
సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వడగాడ్పులు
13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
వడదెబ్బతో ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ శాతం పెరగడం, పొడి వాతావరణంతో వడగాడ్పుల తీవ్రత కూడా అధికమవుతోంది.
మాడుతున్న నల్లగొండ..: సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోకెల్లా నిజామాబాద్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో 2–3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మతూర్‌లో 45.5 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్‌లో 45.1 డిగ్రీలు, అదే జిల్లాలోని మాడుగులపల్లిలో 45.0 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
పలుచోట్ల తీవ్రంగా వడగాడ్పులు
రానున్న రెండ్రోజులు పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 30 నుంచి మే 2వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. తక్షణ చర్యలు చేపట్టేలా ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.