ప్రతి బంధం... ప్రతిబింబం | Bimbam man was between the glasses | Sakshi
Sakshi News home page

ప్రతి బంధం... ప్రతిబింబం

Published Mon, Nov 14 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

ప్రతి బంధం...   ప్రతిబింబం

మనిషికి మనిషికి మధ్య ఉండేది బంధం. మనిషికి అద్దానికి మధ్య ఉండేది బింబం. ఈ బంధాల కడలిలో... అనుబంధాల తీరంలో... ప్రతి అలా ఒక జ్ఞాపకం.  అటువంటి ఎన్నో అలల ప్రతిబంబమే ప్రతీబంధం! మనల్ని మనం అద్దంలో చూసుకునే బదులు  మన బింబాన్ని బంధాల్లో చూసుకుంటే... అనుబంధాలు బలపడతాయి. ప్రతిబింబాలూ అందంగా కనబడతాయి. అప్పుడు ప్రతిబంధం... ప్రతిబింబం.

ఏడ్చి ఏడ్చి ఎంత సేపు పడుకుందో తెలియలేదు మాధవికి. మెలకువ వచ్చాక చూస్తే చీకటి ఆవరిస్తున్నట్టుగా అనిపించింది. టైమ్ చూస్తే సాయంత్రం ఆరు అవుతోంది. గదిలో ఒంటరిగా ఉంది. గదిలోనే కాదు ఆ ఇంటిలో ఒంటరిగానే ఉంటోంది రెండు రోజులుగా. ఆ గదిని వదిలి బయటకు రాలేకపోతోంది. అలాగని ఆ గదిలో ఉండలేకపోతోంది. ఎవరైనా పలకరిస్తే బాగుండు అనిపించింది. ఎవరైనా ఫోన్ చేశారేమో అని ఒకట్రెండు సార్లు ఫోన్ తీసి చూసింది. ఎవరూ ఫోన్ చేయలేదు. ‘అసలెవరున్నారు తనకు.. ఫోన్ చేయడానికి..!’ ఇలా అనుకోగానే మళ్లీ దుఃఖం కమ్ముకొచ్చింది. కిందటి రోజు జరిగిన సంఘటన గుర్తుకువచ్చి, మాధవి దుఃఖం రెట్టింపు అయ్యింది.

ఒంటరితనం ఓ కష్టం!
‘ఎన్నెన్ని మాటలు అని వెళ్లాడు రవి. ఎంత ప్రేమించింది అతణ్ణి. పెళ్లై ఏడాదైనా కాలేదు. నాలుగేళ్లుగా చూపించిన ప్రేమంతా ఏమైపోయింది? తనతో తిరిగిన రోజులు... సంతోషంగా ఉన్న రోజులు... ఇప్పుడవన్నీ ఏమైపోయాయి?’ తనలో తానే మథనపడసాగింది.  ‘‘నువ్వు స్వార్థపరురాలివి. ఒక్కదానివే ఉండు’’ అన్న రవి మాటలు పదే  పదే సూదుల్లా గుండెను పొడుస్తున్నట్టుంది మాధవికి. ‘రవి ఇలా మాట్లాడడానికి కారణం వాళ్ల అమ్మనాన్న, చెల్లెలే కదా! వాళ్ల నుంచి దూరంగా వచ్చి, మేం సంతోషంగా ఉన్నామని కుళ్లు. వాళ్లే రవికి అన్నీ నేర్పి, ఇక్కడ్నించి తీసుకెళ్లిపోయారు’ అని ఏడుస్తూనే ఉంది.

నాలుగేళ్ల క్రితం కాలేజీలో కలుసుకున్నారు ఇద్దరు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. మూడేళ్లు కలిసి తిరిగారు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రవి వాళ్ల అమ్మానాన్న ముందు ఒప్పుకోలేదు. కానీ, రవే ఒప్పించాడు. మాధవికి అమ్మానాన్న లేరు. ఉన్న నానమ్మ సరే అంది. అనుకున్న నెల రోజుల్లోనే పెళ్లయిపోయింది.

కలిసుండడం ఓ కష్టం!!
పెళ్లయ్యాక ఆరు నెలలు అత్తమామలతోనే కలిసి ఉంది మాధవి. ఆ ఇంటి బాధ్యత అంతా రవిదే అని తెలిసింది. భర్త చనిపోవడంతో రవి చెల్లెలు పుట్టింట్లోనే ఉంటుంది కూతురితో సహా. మరిదికి ఇంకా ఉద్యోగం లేదు. చుట్టపు చూపుగా వచ్చే పెద్దాడపడుచు ‘ఇద్దరూ ఉద్యోగస్థులే కదా! ఏదైనా సాయం చేయండం’టూ మాట్లాడేది. కొన్ని రోజుల్లోనే ఇల్లంతా రణ రంగమే అనిపించసాగింది మాధవికి. వీటన్నిటి నుంచి బయటపడా లనుకునేది. ఆఫీసు బాగోలేదని ఉద్యోగం మానేసింది. భర్తకు తన మీద చాడీలు చెబుతోందేమో అని ఆడపడుచుపై అనుమానం. అత్తగారు కొడుకునూ, తననూ విడదీసే ప్రయత్నం చేస్తున్నారని అపోహతో గొడవ. ఓ రోజు ‘ఈ ఇంట్లో నేనుండలేను’ అని భర్తతో అంది. దీంతో తప్పనిసరై వేరు కాపురం పెట్టారు.

అన్నీ కఠిన పాఠాలే!
వేరు కాపురం... తన ఇష్టం వచ్చినట్టు ఉండచ్చు అన్న ఆనందం మాధవికి ఎన్నో రోజులు లేదు. పదే పదే అత్తమామల ఖర్చుల కోసం రవికి ఫోన్ చేయడం, ఏవో సమస్యలు చెప్పడం... తరచూ వాళ్ళ దగ్గరికి రవి వెళ్లిరావడం మాధవి భరించలేకపోయేది. ఆ ఇంటితో పూర్తిగా తెగతెంపులు చేసుకోమని గొడవ. ఓ రోజు రాత్రి రవి వాళ్ల అమ్మ ఫోన్ చేసింది. ‘చెల్లెలికి ఒంట్లో బాగోలేదు... జ్వరం. అర్జెంటుగా రమ్మనమని. ఫోన్‌లో మాట్లాడిన విషయం రవికి చెప్పలేదు మాధవి. ‘జ్వరం వస్తే కంగారెందుకు? చీటికీ మాటికీ ఫోన్లు చేయడం, విసిగించడం?’ అనుకొని ఊరకుంది.

ఉదయాన్నే చెల్లెలి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, ఫిట్స్ వచ్చాయనీ, చుట్టుపక్కల వారి సాయంతో ఆసుపత్రిలో చేర్చారనీ రవికి తెలిసింది. ఒంట్లో బాగా లేదని తెలిసీ మాధవి తనకు చెప్పలేదని మాధవి మీద కోపంతో విరుచుకుపడ్డాడు రవి. ‘నువ్వు ఒంటరిదానివి, ఒంటరిగానే బతుకు’ అంటూ వెళ్లిపోయాడు. కోపంలో రవి అన్న ప్రతీ మాటను గుర్తు తెచ్చుకొని ఏడుస్తోంది మాధవి. ఎవరో డోర్ తట్టిన శబ్దం రావడంతో రవి ఏమో అని ఆత్రుతగా వెళ్లింది. గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది.

వచ్చిన భరోసా!
అమెరికాలో ఉన్న మాధవి మేనత్త పూర్ణ. పోల్చుకోవడానికే కొంత టైమ్ పట్టింది మాధవికి. ‘‘నానమ్మ ద్వారా అడ్రెస్ తెలుసుకొని వచ్చానే’’ చెప్పింది పూర్ణ. ‘‘మళ్లీ అమెరికా వెళుతున్నా, నీ పెళ్లికి కూడా రాలేదు. ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది. వచ్చా’’ అంది. చిన్నప్పుడు ఆమె దగ్గర తను మారాం చేసిన క్షణాలన్నీ గుర్తుకువచ్చాయి మాధవికి. ‘‘ఎలా ఉన్నావురా!’’ అని మేనత్త ఆప్యాయంగా అడిగేసరికి మాధవి భోరుమంది. బతకాలని లేదనీ, ఎప్పుడూ ఒంటరి బతుకే అని చిన్నపిల్లలా ఏడ్చేసింది.

మెల్లగా విషయమంతా తెలుసుకున్న పూర్ణ మాధవికి ధైర్యం చెప్పింది. ‘నీ సమస్యకు పరిష్కారం నేను చెప్పడం కన్నా నీవే స్వయంగా తెలుసుకుందువుగానీ’ అంటూ ఊరడించింది. మరుసటి రోజు పూర్ణ, మాధవిని తీసుకొని ఒక క్లినిక్‌కి వెళ్లింది. అది ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ క్లినిక్. గత జన్మ అనుభవాల నుంచి ఈ జన్మ జీవనవిధానం తెలుసుకునే చోటు. ఈ థెరపీ ప్రాధ్యాన్యాన్ని తెలుసుకుంది మాధవి. కౌన్సెలర్ దగ్గర తన సమస్యను వివరించింది. ‘‘మీ సమస్యను మీకై మీరుగా అద్దంలో చూసుకున్నట్టు చూడగలరు.  మీరు సిద్ధమైతే ధ్యానప్రకియ ద్వారా ఆ అవకాశం ఉంది!’’ అని చెప్పారు కౌన్సెలర్. ‘‘సిద్ధమే’’ అంది మాధవి.

అన్నీ ఆత్మీయ బంధాలే!
థెరపీ మొదలైంది. మాధవి తన పాతికేళ్ల జీవితాన్ని కళ్లు మూసుకొని ధ్యానప్రకియలో దర్శిస్తోంది. ఒక్కో సంవత్సరం వెనక్కి వెళుతూ, తాను దర్శిస్తున్నవాటన్నిటి గురించి చెబుతోంది. కౌన్సెలర్ నోట్ చేసుకుంటున్నారు. తన పెళ్లి, హాస్టల్ జీవితం, అమ్మనాన్నలు గొడవపడి విడిపోవడం, బాల్యం, ఒంటరితనం.. అన్నీ మాధవి చూస్తోంది. ఆ దశలు అన్నింటిలోనూ తన వేదన గమనిస్తోంది.

గర్భస్థ శిశువు దశ నుంచి గత జన్మకు ఆమె ప్రయాణం మొదలైంది. అక్కడ తనెవరితోనో గొడవపడుతోంది. ‘‘ఆవిడ ఎవరో కాదు... ఇప్పుడు అత్తగారు. కానీ ఆ జన్మలో నాకు అమ్మ. నన్ను పనులు చేయమని చెబుతోంది. నేను వినిపించుకోవడం లేదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి పడబోయాను. నన్ను పట్టుకుని లేపారెవరో.. ఆమె నా ఆడపడుచు. కాదు కాదు... గత జన్మలో అప్పుడు నా చెల్లెలు. ‘సరిగా చూసుకోవా!’ దెబ్బతగులుతుంది అని చెబుతోంది. నాకు జబ్బు చేసింది. బెడ్ మీద ఉన్న నాకు సపర్యలు చేస్తున్నారెవరో... ఎవరో కాదు రవి.’’

కళ్ళ ముందు కదలాడుతున్న గత జన్మ దృశ్యాలన్నీ చెబుతున్న మాధవి కళ్లు వర్షిస్తున్నాయి పశ్చాత్తాపంతో. ప్రేమ, బాధ్యత, ధైర్యం, త్యాగం.. ఇలా ఇవన్నీ నేర్పించడానికి గురువుల్లా తనతో కలిసి ఆత్మీయ బంధువులుగా వాళ్ళు ప్రతి జన్మలోనూ ప్రయాణం చేస్తున్నారని తెలుసు కుంది. కర్మ ప్రయాణం అర్థమెన మరుక్షణం వారందరినీ క్షమించమని వేడుకుంది. తాను ఎవరి వల్ల వేదనకు గురైందో వారిని మనస్ఫూర్తిగా క్షమించగలిగింది. మెల్లగా ప్రశాంత వదనంతో మేల్కొంది. ఈ జీవితాన్ని చక్కదిద్దుకునే బాధ్యత తనదే అనీ, తాను ఒంటరిని కాదనీ తెలుసుకుంది. దేవతలా వచ్చావంటూ మేనత్తకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు మాధవి ఒంటరి మనస్తత్వానికి స్వస్తి పలికింది. చుట్టూ ఉన్న బంధాలు, వాటిలోని సమస్యలను అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ ఆనందంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.

బంధాలే గురువులు
కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సహోద్యోగులు... ఇలా మన చుట్టూ ఉన్న వ్యక్తులంతా అద్దాల్లాంటివారు. మన ప్రతిబింబాన్ని వాళ్లలో చూసుకోవచ్చు. మనలోని లోపాలను వారిలో చూసుకొని సరిదిద్దుకోవచ్చు. నైపుణ్యాలను పెంచుకోవచ్చు. మనకీ విషయాలను తెలియజేయడానికి, నేర్పడానికే బంధాల రూపంలో వ్యక్తులు కలుస్తుంటారు. కొంతమంది మాత్రమే వారి చర్యల ద్వారా (మంచి లేదా చెడు) మనల్ని ఆకర్షిస్తారు. అంటే ఆ గుణాలేవో మనలోనూ ఉన్నట్టు గుర్తించాలి.  ‘ఎదుటివారిని తప్పుబట్టడం, విమర్శించడం’ అనే సమస్య చాలా మందిలో ఉంటుంది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి కొన్నాళ్లు గమనించండి. అందరూ మంచివాళ్లుగా కనిపిస్తారు. స్నేహబంధాలు కూడా పెరుగుతాయి.  ‘ఎదుటి వ్యక్తి ఏ విషయం నేర్పడానికి వచ్చారు? అనే ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి నుంచి నేను ఏం నేర్చుకుంటాను?’ అని ప్రశ్నించుకోవాలి.

కర్మన్యాయం ఏంటంటే ‘నేర్చుకునేంతవరకు మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలు, ఆ వ్యక్తులు కలుస్తూనే ఉంటారు.   కొన్ని సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయంటే అవి గత జన్మల నుంచి కూడా మోసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాయి. ‘కార్మిక్ రిలేషన్ షిప్స్’లో పాఠాలను అర్థం చేసుకోవడం, క్షమించడం, దయ చూపడం. వీటిని పాటిస్తేనే కర్మలు నశిస్తాయి.

ఎదుటివారు మనం చూసుకునే అద్దం
మాధవి ఈ జన్మ ప్రయాణంలోనే కాదు గత జన్మలోనూ బాధ్యత, భావోద్వేగాలు, బంధాలు, త్యాగానికి సంబంధించిన పాఠాలను అర్థం చేసుకునే క్రమంలోనే ఉంది. గత జన్మలోనూ భర్త, అత్తమామ, ఆడపడుచులు తనకు ఇవన్నీ నేర్పించడానికి బంధువులయ్యారని తెలుసుకుంది. ఇవన్నీ తెలియక వీటన్నింటి నుంచి దూరం అవ్వాలనుకుంది. అంటే, తన కర్మను పూర్తిచేయడానికి ఆమె సిద్ధంగా లేదు. అందుకే ‘ఒంటరితనం’లో కూరుకుపోయింది. రిగ్రెషన్ థెరపీలో తనను తాను తెలుసుకుంది. ‘తను ఇవ్వగలిగింది ఏమిటి? తిరిగి పొందగలిగేదేమిటి?’ అని అనే రియలైజేషన్‌కు వచ్చింది. అప్పుడే తన జీవితం పట్ల సానుకూల దృక్ఫథం ఏర్పడింది. తిరిగి అన్ని బంధాల మధ్య ఆనందంగా జీవించగలిగింది. - న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చి అకాడమీ

- నిర్మల చిల్కమర్రి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement