ఈ కార్తెలో సాధారణంగా 43 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు
కానీ ప్రస్తుతం కాస్త తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు
రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం తగ్గుదల
రానున్న రెండ్రోజుల్లో పెరిగే చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిత్రమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. పగలంతా ఎండలు మండిపోతుండగా, రాత్రికి మాత్రం కాస్త చల్లని వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా రోహిణి కార్తెలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోత చిరాకు కలిగిస్తుంటుంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె ప్రవేశించి 5 రోజులు కావస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదవుతున్నాయి. రోహిణి కార్తెలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ అధికంగా..అంటే 43 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కానీ ఈసారి కాస్త తక్కువగా నమోదవుతుండటం గమనార్హం.
బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రెండు మూడు చోట్ల 43కు అటుఇటుగానే నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. హనుమకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. రోహిణి కార్తెలో సాధారణంగా 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో తక్కువగా 25, 26, 27 డిగ్రీల మేరకే నమోదు అవుతున్నాయి.
బుధవారం కనిష్టంగా నల్లగొండలో 25.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతోనే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలావుండగా రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 46.4 డిగ్రీ సెల్సీయస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, బెల్లంపల్లిలో 45.8, ఆసిఫాబాద్‌లో 45.2 డిగ్రీ సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నేడు కేరళను తాకనున్న నైరుతి
బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు గురువారం కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. కేరళను తాకిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment