
ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో వేసవి కాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతుండాలి.
రోజులో ఒకటి రెండుసార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ని ఉపయోగించాలి. అలాగే నిమ్మరసం, మజ్జిగ /లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారుచేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.
బయటకు వెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్పప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. అలాగే తప్పనిసరై బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలి.
ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలి.
వేసవిలో ఉదయం వేళ కిటికీలు, కర్టెన్‌లను మూసివేయాలి. సాయంత్రం సమయంలో చల్లని గాలి లోపలికి వచ్చేవిధంగా కిటికీలను తెరిచివుంచాలి.
శిశువులు, పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసేవారు, మానసిక అనారోగ్యం కలిగినవారు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వేడి వాతావరణంలోనికి వెళ్లినప్పడు వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటివారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.
అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజ్లులో మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడాన్ని తగ్గించాలి. ముందుగానే వంటపనులు పూర్తిచేసుకోవాలి. అలాగే వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచివుంచాలి.
పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివెళ్లకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఏర్పడే ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే సంగతిని గమనించాలి.
ఎండల కారణంగా వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు
Comments
Please login to add a commentAdd a comment