
సాక్షి, హైదరాబాద్: వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.