
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో రైళ్లకు నిధుల కొరత బ్రేకులు వేస్తోంది. నగరంలోని వివిధ కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ మేరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని రెండేళ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో నాగ్‌పూర్ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. అనంతరం సొంతంగా కొనుగోలు చేసేందుకు సైతం ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైల్ సన్నాహాలు చేసింది.
ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా మెట్రోరైళ్లను తయారు చేస్తోన్న భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఇప్పుడు నిధుల కొరత అతి పెద్ద సవాల్‌గా మారింది. గత పదేళ్లలో మెట్రో నష్టాలు సుమారు రూ.6500 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజు ఒకవైపు ప్రయాణికుల అవసరాలకనుగుణంగా రైళ్లను నడుపుతూనే మరోవైపు అదనపు నిధులను కేటాయించి కొత్త రైళ్లను కొనుగోలు చేయడం కొంత కష్టంగానే మారినట్లు అధికారులు చెబుతున్నారు.
ఏటేటా నష్టాలే...
నగరంలో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి వరుసగా నష్టాలు నమోదవుతున్నాయి. రైళ్ల నిర్వహణలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్‌లలో ప్రతిరోజు 57 రైళ్లు సుమారు 1050 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రోలు అందుబాటులో ఉండేవిధంగా వేళలను కూడా పొడిగించారు.
రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కలి్పంచేందుకు అదనపు ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడం, డిజిటల్ సేవల విస్తరణ, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ పెంపు, తదితర సేవలపైన ఎల్‌అండ్‌టీ దృష్టి సారించింది. ప్రస్తుతం 2 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.10 నుంచి గరిష్టంగా 26 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.60 చొప్పున చార్జీలు అమలవుతున్నాయి. అయినప్పటికీ గత పదేళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం నష్టాలను ఏ మాత్రం భర్తీ చేయలేదు. పైగా ఏటేటా నష్టాలే నమోదై ఇప్పుడు రూ.6500 కోట్లకు చేరాయి.
చార్జీల పెంపు అనివార్యమా...
ఈ పరిస్థితుల్లో నగరంలో మెట్రోరైళ్ల నిర్వహణకు టిక్కెట్ చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారవర్గాల అంచనా. ‘2017 నుంచి ఇప్పటి వరకు చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఒకటి, రెండు సార్లు చార్జీలను సవరించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు కలి ్పంచేందుకు చార్జీల పెంపు కొంత ఊరటనివ్వగలదని భావిస్తున్నాం.’ అని ఓ అధికారి వివరించారు. ప్రభుత్వం నుంచి సానుకూలత కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం నుంచి రావలసిన రూ.200 కోట్లు లభించినా కొంత మేరకు ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.
కనీసం 10 రైళ్లు అవసరం...
ప్రస్తుతం నగరంలో 57 రైళ్లు ఉన్నాయి. ఒక్కో ట్రైన్‌కు 3 కోచ్‌లు ఉంటాయి. వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. మరో 10 రైళ్లను అదనంగా కొనుగోలు చేయగలిగితే 30 కోచ్‌లు వినియోగంలోకి వస్తాయి. దాంతో కనీసం రోజుకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మందికి అదనంగా ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. 3 కోచ్‌లు ఉన్న ఒక ట్రైన్‌కు రూ.65 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. తయారీ సంస్థల నుంచి రైళ్లను కొనుగోలు చేయడంతోపాటు నగరానికి తరలించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ లెక్కన 10 రైళ్లకు సుమారు రూ.650 కోట్లకు పైగా నిధులు అవసరం. కొత్త రైళ్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదా, చార్జీలను పెంచేందుకు అవకాశం ఇవ్వడం పరిష్కారంగా భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.