
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణన, కులగణనకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని గురువారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎలాంటి కాల పరిమితి లేకుండా కేవలం కులగణన చేస్తామన్న కేంద్ర ప్రకటనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ తప్పుపట్టారు.
ఈ సందర్భంగా ‘నిర్దిష్ట గడువు లేకుండా ముఖ్యమైన ప్రకటనలు ఇవ్వడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తుడు. కులగణనపై ఆయన హెడ్‌లైన్ ఇచ్చారు. డెడ్‌లైన్ మాత్రం చెప్పలేదు. కులగణనపై రోడ్‌మ్యాప్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లుగా అడుగుతోంది’అని అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాక్‌పై తీవ్ర చర్యలు తీసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుల గణన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆరోపించారు. కులగణనను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న బీజేపీ, ఆకస్మికంగా నిర్ణయాన్ని మార్చుకోవడం నైతిక, రాజకీయ ఓటమిని చెప్పకనే చెబుతోందన్నారు.
‘జీఎస్‌టీ, ఆధార్, ఉపాధి హామీ, ఆహార భద్రతా చట్టాలపై యూటర్న్ తీసుకున్న మోదీ ఇప్పుడు కుల గణనపై అతిపెద్ద యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయంలో ప్రధానిని మించిన వారు లేరు’అని రమేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జన గణనకు తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంపైనా ఆయన అనుమానం సంధించారు. కులగణనకు కాంగ్రెస్ మద్దతిస్తుందంటూ ఆయన.. తగు బడ్జెట్ లేకుండా, నిరి్ధష్ట గడువు లేకుండా, సమగ్ర ప్రణాళిక రూపొందించకుండా కేవలం హెడ్‌లైన్‌తో సరిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమేంటన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేస్తోందన్నారు.