ఏప్రిల్‌లోనే ఠారెత్తిస్తున్న ఎండలు
16 ప్రాంతాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు.. సగటు సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికం
అధిక ఉష్ణోగ్రతలకు తోడవుతున్న వడగాడ్పులు
నేడు, రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
కొన్ని ప్రాంతాలకు మోస్తరు వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేగంగా వీస్తున్న వడగాడ్పులు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం లేదా చివరి వారంలో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మొదటి వారం నుంచే వేడి గాలులు వీయడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. సోమవారం సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది.
14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఏప్రిల్ 8న రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కాగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ సగటు కంటే 32 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 42 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో కుతకుతలాడాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదైంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికంగా ఉంది.
తప్పనిసరైతేనే బయటకెళ్లాలి
రానున్న రెండ్రోజులు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 44 డిగ్రీ సెల్సీయస్ మధ్యన నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధ వారాల్లో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment