స్ట్రక్టర్. ఆమె బాయ్‌ఫ్రెండ్ ధైర్య కరవా రచయితగా స్ట్రగుల్ అవుతుంటాడు. అనన్యా పాండే శ్రీమంతురాలు. ఆమె బోయ్‌ఫ్రెండ్ సిద్ధాంత్ చతుర్వేది కార్పొరేట్ దిగ్గజం. దీపికా, అనన్యా కజిన్స్ అవుతారు కనుక ఈ నలుగురూ చాలా రోజుల తర్వాత కలుస్తారు. అది కూడా అత్యంత విలాసవంతమైన చిన్న పడవ మీద... సముద్రంలో ప్రయాణిస్తూ. కాని దీపికా పట్ల సిద్ధాంత్ ఆకర్షితుడవుతాడు. ఇద్దరూ తమ లివ్ ఇన్ పార్ట్నర్లను చీట్ చేస్తూ రిలేషన్లోకి వెళతారు. తాను చేస్తున్న వెంచర్ పూర్తయితే దానికి అందాకా ఆర్థికంగా మద్దతుగా ఉంటున్న అనన్యతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీపికతో చెబుతాడు సిద్ధాంత్. వారిద్దరూ అలాంటి అంచనాతో తమ రహస్య బంధాన్ని కొనసాగిస్తారు. కాని అంచనా తప్పుతుంది. సిద్ధాంత్ వెంచర్ నిధుల గోల్‌మాల్‌లో మునుగుతుంది. మరోవైపు దీపిక గర్భవతి అవుతుంది. ఇంకో వైపు అనన్యకు తన బోయ్‌ఫ్రెండ్ ఎవరితోనైనా అఫైర్‌లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ప్రేమ, రిలేషన్ ఉండాల్సిన చోట ఊపిరాడనితనం, అసహనం, దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న క్రైమ్ ఆలోచనలు... అన్నీ ఈ ‘రహస్యం’గా ఉంచాల్సిన ‘బంధం’ వల్ల ఏర్పడతాయి. స్త్రీ పురుషులు తమ పాత బంధాల నుంచి ఓపెన్‌గా, చట్టబద్ధంగా విడిపోయి కొత్త బంధాల్లోకి వెళ్లొచ్చు. కాని ఉన్న బంధాల్లో ఉంటూ రహస్య బంధం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, లేదా ఉన్న బంధాన్ని సరిగ్గా ముగించకుండా కొత్త బంధాల్లో మునిగినప్పుడు పరిణామాలు భయానకం అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే ముగుస్తుంది. పైపై ఆకర్షణల లోతు ఎంత అగాధంగా ఉంటుందో ‘గెహరాయియా’ (అగాధాలు) చెబుతుంది. ఫోన్ ఒక పాత్రధారి ఫోన్ ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. అదే సమయంలో ఇవాళ స్త్రీ,పురుష బంధాలకు ఒక ప్రధాన వాహిక. ఒకప్పుడు అబ్బాయి. అమ్మాయిల ప్రేమ దగ్గరి నుంచి వివాహేతర రహస్య బంధాల వరకూ కమ్యూనికేషన్ ఒక దుస్సాధ్యంగా ఉండేది. కాని స్మార్ట్‌ఫోన్ వల్ల ఆ సమస్య అవసరమైన దాని కంటే ఎక్కువే అయిందని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇందులో సినిమా అంతా పాత్రలు మాట్లాడినంత ఫోన్ మాట్లాడుతుంది. దీపిక, సిద్ధాంత్‌ల మధ్య రహస్య బంధం పూర్తిగా వాట్సప్ చాట్ వల్ల బలపడుతుంది... ముందుకు పోతుంది... చివరకు విషాద పరిణామమూ తీసుకుంటుంది. బంధం ఏర్పడేంత వరకూ ‘కిక్’ ఇచ్చే వాట్సప్ సంభాషణలు బంధం ఏర్పడ్డాక ‘అనుక్షణం వెంటాడే’ సంభాషణలుగా మారతాయి. స్త్రీగాని, పురుషుడు గాని ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్న ఈ ఎడతెగని చాటింగ్ ‘మతి’ని గతి తప్పేలా చేస్తున్నదేమోనని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. డిస్ట్రబ్ చేసే మూవీ వివాహేతర బంధాలు ఎంత డిస్ట్రబ్ చేస్తాయో అంత డిస్ట్రబ్ చేసే మూడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. దర్శకుడు షకున్ బాత్ర ఆ జాగ్రత్త తీసుకున్నాడు. కాని ఒక విలువను ఆపాదించడం లేదా ఆరోగ్యకరమైన అర్థవంతమైన ముగింపును ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఒక డిస్ట్రబెన్స్ భావన మాత్రమే కలుగుతుంది. ఉన్న బంధాలు అన్నీ ఏవో కొద్ది ఇష్టాయిష్టాలతోనే ఉంటాయి. సమస్యలు లేని బంధాలు ఉండవు. అవి మరీ ఘోరంగా ఉంటే కొత్తబంధాల్లోకి వెళ్లడం పట్ల సమాజానికి అభ్యంతరం ఉండదు. కాని దూరపు కొండలు నునుపు అనే భావనతో బాధ్యతలు అధిగమించే ఆకర్షణల్లో పడటం పట్ల మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఒక హెచ్చరికే. దీపిక మంచి నటనకు ఈ సినిమా చూడొచ్చు. లేదంటే చదివిన ఈ రివ్యూ సరిపోతుంది. -
మనుషులిద్దరు... గుండెచప్పుడు ఒకటే
భార్యాభర్తల బంధమంటే... ఇద్దరు మనుషులు ఒక జీవితమని తెలుసు. కానీ ఇద్దరు మనుషులు.. ఒకటే గుండె చప్పుడని ఇప్పుడు రుజువైంది. ఇష్టమైన వాళ్లు దగ్గరగా వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం చాలా సినిమాల్లో కనిపించే సీన్. ఎక్కువకాలం బంధంలో ఉన్న స్త్రీ, పురుషుల గుండె చప్పుడు కూడా ఒకటే అవుతోందని ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ప్రొఫెసర్ ఓగోస్కీ నేతృత్వంలో జరిగిన ఈ పరశోధనా ఫలితాలు ఇటీవల ‘సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎక్కువకాలం రిలేషన్లో ఉన్న కొన్ని జంటలను తీసుకుని.. వాళ్ల మధ్య దూరం, వారిద్దరి గుండె చప్పుడును లెక్కించారు. 64 నుంచి 88 మధ్య వయసుండి... 14 నుంచి 65 ఏళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్న పది జంటలను పరిశోధకులు రెండు వారాలపాటు పరీక్షించారు. ‘‘దూరంగా ఉన్నప్పుడు ఒకలా ఉన్న గుండెకొట్టకునే తీరు... ఇద్దరూ సమీపంలోకి వచ్చినప్పుడు క్రమంగా ఒక్కటి అవుతోంది. అంటే ఇద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి గుండె మరొకరి గుండెను ప్రభావితం చేస్తోంది. ఒకసారి భార్య గుండె భర్త గుండెపై ఎఫెక్ట్ చూపిస్తే... మరోసారి భర్త గుండె భార్య గుండెను ప్రభావితం చేస్తోంది. ముప్ఫై, నలభై ఏళ్లు కలిసి జీవించిన జంటల హృదయం సైతం ఒకరికోసం ఒకరు అన్న అంకితభావంతో పనిచేస్తోంది’’అని ఒగోస్కీ చెప్పారు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
కిస్ చేస్తే ఇది ‘మిస్’ కారు..
కిస్.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌గా తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో లవర్స్ ఈరోజు (ఫిబ్రవరి 13)ను కిస్‌డే గా సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. అవేంటో చదివేయండి... ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్ చేస్తారు. ఈ చర్యతో వారే తమ ప్రపంచమని మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇలా చేయడం వలన ప్రేమించిన వారి పట్ల తమకున్న ప్రేమ, నమ్మకం, పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రేమికులు గాఢంగా చుంబించుకోవడం వలన కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఒత్తిడి తగ్గి వారి మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అవుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. కిస్ చేస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర తీసుకొని నుదుటి పైన కిస్ చేస్తారు. ఈ చర్యతో వారిని ఆశీర్వదిస్తారు. ఒక్కొసారి పిల్లలు తమ వారు కిస్‌చేయడం వలన తామున్నమనే భరోసా ఏర్పడుతుందని అనుకుంటారు. చుంబించుకోవడం అనే చర్య వలన మానసిక ఆనందం కలిగి మాములు కన్నా 5 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చదవండి: ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! -
ప్రతి బంధం... ప్రతిబింబం
మనిషికి మనిషికి మధ్య ఉండేది బంధం. మనిషికి అద్దానికి మధ్య ఉండేది బింబం. ఈ బంధాల కడలిలో... అనుబంధాల తీరంలో... ప్రతి అలా ఒక జ్ఞాపకం. అటువంటి ఎన్నో అలల ప్రతిబంబమే ప్రతీబంధం! మనల్ని మనం అద్దంలో చూసుకునే బదులు మన బింబాన్ని బంధాల్లో చూసుకుంటే... అనుబంధాలు బలపడతాయి. ప్రతిబింబాలూ అందంగా కనబడతాయి. అప్పుడు ప్రతిబంధం... ప్రతిబింబం. ఏడ్చి ఏడ్చి ఎంత సేపు పడుకుందో తెలియలేదు మాధవికి. మెలకువ వచ్చాక చూస్తే చీకటి ఆవరిస్తున్నట్టుగా అనిపించింది. టైమ్ చూస్తే సాయంత్రం ఆరు అవుతోంది. గదిలో ఒంటరిగా ఉంది. గదిలోనే కాదు ఆ ఇంటిలో ఒంటరిగానే ఉంటోంది రెండు రోజులుగా. ఆ గదిని వదిలి బయటకు రాలేకపోతోంది. అలాగని ఆ గదిలో ఉండలేకపోతోంది. ఎవరైనా పలకరిస్తే బాగుండు అనిపించింది. ఎవరైనా ఫోన్ చేశారేమో అని ఒకట్రెండు సార్లు ఫోన్ తీసి చూసింది. ఎవరూ ఫోన్ చేయలేదు. ‘అసలెవరున్నారు తనకు.. ఫోన్ చేయడానికి..!’ ఇలా అనుకోగానే మళ్లీ దుఃఖం కమ్ముకొచ్చింది. కిందటి రోజు జరిగిన సంఘటన గుర్తుకువచ్చి, మాధవి దుఃఖం రెట్టింపు అయ్యింది. ఒంటరితనం ఓ కష్టం! ‘ఎన్నెన్ని మాటలు అని వెళ్లాడు రవి. ఎంత ప్రేమించింది అతణ్ణి. పెళ్లై ఏడాదైనా కాలేదు. నాలుగేళ్లుగా చూపించిన ప్రేమంతా ఏమైపోయింది? తనతో తిరిగిన రోజులు... సంతోషంగా ఉన్న రోజులు... ఇప్పుడవన్నీ ఏమైపోయాయి?’ తనలో తానే మథనపడసాగింది. ‘‘నువ్వు స్వార్థపరురాలివి. ఒక్కదానివే ఉండు’’ అన్న రవి మాటలు పదే పదే సూదుల్లా గుండెను పొడుస్తున్నట్టుంది మాధవికి. ‘రవి ఇలా మాట్లాడడానికి కారణం వాళ్ల అమ్మనాన్న, చెల్లెలే కదా! వాళ్ల నుంచి దూరంగా వచ్చి, మేం సంతోషంగా ఉన్నామని కుళ్లు. వాళ్లే రవికి అన్నీ నేర్పి, ఇక్కడ్నించి తీసుకెళ్లిపోయారు’ అని ఏడుస్తూనే ఉంది. నాలుగేళ్ల క్రితం కాలేజీలో కలుసుకున్నారు ఇద్దరు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. మూడేళ్లు కలిసి తిరిగారు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రవి వాళ్ల అమ్మానాన్న ముందు ఒప్పుకోలేదు. కానీ, రవే ఒప్పించాడు. మాధవికి అమ్మానాన్న లేరు. ఉన్న నానమ్మ సరే అంది. అనుకున్న నెల రోజుల్లోనే పెళ్లయిపోయింది. కలిసుండడం ఓ కష్టం!! పెళ్లయ్యాక ఆరు నెలలు అత్తమామలతోనే కలిసి ఉంది మాధవి. ఆ ఇంటి బాధ్యత అంతా రవిదే అని తెలిసింది. భర్త చనిపోవడంతో రవి చెల్లెలు పుట్టింట్లోనే ఉంటుంది కూతురితో సహా. మరిదికి ఇంకా ఉద్యోగం లేదు. చుట్టపు చూపుగా వచ్చే పెద్దాడపడుచు ‘ఇద్దరూ ఉద్యోగస్థులే కదా! ఏదైనా సాయం చేయండం’టూ మాట్లాడేది. కొన్ని రోజుల్లోనే ఇల్లంతా రణ రంగమే అనిపించసాగింది మాధవికి. వీటన్నిటి నుంచి బయటపడా లనుకునేది. ఆఫీసు బాగోలేదని ఉద్యోగం మానేసింది. భర్తకు తన మీద చాడీలు చెబుతోందేమో అని ఆడపడుచుపై అనుమానం. అత్తగారు కొడుకునూ, తననూ విడదీసే ప్రయత్నం చేస్తున్నారని అపోహతో గొడవ. ఓ రోజు ‘ఈ ఇంట్లో నేనుండలేను’ అని భర్తతో అంది. దీంతో తప్పనిసరై వేరు కాపురం పెట్టారు. అన్నీ కఠిన పాఠాలే! వేరు కాపురం... తన ఇష్టం వచ్చినట్టు ఉండచ్చు అన్న ఆనందం మాధవికి ఎన్నో రోజులు లేదు. పదే పదే అత్తమామల ఖర్చుల కోసం రవికి ఫోన్ చేయడం, ఏవో సమస్యలు చెప్పడం... తరచూ వాళ్ళ దగ్గరికి రవి వెళ్లిరావడం మాధవి భరించలేకపోయేది. ఆ ఇంటితో పూర్తిగా తెగతెంపులు చేసుకోమని గొడవ. ఓ రోజు రాత్రి రవి వాళ్ల అమ్మ ఫోన్ చేసింది. ‘చెల్లెలికి ఒంట్లో బాగోలేదు... జ్వరం. అర్జెంటుగా రమ్మనమని. ఫోన్లో మాట్లాడిన విషయం రవికి చెప్పలేదు మాధవి. ‘జ్వరం వస్తే కంగారెందుకు? చీటికీ మాటికీ ఫోన్లు చేయడం, విసిగించడం?’ అనుకొని ఊరకుంది. ఉదయాన్నే చెల్లెలి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, ఫిట్స్ వచ్చాయనీ, చుట్టుపక్కల వారి సాయంతో ఆసుపత్రిలో చేర్చారనీ రవికి తెలిసింది. ఒంట్లో బాగా లేదని తెలిసీ మాధవి తనకు చెప్పలేదని మాధవి మీద కోపంతో విరుచుకుపడ్డాడు రవి. ‘నువ్వు ఒంటరిదానివి, ఒంటరిగానే బతుకు’ అంటూ వెళ్లిపోయాడు. కోపంలో రవి అన్న ప్రతీ మాటను గుర్తు తెచ్చుకొని ఏడుస్తోంది మాధవి. ఎవరో డోర్ తట్టిన శబ్దం రావడంతో రవి ఏమో అని ఆత్రుతగా వెళ్లింది. గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. వచ్చిన భరోసా! అమెరికాలో ఉన్న మాధవి మేనత్త పూర్ణ. పోల్చుకోవడానికే కొంత టైమ్ పట్టింది మాధవికి. ‘‘నానమ్మ ద్వారా అడ్రెస్ తెలుసుకొని వచ్చానే’’ చెప్పింది పూర్ణ. ‘‘మళ్లీ అమెరికా వెళుతున్నా, నీ పెళ్లికి కూడా రాలేదు. ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది. వచ్చా’’ అంది. చిన్నప్పుడు ఆమె దగ్గర తను మారాం చేసిన క్షణాలన్నీ గుర్తుకువచ్చాయి మాధవికి. ‘‘ఎలా ఉన్నావురా!’’ అని మేనత్త ఆప్యాయంగా అడిగేసరికి మాధవి భోరుమంది. బతకాలని లేదనీ, ఎప్పుడూ ఒంటరి బతుకే అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. మెల్లగా విషయమంతా తెలుసుకున్న పూర్ణ మాధవికి ధైర్యం చెప్పింది. ‘నీ సమస్యకు పరిష్కారం నేను చెప్పడం కన్నా నీవే స్వయంగా తెలుసుకుందువుగానీ’ అంటూ ఊరడించింది. మరుసటి రోజు పూర్ణ, మాధవిని తీసుకొని ఒక క్లినిక్‌కి వెళ్లింది. అది ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ క్లినిక్. గత జన్మ అనుభవాల నుంచి ఈ జన్మ జీవనవిధానం తెలుసుకునే చోటు. ఈ థెరపీ ప్రాధ్యాన్యాన్ని తెలుసుకుంది మాధవి. కౌన్సెలర్ దగ్గర తన సమస్యను వివరించింది. ‘‘మీ సమస్యను మీకై మీరుగా అద్దంలో చూసుకున్నట్టు చూడగలరు. మీరు సిద్ధమైతే ధ్యానప్రకియ ద్వారా ఆ అవకాశం ఉంది!’’ అని చెప్పారు కౌన్సెలర్. ‘‘సిద్ధమే’’ అంది మాధవి. అన్నీ ఆత్మీయ బంధాలే! థెరపీ మొదలైంది. మాధవి తన పాతికేళ్ల జీవితాన్ని కళ్లు మూసుకొని ధ్యానప్రకియలో దర్శిస్తోంది. ఒక్కో సంవత్సరం వెనక్కి వెళుతూ, తాను దర్శిస్తున్నవాటన్నిటి గురించి చెబుతోంది. కౌన్సెలర్ నోట్ చేసుకుంటున్నారు. తన పెళ్లి, హాస్టల్ జీవితం, అమ్మనాన్నలు గొడవపడి విడిపోవడం, బాల్యం, ఒంటరితనం.. అన్నీ మాధవి చూస్తోంది. ఆ దశలు అన్నింటిలోనూ తన వేదన గమనిస్తోంది. గర్భస్థ శిశువు దశ నుంచి గత జన్మకు ఆమె ప్రయాణం మొదలైంది. అక్కడ తనెవరితోనో గొడవపడుతోంది. ‘‘ఆవిడ ఎవరో కాదు... ఇప్పుడు అత్తగారు. కానీ ఆ జన్మలో నాకు అమ్మ. నన్ను పనులు చేయమని చెబుతోంది. నేను వినిపించుకోవడం లేదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి పడబోయాను. నన్ను పట్టుకుని లేపారెవరో.. ఆమె నా ఆడపడుచు. కాదు కాదు... గత జన్మలో అప్పుడు నా చెల్లెలు. ‘సరిగా చూసుకోవా!’ దెబ్బతగులుతుంది అని చెబుతోంది. నాకు జబ్బు చేసింది. బెడ్ మీద ఉన్న నాకు సపర్యలు చేస్తున్నారెవరో... ఎవరో కాదు రవి.’’ కళ్ళ ముందు కదలాడుతున్న గత జన్మ దృశ్యాలన్నీ చెబుతున్న మాధవి కళ్లు వర్షిస్తున్నాయి పశ్చాత్తాపంతో. ప్రేమ, బాధ్యత, ధైర్యం, త్యాగం.. ఇలా ఇవన్నీ నేర్పించడానికి గురువుల్లా తనతో కలిసి ఆత్మీయ బంధువులుగా వాళ్ళు ప్రతి జన్మలోనూ ప్రయాణం చేస్తున్నారని తెలుసు కుంది. కర్మ ప్రయాణం అర్థమెన మరుక్షణం వారందరినీ క్షమించమని వేడుకుంది. తాను ఎవరి వల్ల వేదనకు గురైందో వారిని మనస్ఫూర్తిగా క్షమించగలిగింది. మెల్లగా ప్రశాంత వదనంతో మేల్కొంది. ఈ జీవితాన్ని చక్కదిద్దుకునే బాధ్యత తనదే అనీ, తాను ఒంటరిని కాదనీ తెలుసుకుంది. దేవతలా వచ్చావంటూ మేనత్తకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు మాధవి ఒంటరి మనస్తత్వానికి స్వస్తి పలికింది. చుట్టూ ఉన్న బంధాలు, వాటిలోని సమస్యలను అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ ఆనందంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. బంధాలే గురువులు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సహోద్యోగులు... ఇలా మన చుట్టూ ఉన్న వ్యక్తులంతా అద్దాల్లాంటివారు. మన ప్రతిబింబాన్ని వాళ్లలో చూసుకోవచ్చు. మనలోని లోపాలను వారిలో చూసుకొని సరిదిద్దుకోవచ్చు. నైపుణ్యాలను పెంచుకోవచ్చు. మనకీ విషయాలను తెలియజేయడానికి, నేర్పడానికే బంధాల రూపంలో వ్యక్తులు కలుస్తుంటారు. కొంతమంది మాత్రమే వారి చర్యల ద్వారా (మంచి లేదా చెడు) మనల్ని ఆకర్షిస్తారు. అంటే ఆ గుణాలేవో మనలోనూ ఉన్నట్టు గుర్తించాలి. ‘ఎదుటివారిని తప్పుబట్టడం, విమర్శించడం’ అనే సమస్య చాలా మందిలో ఉంటుంది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి కొన్నాళ్లు గమనించండి. అందరూ మంచివాళ్లుగా కనిపిస్తారు. స్నేహబంధాలు కూడా పెరుగుతాయి. ‘ఎదుటి వ్యక్తి ఏ విషయం నేర్పడానికి వచ్చారు? అనే ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి నుంచి నేను ఏం నేర్చుకుంటాను?’ అని ప్రశ్నించుకోవాలి. కర్మన్యాయం ఏంటంటే ‘నేర్చుకునేంతవరకు మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలు, ఆ వ్యక్తులు కలుస్తూనే ఉంటారు. కొన్ని సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయంటే అవి గత జన్మల నుంచి కూడా మోసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాయి. ‘కార్మిక్ రిలేషన్ షిప్స్’లో పాఠాలను అర్థం చేసుకోవడం, క్షమించడం, దయ చూపడం. వీటిని పాటిస్తేనే కర్మలు నశిస్తాయి. ఎదుటివారు మనం చూసుకునే అద్దం మాధవి ఈ జన్మ ప్రయాణంలోనే కాదు గత జన్మలోనూ బాధ్యత, భావోద్వేగాలు, బంధాలు, త్యాగానికి సంబంధించిన పాఠాలను అర్థం చేసుకునే క్రమంలోనే ఉంది. గత జన్మలోనూ భర్త, అత్తమామ, ఆడపడుచులు తనకు ఇవన్నీ నేర్పించడానికి బంధువులయ్యారని తెలుసుకుంది. ఇవన్నీ తెలియక వీటన్నింటి నుంచి దూరం అవ్వాలనుకుంది. అంటే, తన కర్మను పూర్తిచేయడానికి ఆమె సిద్ధంగా లేదు. అందుకే ‘ఒంటరితనం’లో కూరుకుపోయింది. రిగ్రెషన్ థెరపీలో తనను తాను తెలుసుకుంది. ‘తను ఇవ్వగలిగింది ఏమిటి? తిరిగి పొందగలిగేదేమిటి?’ అని అనే రియలైజేషన్‌కు వచ్చింది. అప్పుడే తన జీవితం పట్ల సానుకూల దృక్ఫథం ఏర్పడింది. తిరిగి అన్ని బంధాల మధ్య ఆనందంగా జీవించగలిగింది. - న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చి అకాడమీ - నిర్మల చిల్కమర్రి -
ఆ ‘బంధం’ అవసరం
సర్వే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉండడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బంగారంలా ఉంటుందంటున్నారు కెనడాకు చెందిన సర్వేమంకీ సంస్థవారు. కేజి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న విద్యార్థులపై వారు చేసిన పరిశోధనలో తేలిన విషయమేమిటంటే...విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువుతో, ఉపాధ్యాయులతో, పాఠశాలతో అనుబంధం ఏర్పరుచుకోవడం వల్ల విద్యార్థుల ఆలోచన విధానం మెరుగ్గా ఉంటుందన్నది వారి అభిప్రాయం. వెయ్యి పాఠశాలల్లో చేసిన ఈ సర్వేలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సర్వే సారాంశాన్ని ప్రతి ఒక్క పాఠశాల వారూ అర్థం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు రప్పించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని హితవు పలికింది సర్వేమంకీ సంస్థ. దీని వల్ల వారికి పాఠశాలతో ఏర్పడే బంధం విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుందని చెబుతున్నారు.