సాక్షి, హైదరాబాద్: మన రైలు వేగం మరింత పెరగనుంది. గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగు పెట్టనుంది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది సరికొత్త మైలురాయి కావడం విశేషం. స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయడంతో అక్కడ రైళ్లు వేగంగా వెళ్లడానికి మార్గం సుగమమైంది.
లాక్‌డౌన్ సమయంలో...
స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ పేరుతో దేశవ్యాప్తంగా రెండు కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేసింది. డబ్లింగ్ లైన్ ఉన్న మార్గాలను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుతూ ఈ మార్గాలు విస్తరించాయి. వీటిలో ప్రమాదకర మలుపులు లేకుండా చేయటంతోపాటు కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ, 260 మీటర్ల పొడవున్న పట్టాలను పటిష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ సమయం లో ఈ పనులు పూర్తి చేశారు. అనంతరం జూలై నుంచి దశలవారీగా ఆర్‌డీఎస్‌ఓ పర్యవేక్షణలో కన్ఫర్మేటరీ అసిలోగ్రాఫ్ కార్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించారు.
తర్వాత పూర్తిస్థాయి రైళ్లను గరిష్ట వేగంతో నడిపి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవటంతో ఆ పరీక్షలు విజయవంతమైనట్టు ప్రకటించారు. తాజాగా రైల్వే సేఫ్టీ కమిషనర్ కొన్ని చిన్నచిన్న సూచనలు చేస్తూ రైళ్లను గరిష్ట వేగంతో నడిపేందుకు అనుమతి మంజూరు చేశారు. దీంతో రెండుమూడు వారాల్లో ఆ మార్పులు పూర్తిచేసి రైళ్ల వేగాన్ని పెంచనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,280 కి.మీ.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,612 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్ విస్తరించి ఉండగా.. ప్రస్తుతానికి 1,280 కిలోమీటర్ల మేర ఈ తరహా ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. స్వర్ణ వికర్ణ కారిడార్‌కు సంబంధించి బల్లార్షా నుంచి కాజీపేట వరకు 234 కి.మీ., కాజీపేట నుంచి విజయవాడ, గుంటూరు వరకు 510 కి.మీ., స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో (చెన్నై–ముంబై సెక్షన్) 536 కి.మీ. ఈ మార్గం ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను నడుపుతున్నారు. ఇకపై మిగతా మార్గాల్లో కూడా ఇది అమలవుతుంది.
ప్రస్తుతం ఆ మార్గాల్లో 90 కి.మీ. నుంచి 110 కి.మీ. గరిష్ట వేగంగా ఉంది. కొన్ని మార్గాల్లో పరిమిత దూరం 120 కి.మీ. వరకు నడుపుతున్నారు. సింగిల్ లైన్లు, సరైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ లేని మార్గాల్లో మాత్రం రైళ్లు ఇప్పటిలాగానే సాధారణ వేగంతో నడుస్తాయి. ఇందులో కొన్ని ప్రధాన మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్–నిజామాబాద్ మార్గం ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment