గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీలో అనుబంధ విభాగాలు చాలా కీలకమని, వాటి కార్యకలాపాలు గ్రామస్థాయి వరకు విస్తరించాలని.. ప్రతీ కార్యకర్త, అభిమాని అందులో భాగస్వామ్యం కావాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయిన ఆయన.. కీలక సూచనలు చేశారు.
‘‘పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడాలి. కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం. వైయస్సార్సీపీ మన పార్టీ. మనందరి పార్టీ. మనం కలిసికట్టుగా నిర్మించుకున్న పార్టీ. నేను మీ అందరి ప్రతినిధిని మాత్రమే’’ అని అన్నారాయన.
ఏదైనా సాధించగలం
YSRCPకి సంబంధించిన దాదాపు 24 అనుబంధ విభాగాలను యాక్టివేట్ చేస్తున్నాం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పోషించే పాత్ర చాలా కీలకమైనది. కారణం పార్టీకి కాళ్లు చేతులు ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్సే.. ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పోరాడగలదు. పరిగెత్తగలదు. పార్టీని పటిష్టపరిచేందుకు మనం శ్రీకారం చుడుతున్నాం. పదిహేను సంవత్సరాలుగా పార్టీ బలంగా ఉంది. మరింత ఆర్గనైజ్డ్‌గా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వీరిని ఆర్గనైజ్డ్‌గా అనుబంధ విభాగాల్లోకి తీసుకుని వస్తే.. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం.
మనం చేసే కార్యక్రమాన్ని పద్ధతిగా తీసుకుని రావడంతో పాటు, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఏ పిలుపునిచ్చినా మొత్తం కేడర్ కదులుతుంది. ఎప్పుడైతే కేడర్ అగ్రెసివ్ గా కదులుతుందో అప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడగలుగుతాం. పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉంటనే మనం ఈ పోరాటం చేయగలుగుతాం. మనం పిలుపునిస్తే.. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరగాలి. అప్పుడే మనం ఆర్గనైజ్డ్‌గా పని చేస్తున్నట్లు అవుతుంది.
అందరినీ కలుపుకుపోవాలి
పార్టీ ఒక పిలుపు ఇస్తే అది గ్రామస్ధాయి వరకు మెసేజ్ పోవాలి. ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామస్ధాయి నుంచి పోరాటం చేయాలి. అలాంటి వ్యవస్ధను క్రియేట్ చేయాలి. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ నిర్మాణంలోకి తీసుకుని రావాలి. ఇందులో భాగంగా మిమ్నల్ని రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించాం. తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పూర్తైంది. ఇప్పుడు మీరు ఆయా జిల్లాల్లో అధ్యక్షులతో మమేకం కావాలి. ప్రతి జిల్లాలోనూ అనుబంధ విభాగాలకు సంబంధించి.. జిల్లా, నియోజకవర్గ, మండల స్ధాయి వరకు నియమించాలి. ముందుగా బలమైన జిల్లా అధ్యక్షుడిని నియమించాలి. ఆ తర్వాత నియోజకవర్గం, మండలాల ద్వారా ప్రతి గ్రామంపై దృష్టి పెట్టాలి.
జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిస్తే ఆ జిల్లా అంతా కదలాలి. రాష్ట్రస్థాయి నుంచి పిలుపునిస్తే.. గ్రామ స్ధాయి నుంచి కదలిక రావాలి. అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి మిమ్మల్ని ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ లేనంత ధ్యాస పెడుతున్నాం. గ్రామస్ధాయి నుంచి తొలిసారిగా ఇంత ధ్యాస పెట్టి ఆర్గనైజ్డ్‌గా ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. వేగంగా అడగులు వేస్తున్నాం. మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ జిల్లాలో తిరగాలి. పర్యవేక్షణ చేయాలి. ఏం జరుగుతుందో చూడాలి. అందుకే ఇందులో అనుభవం ఉన్నవాళ్లను నియమించాం.
సమన్వయంతో సమష్టి కృషి
జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా సమ్వయంతో పని చేయాలి. సంయుక్తంగా పార్టీని ఎలా గ్రామస్థాయికి తీసుకుని పోవాలి అన్నదానిపై ఒక వర్క్ షాప్ కూడా ఉంటుంది. ఇందులో గ్రామస్దాయికి పార్టీని ఎలా తీసుకుని పోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తారు. అందులో ప్రస్తుతం ఉన్న 24 విభాగాల్లో కొన్ని గ్రామస్థాయి వరకు విస్తరించాల్సిన విభాగాలు ఉంటాయి. వాటికి గ్రామస్ధాయి వరకు ప్రతినిధులు.. యువత, మహిళా, రైతు ఇలా అన్ని విభాగాల్లో ఉండాలి. ఈ కార్యక్రమాన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కలిసి చేయాలి.
జిల్లా అధ్యక్షుడితో అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంత విస్తృతంగా మమేకమై తిరగగలిగతే.. అంత లోతుగా గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరిస్తుంది. అలాగే పార్టీకి కూడా అంత మేలు జరుగుతుంది. నేను కూడా అయా విభాగాలతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది.
‘జగన్’ మీ అందరి ప్రతినిధి మాత్రమే:
మీమీద నమ్మకంతో పెట్టిన ఈ బాధ్యతను మీరు అంతే బాధ్యతగా నెరవేరిస్తే.. మీక్కూడా మంచి జరుగుతుంది. పార్టీ మీ సేవలను గుర్తిస్తుంది. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు, జిల్లా అధ్యక్షులు సహా పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వారికే ప్రాధాన్యత ఉంటుంది.
పార్టీ మనది, మనందరిది అన్న విషయాన్ని గుర్తుంచుకొండి. మనం అందరం కలిసికట్టుగా పార్టీని నిర్మించుకున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. వారికే ప్రధమ ప్రాధాన్యత కూడా ఉంటుంది.
క్షేత్రస్థాయి నుంచి బలోపేతం
పార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం మూడు, నాలుగు నెలల్లో పూర్తి కావాలి. ఆ తర్వాత బూత్ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. పార్టీ నిర్మాణంలో ఉన్న వారందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలి. వారందరినీ పార్టీలో భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలి.
వైఎస్సార్‌సీపీని దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా నిర్మించాలన్న ధృఢ సంకల్పంతో పని చేస్తున్నాం. క్షేత్రస్ధాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వారంతా పార్టీని నమ్ముకుని ఉన్నారు. వాళ్లందరికీ పార్టీ వ్యవస్ధలోకి తీసుకుని రావాలి.
అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా పని చేయాలి. అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు.. ఇద్దరూ ఎలా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం చేసుకోవాన్న దానిపై త్వరలోనే వర్క్ షాప్ నిర్వహిస్తామని జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment