హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.
మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.
బంధాలే జీవితం..
జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.
మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..
మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్‌మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.
మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్‌వర్క్‌లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి.
ఆరోగ్యానికి బూస్టర్లు..
మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది.
తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.
బంధాల తోటను సాగుచేద్దాం..
జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.
అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.
మీ..
సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment