రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి ఉంచేవారు. తెల్లారి పచ్చిమిర్చి అందుకునేవారు. దాన్ని మధ్యకు చీల్చి, ఉప్పుగల్లు దూర్చి, నాష్టాలో ఒక ముద్ద అది... పంటి కింద ఇది. బాగుండేది. నీటిసొద జాస్తి. దూరం దూరం పోయి, చాలని తాడుకు కొత్తది ముడివేసి, అడుగు నుంచి లాగి, బిందె భుజాన మోసి... అయితేనేం? నేస్తులతో కలసి కబుర్లాడుకుంటూ నడుస్తుంటే బాగుండేది. తొణికే నీళ్లు వీపున చరుస్తూ ఉన్నా బాగుండేది.
కలిగిన వాళ్లు కొత్త తాటాకుల పందిరి వేసేవారు. కుదిరినవారు కొబ్బరాకులతో నీడ పరిచే వారు. కింద నిలబడితే ఆ చలువదనం బాగుండేది. ఐసుబండి ఆపితే ఆ జిల్లుదనమూ బాగుండేది. కోసి చూపించమని అడక్కుండా పుచ్చకాయ కొనేదే లేదు. త్రికోణాకార ముక్కను అప్పటికప్పుడు తినకుండా వదిలిందీ లేదు. ముంతమామిళ్లవి పలు రంగులు. వాటి మరకలు బట్టలు మీద పడితే వీపు మీద అమ్మ జాజ్ డ్రమ్ కొట్టేది.
పచ్చి తాటాకుల పొట్లాల్లో ముంజలు తెచ్చేవారు. ఆపి బేరం చేస్తే ఒకో పొట్లాన్ని కొడవలితో కోసి విడిపించేవారు. ముదురు ముంజకాయ కొబ్బరికి అటుఇటుగా ఉండేది. లేతది నోట అమృతం చిమ్మేది. తాటికాయలతో చేసిన బండికి టోల్‌గేట్ అడిగే దమ్ము ఎవరికీ లేదు. తెల్లరంగు స్ట్రాంగ్ పిప్పరమెంట్ దవడన పెట్టుకుంటే అదే పెట్రోలుగా పరుగు తీసేది.
చింత చిగురొచ్చేది. బంగారం రేటుతో తూగేది. మునగచెట్లు విరగ గాసేవి. వేపచెట్టు బ్రాండు ఏ.సి ప్రతి రచ్చబండ దగ్గర కూల్ టెంపరేచర్ మెయిన్ టెయిన్ చేసేది. వీధిన తిరగలేని అవ్వ వేరుశనక్కాయలను అక్కడే అమ్మేది. రూపాయి చేజిక్కించుకుని మ్యాట్నీకి దౌడు తీస్తే ఉబ్బరింత. బాగుండేది. కరెంటు పోయి తలుపులు తీస్తే జొరబడే చల్లగాలి. బాగుండేది.
కడప నుంచి కర్బూజ పండ్లు వస్తాయి. చక్కెర జల్లి కాసేపు వదిలి తింటే జీరాను తలపిస్తాయి. నిమ్మకాయల రేటు గజనిమ్మకాయల సైజుకు వెళుతుంది. సుగంధ వేర్లు... హలో మేమున్నాం అంటాయి. ఆరెంజి సోడా ఆగిఆగి తాగమని షోకులు పోతుంది. చలివేంద్రాల దగ్గరుండే పొడవు కాడల గరిటెలు ఆ తర్వాత ఏమవుతాయో ఏమో! పాత గొడుగులకు మర్యాద దక్కి డ్యూటీ ఎక్కుతాయి. వాసానికి దూర్చిన విసనకర్ర దగ్గరి స్నేహితుడిలా పలకరిస్తుంది.
పిచ్చుకల హడావిడి మీటింగుల మధ్య మధ్యాహ్నపు కునుకు అమోఘంగా ఉంటుంది. సాయంత్రం నాలుగు లోటాలు కుమ్మరించుకుంటే అదే స్వర్గం. డాబా మీద నీళ్లు జల్లితే రాత్రికి చుక్కలు చల్లగా పలకరిస్తాయి. నిద్రకు ఇంటిల్లిపాది మేడెక్కితే పరుపులున్నవారు శ్రీమంతులు. టేబుల్ ఫ్యాను తిప్పగలిగేవారు కుబేరులు. తల దగ్గర నీళ్ల చెంబుకు బోర్లించిన గ్లాసే మూతవుతుంది. మేను వాల్చాక స్తంభించ
కుండా గాలి వీస్తే పరమ పరవశం.
ఆవకాయ సెంటిమెంట్. అర ఎకరం అమ్మైనా లంక మిరపకాయలు, గానుగ నూనె, ఆవాలు, మెంతులు, పచ్చడి మామిడి కాయలు వెల జరిగేవి. ముహూర్తం చూసి మరీ అమ్మమ్మ పని మొదలెట్టేది. కొడుకు నడుం మీద చేతులతో సాయానికి సిద్ధమయ్యేవాడు. కోడలు చూపుతో చెప్తే చేత్తో అందుకునేది. పిల్లలు కిలకిలారావాలు చేసేవారు. ఎర్రగా కలిపిన తొలిముద్ద పెట్టడానికి ప్రతి చిన్నారికి ఇంట పెద్ద తలకాయ ఉండేది.
చుట్టాలొచ్చేవారు. పిల్లల్ని తెచ్చేవారు. ఆటల్లో ఉత్తుత్తి విందు ఒండి బాదం ఆకుల్లో బలవంతాన తినిపించేవారు. ఏటికి చాటుగా వెళ్లినవారు జేబుల్లో ఇసుకతో దొరికిపోయేవారు. ఆడపిల్లలు తీరిగ్గా గోరింటాకు పెట్టుకుని పడుకుంటే తెల్లారేసరికి అరచేతుల్లో చంద్రుళ్లు ఉదయించేవారు. పైతరగతికి వెళ్లే ముందొచ్చే వేసవికై పిల్లలు ఎదురు చూసేవారు. తీక్షణ ఆనందాల ఎండలకై ఆరాటపడేవారు.
ఇప్పటిలా కాక రోషమున్న మల్లెలు వేసవిలోనే గుబాళించేవి. సీజను ముగియక ముందే స్త్రీలను జడల్లో వీలైనన్ని తురుముకోమనేవి. కనకాంబరాలతో కలిపి అల్లితే వాటిదొక అందం. మరువంతో, దవనంతో జత చేస్తే మరో చందం. మాలలు కట్టడానికి అమ్మలక్కలంతా కూడి ఇకఇకలు పకపకలు పోతుంటే చూడటం బాగుండేది. ప్రతి ఇంటి గోడ మీద అమ్మాయి పూలజడ ఫోటో కళకళలాడేది.
తీపి మామిడిపండ్లు ఈ దేశవాసుల కోసమే కాసేవి. దిల్ పసంద్ ఎంతో పసందుగా ఉండేది. బంగినపల్లి ప్రతి ఇంటా కనీసం చేరేది. రసాలు మాత్రమే పిండుకు తాగేవారు కొందరు. ఇమాం పసంద్‌కై పట్టుబట్టే వారు ఇంకొందరు. నీలాలు ఆఖరున వచ్చేవి. తోతాపురికి ఉప్పూకారాలే గతి. బిగ్ బాస్కెట్ లేని కాలంలో కారు మాట్లాడుకుని చలో చిత్తూరనేవారు. నూజివీడుకు పదమనేవారు. మధుర ఫలాల బుట్టలు ప్రాప్తమున్నవారికి దక్కేవి.
యుగాలుగా వేసవి ఇలాగే ఉంది. ప్రియజనుల కోసం ఇలా పునరావృతం అవుతూనే ఉంది. మనిషే ఈ రుతువుల సౌందర్యానికి ఎడంగా జరుగుతున్నాడు. వేసవి చెప్పే తీర్పు– విరామం ప్రకటించుకోమని, ఆటవిడుపుపై దృష్టి పెట్టమని, అయినవారి సాంగత్యాన్ని ఆస్వాదించమని! ఇవాళ మనిషి వెళ్లడానికి ఊరు లేనివాడు. పిల్లలతో వెళ్లడానికి బంధువులు, బంధాలు నిలబెట్టుకోని వాడు. అన్నీ ఉన్నా ఎందుచేతనో మనసు ఇరుకు చేసుకుంటున్నాడు. ఇంటి సభ్యులు తప్ప బయటి మనిషి వచ్చి ఒకపూట చేయి కడగని నిరుపేదవుతున్నాడు.
సూర్యనారాయణమూర్తి వేసవిలో తన దగ్గర ఉన్నది ఏదీ దాచుకోకుండా ధారాళంగా భూమి మీద ప్రసరింపజేసి ఆ వెంటనే మొలకలెత్తే వర్షానికి కారకుడవుతాడు. ఈ వేసవిలో మనం కూడా మనలో దాగి ఉన్న, ఎక్కడో అణిచివేయబడి ఉన్న, మరుపున పడి ఉన్న అనుబంధాల్ని ఏదో మేరకు వెలికి తీసి, ఒకనాటి వేసవిని, ఒకనాటి ఆనందాల్ని పొందలేమా? ప్రయత్నిద్దామా? బాగుంటుంది.
ఒకనాటి వేసవి
Published Mon, Apr 10 2023 12:04 AM | Last Updated on Mon, Apr 10 2023 12:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment