
రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’
కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టిన ‘సర్వేజనా ఫౌండేషన్’
బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కార్యక్రమాలు
తండ్రీ కూతుళ్ల ప్రేమ అనిర్వచనీయం.. కూతురంటే ప్రతి తండ్రికీ ఎనలేని ప్రేమ.. తన కళ్లలో సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సునాయసంగా భరిస్తుంటాడు తండ్రి.. తన తండ్రి రోజంతా కష్టపడి పనిచేసేది తన కోసమేనని తెలుసుకుంటుంది కూతురు. ప్రతిరోజూ సమయానికి ఇంటికి వచ్చే నాన్న.. కాస్త ఆలస్యం అయితే చాలు అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడని తల్లి వెంటపడుతుంది. తండ్రి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎగిరిగంతేస్తుంది. ఇది తండ్రీ కూతుళ్ల మధ్య నిత్యం జరిగేదే.. అయితే.. యాక్సిడెంట్‌లో తన తండ్రి ప్రాణాలు విడిచాడని, ఇక ఎప్పటికీ ఇంటికి రాడనే వార్త విన్న కూతురిని ఓదార్చడం ఎవరి తరమూ కాదు. ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోవద్దని ట్రాఫిక్ రూల్స్‌పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా చాలామందిలో మార్పు రావడం లేదు. దాంతో కూతురితో అవగాహన కలి్పస్తే తండ్రిలో తప్పకుండా మార్పు వస్తుందనే ఆలోచనతో ‘సర్వేజన ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ పేరుతో కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
నాన్న! నేను ఇటీవల ఒక వార్త చదివాను. 2024లో 1.57 కోట్ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయని, ఇది మన రాష్ట్ర జనాభాలో దాదాపు సగంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కేసుల్లో ఒకటి మీదైతే? ఒక చిన్న తప్పు మా జీవితాన్ని మార్చగలదనే ఆలోచన కూడా నన్ను భయపెడుతోంది. ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలను నేను చూశాను. తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ వాళ్లు లేని జీవితం ఎలా ఉంటుందో తెలియక భయపడే పిల్లల్ని చూశాను. అందుకే నిన్ను కోల్పోవడం తలచుకుంటేనే నా గుండె భారంగా మారుతోంది నాన్న..
నాన్న! ఒక రోజు మేమంతా నీ రాకకోసం ఎదురుచూస్తుంటే.. నీవు ఇక ఎప్పటికీ రాకపోతే? ఒక నిర్లక్ష్య క్షణం నిన్ను మా నుంచి దూరం చేసేస్తే? నీ ప్రేమ, నీ నవ్వు, నీ మార్గనిర్ధేశం లేకుండా మేము ఎలా బతకుతాం? నాన్న దయచేసి ఎప్పుడూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తానని నాకు మాటివ్వు. ఎప్పుడు మద్యం తాగి వాహనం నడపకూడదు, అధిక వేగంతో ప్రయాణించకూడదు, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరగా ధరించాలి, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు. ఇవి చేయనని నాకు మాటివ్వు నాన్న.. ఎందుకంటే నీవు లేకుండా మా జీవితం ఊహించుకోలేం..
– అంతులేని ప్రేమతో.. నీ ప్రియమైన కుమార్తె
ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల్లో వేల కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోతున్నాయి. 90శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి.. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటివి ఎంతో మంది ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి.
మానవ తప్పిదాల వల్ల జరిగే రోడ్డు
ప్రమాదాలపై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో ‘సర్వేజనా ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఓ కూతురు తండ్రికి ప్రేమతో అవగాహన కల్పించేలా ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్ యాప్’ ద్వారా అవగాహన కల్పిస్తోంది.
ఇందులో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా ఈ మహత్ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని సర్వేజన ఫౌండేషన్ చైర్‌పర్సన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏవీ గురవారెడ్డి అన్నారు. ప్రతి నెలా యాప్ ద్వారా పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తున్నామని, కూతురితో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ సీఈఓ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.63 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇవి 1.63 లక్షల మంది కుటుంబాలు తల్లడిల్లిన సంఘటనలు.. వారి కలలు, భవిష్యత్తు నాశనమై, తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు, పిల్లలను కోల్పోయి కన్నీళ్లు మిగిలిన తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే వీరిలో 50 వేల మంది హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలను నడిపినవారయితే, మరొక 17 వేల మంది సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించి ప్రాణాలు కోల్పోయారు.