
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్స్ మూసివేత
15వ తేదీ నుంచి పునర్నిర్మాణంలో కీలక పనులు ప్రారంభం
115 రోజుల పాటు 120 జతల రైళ్లు వేరే స్టేషన్ల మీదుగా మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తుండటంతో 115 రోజుల పాటు సగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసి వేయనున్నారు. ఈ నెల 15 నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా, కొన్ని నాంపల్లి, కొన్ని కాచిగూడ (Kachiguda) స్టేషన్ల నుంచి నడుస్తాయి.
స్కై కాంకోర్స్ కోసమే 100 రోజులు
సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి.
వేచి ఉండే ప్రాంతంతోపాటు రిటైల్ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు లాంటివన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన పునాదులు, కాలమ్స్ పనులు మొదలుపెడుతున్నారు.
ఇందుకోసం 2–3, 4–5 ప్లాట్స్ ఫామ్స్‌ను 50 రోజులు చొప్పున మొత్తం వంద రోజులపాటు మూసేస్తారు. వీటిల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేసే పనులు కూడా చేపడుతారు. ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రైల్వే ట్రాక్ మొత్తానికి పైకప్పు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన పనులను కూడా ఈ నాలుగు ప్లాట్‌ఫామ్స్‌తో ప్రారంభిస్తున్నారు. తర్వాత ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు పనులు చేపడుతారు.
పట్టాలపై ఇసుకబస్తాలు నింపి క్రేన్ ఏర్పాటు..
ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో ప్లాట్‌ఫామ్ వరకు భారీ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్‌పామ్ 5–6 లో 500 టన్నుల సామర్థ్యంగల భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ట్రాక్‌లపై ఇసుక బస్తాలు నింపి, దాని మీద క్రేన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 15 రోజుల పాటు ఆ రెండు ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తున్నారు.
నిత్యం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) మీదుగా 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిల్లో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్‌ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 115 రోజులపాటు సింహభాగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తుండటంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌లో రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. ఆరు నెలల పాటు సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది.