Psychological problems
-
నీ కోసం నువ్వు.. అన్ని బంధాలకూ మూలమిదే!
కనెక్షన్ కార్నర్‌కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.ప్రేమించలేని మాయ..మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది. మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను. 👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది. 👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది. 👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్లకు దారితీసింది.మీకోసం కొన్ని చిట్కాలు.. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి. 👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి. 👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి. 👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. 👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి. 👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది. 👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది. 👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి. 👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారా? పెద్దయ్యాక ఈ సమస్యలు తప్పవు!
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు డిజిటల్ పరిజ్ఞానం పెరుగుతుందని, ఆన్లైన్లో నేర్చుకుంటారని స్మార్ట్ఫోన్లుగానీ, ట్యాబ్లెట్గానీ ఇస్తే.. భవిష్యత్తులో మానసిక సమస్యల బారినపడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత చిన్న వయసులో పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తే.. పెద్దయ్యాక మానసిక ఇబ్బందులతో బాధపడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ ఇటీవల భారత్ సహా 40 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాల్యంలోనే స్మార్ట్ఫోన్లను అందుకున్నవారు.. యుక్త వయసుకు వచ్చాక ఆత్మహత్య ఆలోచనలు పెరగడం, ఇతరుల పట్ల దూకుడుగా వ్యవహరించడం, వాస్తవికత నుంచి దూరంగా పలు రకాల భ్రాంతులకు గురికావడం వంటివి ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఈ అధ్యయనం కోసం పలు దేశాల్లో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మంది నుంచి డేటా సేకరించారు. అందులో మన దేశానికి చెందినవారు 4,000 మంది ఉండటం గమనార్హం. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ.. ♦ మహిళలకు సంబంధించి.. పెద్దగా ఊహ తెలియని అంటే ఆరేళ్ల వయసులోనే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించడం ప్రారంభించిన 74% మంది తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇక 10 ఏళ్ల వయసులో మొదటి స్మార్ట్‌ఫోన్ అందుకున్నవారిలో 61% మంది.. 15 ఏళ్లకే వాడటం మొదలుపెట్టినవారిలో 52% మంది.. 18 ఏళ్లకు వాడటం ప్రారంభించిన వారిలో 46% మంది మానసిక దుష్ప్రభావాలకు లోనయ్యారు. ♦ పురుషులకు సంబంధించి ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్టు తేలింది. ఆరేళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్‌ను వాడటం మొదలుపెట్టిన వారిలో 42% మంది మానసిక సమస్యలకు గురైతే.. 18 ఏళ్లలో స్మార్ట్‌ఫోన్ చేతపట్టిన వారిలో ఇది 36 శాతమే. ♦ పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్/ట్యాబ్లెట్ చేతికి ఇచ్చి మురిసిపోతున్న తల్లిదండ్రులు.. వారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడేందుకు కారణమవు తున్నారని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఎంత చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్/ట్యాబ్లెట్ ఇస్తే.. వారు యుక్త వయసులోకి వచ్చాక అంత ఎక్కువగా మానసిక సమస్యల బారినపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చిన్నవయసులో స్మార్ట్‌ఫోన్ ఇవ్వడమంటే చేజేతులా వారి భవిష్యత్తును నాశనం చేసినట్టేనని పేర్కొంది. అంతర్జాతీయ సగటు కంటే మనమే ఎక్కువ.. గత ఏడాది విడుదలైన మెకాఫె గ్లోబల్ కనెక్టెడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం.. 10–14 ఏళ్ల వయసున్న భారతీయుల్లో స్మార్ట్‌ఫోన్ వినియో గం 83% ఉండటం గమనార్హం. అంతర్జాతీయ సగటు 76% కంటే ఇది 7% ఎక్కువ. అంటే మన దగ్గర మిగతా అన్ని వయసుల వారికన్నా.. పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వారు సగటున రోజుకు 5–8 గంటల పాటు.. అంటే సంవత్సరానికి 2,950 గంటల వరకు ఆన్లైన్లోనే గడుపుతు న్నారని వినియోగ గణాంకాలు చూపిస్తున్నాయి. తోటి వారితో కలవక ప్రవర్తన దెబ్బతింటోంది స్మార్ట్‌ఫోన్ విప్లవానికి ముందు పిల్లలు చాలా సమయం కుటుంబంతో, స్నేహితులతో గడిపేవారు. ఇప్పుడీ పరిస్థితి లేదు. సమాజంలో తమ భాగస్వామ్యానికి తగినట్టుగా సాధన లేక పోవడం, తోటివారితో కలవకపోవడంతో ప్రవర్తన తీరు సంక్లిష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌కు చిరు ప్రాయంలోనే అలవాటు పడటం అంటే పెద్దవారిగా ఎక్కువ మానసిక సమస్యలు ఎదుర్కోవడానికి దారితీసుకోవడమే. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, ఇతరుల పట్ల దూకుడు భావాలు, వాస్తవికతకు దూరమైన ఆలోచనలు, సమాజం నుంచి వేరుగా ఉన్నామన్న భావన వంటివి చుట్టు ముట్టే అవకాశాలు ఎక్కువ. యుక్త వయసు వచ్చాకే పూర్తి స్థాయిలో స్మార్ట్‌ఫోన్ వినియోగానికి అవకాశం ఇవ్వడం మంచిది. – సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, న్యూరో సైంటిస్ట్ తారా త్యాగరాజన్ -
సై‘కాలేజీ’కి డిమాండ్!
టెక్నాలజీ పెరిగింది.. జీవన విధానం మారుతోంది.. అన్ని రంగాల్లో ఒత్తిడి పెరిగింది.. ఫలితంగా మానసిక, పని ఒత్తిడితో ‘సైకాలజీ’ సమస్యలతో బాధపడేవారు అధికమయ్యారు. ప్రతీ ఏడుగురిలో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చెబుతోందంటే ఏ స్థాయిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయో స్పష్టమ వుతోంది. అయితే, దీనికి తగ్గట్లు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, చికిత్స చేసేందుకు ఆ స్థాయిలో సైకాలజిస్టులు మాత్రం లేరు. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి ఏడుగురు మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. దీంతో వారి కొరత పెరిగింది. అయితే ప్రస్తుతం సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య ఏకంగా 50 శాతం పెరిగింది. సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో సైకాలజీ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిష్టాత్మక కాలేజీలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ గ్రాడ్యుయేట్, డిప్లొమో, పీజీ కోర్సులు అంది స్తున్నాయి. డిగ్రీలో ఏ గ్రూపు చదివినా పీజీలో సైకాలజీని ఎంచుకో వచ్చు. గతంలో ఢిల్లీలోని రామానుజన్ కాలేజీతో పాటు యూని వర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో సైకాలజీకి 30–40 వేల అప్లికేషన్లు మాత్ర మే వచ్చేవి. 2020–21లో 50–60వేల దరఖాస్తులు వచ్చాయి. 20 22లో 60వేలు దాటాయి. విద్యార్థులు ఎక్కువగా సైకాలజీపై ఆసక్తి చూపడంతో సైకాలజీ సీట్ల సంఖ్యను కూడా ఢిల్లీ యూని వర్సిటీ పెంచింది. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూని వర్శిటీ)లో ఏటా 4–5వేల మంది చేరేవారు. ఇప్పుడు 10 వేల మంది అడ్మిషన్లు పొందుతున్నారు. అంటే సైకాలజీ చదివేవారి సంఖ్య రెట్టింపు అయింది. బెంగళూరు జైన్ డీమ్డ్ యూనివర్శిటీ, అమిటి, పూణేలోని సింబయాసిస్, యూనివర్శిటీ ఆఫ్ లక్నో, బెనారస్‌తో పాటు అన్ని వర్సిటీల్లో కూడా అడ్మిషన్లు 50% తక్కువ కాకుండా పెరిగాయి. కొన్నింటిలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఆంధ్రా, తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఈ కోర్సు ఉంది. దేశ వ్యాప్తంగా 9వేల మంది మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. కోవిడ్– 19 తర్వాత సైకాలజిస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీరికి భారీగా వేతనాలు కూడా ఇస్తున్నారు. దీంతో చాలామంది ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు. అటు వర్సిటీలు కూడా క్లినికల్ సైకాలజీ, కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, కల్చరల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, ఎడ్యు కేషన్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, న్యూరో సైకాలజీ పేరుతో ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. ► పాతికేళ్ల కిందట మానసిక రోగం అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు 10మంది ఆస్పత్రికి వెళ్తే వారిలో నలుగురిని డాక్టర్లు సైకాలజిస్టుకు సిఫార్సు చేస్తున్నారు. ► అభద్రత, ఆత్రుత, తదితర బాధలు పెరుగు తున్నాయి. దీంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. ► కార్పొరేట్ విద్య వచ్చాక పిల్లలను ఉద్యోగం సాధించే యంత్రాలుగా మాత్రమే యాజమాన్యాలు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లే శిక్షణనిస్తున్నాయి. దాంతో వారిపైనా తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ► ముఖ్యంగా కోవిడ్–19 తర్వాత భర్త లను కోల్పోయిన భార్యలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మా, నాన్నను కోల్పోయిన పిల్లలున్నారు. వీరందరూ మానసిక ఒత్తిడికి గురవు తున్నారు. అలాగే, కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి. రకరకాల కారణాలతో.. ప్రతీ కాలేజీలో సైకాలజిస్టు తప్పనిసరిగా ఉండాలని 2008లోనే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కేరళలో స్కూలు స్థాయి నుంచే సైకాలజిస్టులు ఉన్నారు. అందుకే వారి చదువు, జీవన విధానం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైకాలజీ కోర్సుకు డిమాండ్ పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. – సిరిగిరెడ్డి జయరెడ్డి, సైకాలజిస్టు, కర్నూలు -
సైకాలజికల్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్!
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా ఆమె. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తనకున్న సైకాలజికల్ ప్రాబ్లమ్స్‌ను బయటపెట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కింది శృతి. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ‘నాకు మానసికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్ ఉన్నట్టుండి ఎక్కువగా ఉద్రేకపడతాను. కొన్ని విషయాల్లో సహనాన్ని కోల్పోయి ఆవేశపడతాను. నా సమస్యల గురించి బయటకు చెప్పడానికి మొదట భయపడ్డాను. ఈ మధ్య చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పేస్తున్నారు. దీంతో నాకూ కూడా నా మానసిక రుగ్మతల గురించి చెప్పాలి అనిపింది’ అని చెప్పింది. ‘అయితే ప్రస్తుతం నా మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాను. మానసిక రుగ్మతలను తగ్గించడానికి సంగీతం కూడా ఉపయోగపడుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే అది షూటింగ్ స్పాట్లో అయిన, ఇంట్లో అయిన వెంటనే కోపం వస్తుంది. చదవండి: అర్జున్ రెడ్డి ఆఫర్ వదులుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశా: హీరోయిన్ అలాంటి పరిస్థితి తీవ్రం అయితే వెంటనే థెరపీ చికిత్సకు వెళుతున్నాను. నా సమస్యలను నేను దాచాలనుకోవడం లేదు’ అని పేర్కొంది. అయితే మన సమస్యలను నిర్మోహమాటంగా బయటకు చెప్పేయాలన్నారు. దాచాలనుకుంటే ఆ సమస్యలు మరింత అధికం అవుతాయని, ఎవరేమనుకుంటారో అని భయపడుతుంటారంది. కానీ మన సమస్యల గురించి బయటకు చెప్పితే భారం తగ్గడమే కాదు సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందని శృతి చెప్పుకొచ్చింది. కాబట్టి సమస్య ఎలాంటిదైనా మనసు విప్పి చెప్పుకోండి అంటూ ఆమె సూచించింది. -
ఈ లక్షణాలుంటే మీకు ‘పాజిటివిటీ పిచ్చి’ పట్టినట్టే! అతి సానుకూలతతో అనర్థాలే
What Is Toxic Positivity: రాజుది తెనాలి. సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ కోసం మూడేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. అశోక్‌నగర్‌లో ఫ్రెండ్స్‌తో పాటు రూమ్‌లో ఉండి చదువుకునేవాడు. మొదట్లో కోచింగ్, లైబ్రరీ, రూమ్, ప్రిపరేషన్లతో చాలా బిజీగా ఉండేవాడు. అక్కడే ఒక ఫ్రెండ్ రూమ్‌లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదివాడు. అప్పటి నుంచి అలాంటి పుస్తకం ఎక్కడ కనపడినా చదువుతుండేవాడు. ఒక సంస్థ ఉచితంగా వ్యక్తిత్వ వికాస శిక్షణ నిర్వహిస్తోందని తెలిసి హాజరయ్యాడు. అదే సంస్థ నిర్వహించే ట్రైనర్స్ ట్రైనింగ్‌కీ హాజరయ్యాడు. అక్కడే అతనికి ‘పాజిటివిటీ పిచ్చి’ పట్టింది. జీవితంలో అంతా పాజిటివిటీనే చూడాలని ట్రైనింగ్‌లో చెప్పిన మాటలు అతని మనసును పూర్తిగా ఆక్రమించాయి. అప్పటి నుంచీ పాజిటివిటీ, పాజిటివ్ థింకింగ్‌పై సోషల్ మీడియాలో రోజుకు పది పోస్టులు పెడుతుండేవాడు. వాటికి వచ్చే లైక్‌లు చూసుకుని, కామెంట్లు చదువుకుని సంబరపడిపోయేవాడు. యువతలో పాజిటివిటీ నింపాలని స్కూళ్లు, కాలేజీల్లో ఉచితంగా క్లాసులు నిర్వహించేవాడు. ప్రతిక్లాసుకు సంబంధించిన వార్త, ఫొటో పేపర్లో వస్తుండటంతో చదువుకుని మురిసిపోయేవాడు. తానో సెలబ్రిటీ అయ్యానని కలల్లో విహరించేవాడు. కానీ వాస్తవం మరోలా ఉంది. రాజు తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. రాజు ఉద్యోగం సాధిస్తే తమ జీవితాలు మారతాయని వాళ్లు ఎదురుచూస్తున్నారు. కానీ రాజు పాజిటివిటీ పేరుతో పక్కదారి పట్టాడు. మూడేళ్లయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇలాంటివాళ్లు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. టాక్సిక్ పాజిటివిటీ లక్షణాలు పాజిటివిటీ లేదా పాజిటివ్‌గా ఆలోచించడం తప్పుకాదు. కానీ ఆ పాజిటివిటీ ఎక్కువైతే అదే ఒక సమస్యగా మారుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆశావాదంతో, సంతోషంగా ఉండాలనుకోవడం, నిజమైన భావోద్వేగాలను తిరస్కరించడం లేదా తగ్గించడాన్నే ‘టాక్సిక్ పాజిటివిటీ’ అంటారు. ఈ టాక్సిక్ పాజిటివిటీలో చిక్కుకున్న వ్యక్తులు... ►అన్నింటిలో సానుకూలతను మాత్రమే చూడాలంటారు ►నిజమైన భావోద్వేగాలను గుర్తించేందుకు ఇష్టపడరు. వాటికి ముసుగువేస్తారు లేదా దాచేస్తారు. ►జీవితంలో ఎదురయ్యే ప్రతీ విపత్తు వెనుక ఏదో మంచి ఉంటుందని వాదిస్తారు ►భావోద్వేగాలను విస్మరించడం ద్వారా దానితో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు ►పాజిటివ్ కోట్స్, స్టేట్మెంట్లతో ఇతరుల బాధను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తారు ►ప్రతికూల భావోద్వేగం వస్తే అపరాధ భావనకు లోనవుతారు ►ప్రతికూల భావోద్వేగాలున్నవారిని బలహీనులుగా చూస్తారు, కించపరుస్తారు. అతి సానుకూలతతో అనర్థాలే ►ప్రతికూల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేసినా, అణచివేసినా అవి వదిలిపెట్టవు. సమయం చూసుకుని వెంటపడతాయి. అందుకేటాక్సిక్ పాజిటివిటీని పాటించే వ్యక్తులు మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. ‘ఆల్ ఈజ్ వెల్’, ‘డోంట్ వర్రీ, బీ హేపీ’, ‘పాజిటివ్ వైబ్స్ ఓన్లీ’ అనే స్టేట్మెంట్లు అన్ని సందర్భాల్లోనూ సరిపోవు. ప్రతీక్షణం ఇలా ఆలోచించడం వల్ల... ►ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడం లేదా తిరస్కరించడం వల్ల మరింత మానసిక ఒత్తిడికి లోనవుతారు ∙అంతా మంచిగా ఉందని అనుక్షణం నటించడం చివరకు యాంగ్జయిటీ, డిప్రెషన్, శారీరక సమస్యలకు దారితీస్తుంది ►అసలైన సమస్యను తిరస్కరించడం లేదా గుర్తించకపోవడం వల్ల కష్టాల్లో పడతారు, నష్టపోతారు ►సమయం సందర్భం చూసుకోకుండా పాజిటివ్‌గా మాట్లాడటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి, ఒంటరిగా మిగిలిపోతారు ►సహానుభూతి లేకుండా, సన్నిహితుల కష్టాలను అర్థం చేసుకోకుండా సలహాలిచ్చి దూరం చేసుకుంటారు. మరేం చెయ్యాలి? జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్నీ పాజిటివ్‌గా చూడటం ద్వారానో లేదా ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడం ద్వారానో నిజమైన ఆనందం రాదు. ఇప్పుడు, ఈ క్షణంలో మనం ఏ భావోద్వేగాన్ని అనుభవిస్తున్నామో.. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా.. దాన్ని అంగీకరించడమే నిజమైన ఆనందాన్నిస్తుంది. టాక్సిక్ పాజిటివిటీ నుంచి తప్పించుకోవాలంటే.. ►ఆరోగ్యకరమైన వ్యక్తికి అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని గుర్తించండి ►కోపం, బాధ, నిరాశ, నిస్పృహ.. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు జీవితంలో సాధారణమని గుర్తించాలి. ►వాటిని కలిగి ఉండటం, వ్యక్తీకరించడం తప్పేమీ కాదని అంగీకరించాలి ∙ ►భావోద్వేగాలను సాధనాలుగా, సమాచారంగా గుర్తించాలి. ►ఏదైనా ప్రతికూలత ఎదురైతే, అది ఇస్తున్న సమాచారాన్ని గుర్తించి ముందుకు సాగాలి ∙ ►ప్రతికూల భావోద్వేగాల గురించి సన్నిహితులతో మాట్లాడాలి. ►టాక్సిక్ పాజిటివిటీతో సన్నిహితులను ఇబ్బంది పెట్టాయని గుర్తిస్తే వెంటనే ఆ తప్పును అంగీకరించాలి. ►మరోసారి అలా స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలి. ►సన్నిహితులెవరైనా టాక్సిక్ పాజిటివిటీతో సలహాలిస్తుంటే నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకోవాలి. ►నిగ్రహాన్ని కోల్పోయి అరిచినా.. కోపం చల్లారాక క్షమాపణ కోరాలి. ►మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. ఇవేవీ పనిచేయనప్పుడు సైకాలజిస్ట్ లేదా సైకోథెరపిస్ట్‌ను కలవండి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి -
ఒత్తిడే శత్రువు.. స్థూలంగా మూడే రకాలు.. ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’
కంచర్ల యాదగిరిరెడ్డి వెర్రి వేయి విధాలు అంటుంటారు. అది ఇది ఒకటి కాకపోయినా మానసిక సమస్యల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి. అంతేకాదు మానసిక సమస్యలు ఫలానా వారికే వస్తాయి. ఫలానా వారికి రావన్న మాటే ఉండదని.. ప్రాంతం, జాతి, స్త్రీ, పురుషులు, వయసు, ఆదాయం వంటి వాటన్నింటికీ అతీతంగా ఎవరికైనా రావొచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని.. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చెడిపోయేందుకు దోహదపడే అంశాల్లో.. మొట్టమొదట చెప్పుకోవాల్సింది సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లు! మార్కులు బాగా రావాలని పిల్లలను డిమాండ్ చేయడం, మిత్రుడిలా విలాసవంతమైన కారు కొనుక్కోవాలన్న విపరీతమైన తపన వంటివి సామాజిక ఒత్తిళ్ల కోవకు వస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అవసరానికి తగిన డబ్బులు ఉండటం బాగుంటుందిగానీ లేనప్పుడే సమస్య. సమాజంలో ఆర్థికంగా అడుగున ఉన్నవారు మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. 2015లో ఇరాన్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పేదరికంలో, వెలివాడలు లేదా ఊరికి దూరంగా ఉండటం వంటివి మానసిక ఆరోగ్యం దెబ్బతినేందుకు అవకాశం కల్పిస్తాయి. మరో అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. బాల్యంలోని అనుభవాలతో.. వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో బాల్యానిది కీలకమైన పాత్ర అని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు విస్పష్టంగా చెప్పాయి. చిన్నతనంలో శారీరక, మానసిక, లైంగిక హింసను ఎదుర్కోవడం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోవడం లేదా విడిపోవడం, తల్లిదండ్రుల్లో ఎవరైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటం వంటివి పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ అంశాలు కొన్నిసార్లు సైకోటిక్ సమస్యలకు దారితీస్తే.. మరికొన్నిసార్లు పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)కు కారణం కావచ్చని పేర్కొంటున్నాయి. జన్యువుల పాత్ర కూడా.. మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. కుటుంబంలో నిర్దిష్ట జన్యువుల్లో మార్పులు కొనసాగుతూంటే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుమార్పులకు మరికొన్ని అంశాలు కూడా తోడైనప్పుడు అవి వ్యాధులుగా పరిణమించే అవకాశం ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే.. ఏదైనా మానసిక సమస్యకు కారణమయ్యే జన్యువులు మనలో ఉన్నా అది తీవ్రమైన సమస్యగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సామాజిక శాస్త్రాల విభాగం 2019 నాటి అధ్యయనంలో పేర్కొంది. ఇక ఇలాంటి నిర్దిష్ట జన్యువులు ఉన్నా, లేకున్నా మానసిక సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. ఇదే సమయంలో కేన్సర్, మధుమేహం, తీవ్రమైన నొప్పి వంటి శారీరక సమస్యలు మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చని వివరించింది. స్థూలంగా మూడే.. ముందుగా చెప్పుకున్నట్టు మానసిక సమస్యల సంఖ్య పెద్దదే అయినా.. కొన్ని సాధారణ లక్షణాలున్న వాటన్నింటినీ కలిపి ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’ డిజార్డర్లు అనే మూడు రకాలుగా విభజించారు. ►ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైన మానసిక సమస్య యాంగ్జైటీ డిజార్డర్. దీనికి లోనైన బాధితుల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని వస్తువుల విషయంలో విపరీతమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తప్పించుకునేందుకు వారు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. యాంగ్జైటీ డిజార్డర్‌లో.. సాధారణ యాంగ్జైటీ డిజార్డర్తోపాటు ప్యానిక్ డిజార్డర్, ఫోబియాలు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ), పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటివి ఉంటాయి. ►మూడ్ డిజార్డర్ల విషయానికి వస్తే.. వీటిని డిప్రెసివ్ లేదా అఫెక్టివ్ వ్యాధులని కూడా పిలుస్తారు. వీటిలో బాధితుల మనోస్థితి తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. విపరీతమైన ఆనందం లేదా దుఖం, కోపం వంటి ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. మూడ్ డిజార్డర్లలో.. మనోవ్యాకులత, బైపోలార్ డిజార్డర్, సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్లు ఉంటాయి. ►స్కీజోఫ్రీనియా డిజార్డర్ల గురించి చెప్పాలంటే.. కొంచెం సంక్లిష్టమైన మానసిక సమస్యలన్నీ ఈ కోవకు చెందినవని చెప్పొచ్చు. సాధారణంగా ఈ రకమైన మానసిక సమస్యలు 16– 30 ఏళ్ల మధ్య వయసు లోనే వృద్ధి చెందుతాయి. ఆలోచనలు కుదురుగా ఉండకపోవడం స్కీజోఫ్రీనియా లక్షణాల్లో ఒకటి. చిత్త భ్రమ, పలవరింత, నిస్పృహ వంటివీ దీని లక్షణాలే. -
పోలీస్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురిని చంపేశాడు!
అగర్తలా: మానసికంగా కుంగుబాటుకు గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు, సోదరుడు, పోలీస్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటన త్రిపురలోని ఖొవాయ్ జిల్లాలో శనివారం జరిగింది. ష్యురాటలీ గ్రామానికి చెందిన ప్రదీప్ దేవ్రాయ్ శనివారం ఉదయం అకస్మాత్తుగా తన ఇంట్లోనే భార్య, ఇద్దరు కూతుళ్లతోపాటు సోదరుడిని ఐరన్ రాడ్‌తో తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఘటనలో కూతుళ్లు, సోదరుడు మరణించారు. తర్వాత అటుగా వెళ్తున్న ఆటోను అడ్డగించి, డ్రైవర్, అతడి కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ చనిపోయాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సత్యజిత్ మల్లిక్ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ప్రదీప్‌ను నిలువరించేందుకు యత్నించారు. కానీ, తెలియని ఆవేశంతో ఉన్న ప్రదీప్.. ఇన్స్పెక్టర్ సత్యజిత్‌పై కూడా ఇనుప రాడ్‌తో దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. -
నువ్వేమైనా అందగత్తెవా?!.. విపరీతమైన కామెంట్లు రావడంతో..
దీపిక (పేరు మార్చడమైనది) ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. తమది దిగువ మధ్యతరగతి కుటుంబమైన కూతురును బాగా చదివించాలన్నది తండ్రి ప్రసాద్(పేరుమార్చడమైనది) కల. అందుకు తగినట్టుగానే దీపిక బాగానే చదువుతుంది. ఫ్యాషన్ అంటే ఆసక్తి ఉండే దీపిక తన డ్రెస్సింగ్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. తన డ్రెస్సింగ్‌ను నలుగురూ మెచ్చుకోవాలన్న ఆలోచనతో రకరకాల మోడళ్లలో డ్రెస్సులు ధరించి, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది. వచ్చిన లైక్స్, మెచ్చుకోలు కామెంట్స్ చూసుకొని మురిసిపోయేది. టిక్‌టాక్ వీడియోలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది దీపిక. ఆరు నెలలు గడిచిపోయాయి. ఓ రోజు మెసేజ్‌లు చూసుకుంటున్న దీపిక ఉన్నట్టుండి ఫోన్ విసిరికొట్టింది. అది చూసిన తల్లి దీపికను మందలించింది. తల్లివైపు కోపంగా చూసి తన రూమ్‌కి వెళ్లిపోయింది దీపిక. ముంచుకొచ్చే కోపం రాత్రి భోజనానికి రమ్మని ఎంత చెప్పినా కూతురు బయటకు రాలేదు. ఈ మధ్య దీపిక చాలా ముభావంగా ఉంటోందని, ఏదడిగినా త్వరగా కోపం తెచ్చుకుంటుందని భర్తకు చెప్పింది. ‘ఆ వయసు అలాంటిది. అవేమీ పట్టించుకోకు. కొన్ని రోజులు పోయాక తనే తెలుసుకుంటుందిలే’ అన్నాడు ప్రసాద్. ‘అన్నింటికీ కూతురును ఇలాగే వెనకేసుకొస్తారు. అన్నం తినమన్నా అదేదో తిట్టులాగే వినపడుతోంది మీ కూతురుకి’ అంటూ తన అసహనాన్ని తెలియజేస్తూ గిన్నెలు సర్ది పడుకుంది. ఊహించని సంఘటన మరుసటి రోజు పది దాటుతున్నా దీపక రూమ్‌లోంచి ఎలాంటి అలికిడి లేదు. రాత్రి భోజనం కూడా చేయకుండా గది తలుపులు వేసుకొని పడుకుంది. ఇప్పటికీ లేవలేదు. ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. తల్లి ఎంత పిలుస్తున్నా కూతురు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి, దీపికను అదేపనిగా పిలిచాడు ప్రసాద్. అయినా ఎలాంటి అలికిడి లేదు. ఇంటి వెనకాల నుంచి వెళ్లి, కిటికీ డోర్ తీసి చూశాడు. కూతురు ఉరివేసుకొని కనపడటంతో ప్రసాద్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. ముంచేసిన కామెంట్స్ పోలీసులు దీపిక తల్లి తండ్రులనూ, ఇంటి చుట్టుపక్కల వారినీ విచారించారు. దీపిక ఆత్మహత్యకు కారణమేంటనేది తెలియలేదు. పోలీసులు దృష్టి దీపిక వాడుతున్న ఫోన్ మీద పడింది. పూర్తి డేటా తీసిన పోలీసులు దీపిక సోషల్ మీడియా పేజీలను కూడా చూశారు. దాంట్లో నెల రోజులుగా దీపిక పోస్టులకు అనుచితమైన కామెంట్స్ రావడం, దానికి దీపిక ఎదురు సమాధానాలు ఉండటం చూశారు. పాతికమందికి పైగానే దీపిక అప్లోడ్ చేసిన ఫొటోలకు ‘నువ్వో పెద్ద అందగత్తెవా!’ అని ఒకరు, ‘నీకంత సీన్ లేదు’ అంటూ ... ఎన్నో విపరీతార్థాలతో ఉన్న కామెంట్స్ ఉన్నాయి. కొన్నాళ్లుగా నెగిటివ్ కామెంట్స్‌కు తట్టుకోలేని దీపిక, వారికి ఘాటుగానే సమాధానాలు ఇచ్చేది. దీంతో దీపికను ఏడిపించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాళ్లు ఎవరో, ఎక్కడ ఉంటారో కూడా తెలియని దీపిక ఈ నెగిటివ్ కామెంట్స్‌కి తనలో తనే కుమిలిపోతూ వచ్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే బాధపడతారని మౌనంగానే ఉండిపోయింది. మెసెంజర్ లో వచ్చే మెసేజ్‌లలో తప్పుడు కామెంట్స్ వచ్చేవి. వాటిని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతూ ఉండేది. రోజు రోజుకీ దీపికలో అసహనం, కోపం తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తనపైన వచ్చే విమర్శలను తట్టుకోలేక దిగులుగా ఉండేది. తండ్రి అడిగితే ‘ఒంట్లో బాగోలేదని’ చెప్పేది. తల్లి అడిగితే మాత్రం కోపంగా విరుచుకుపడేది. విపరీతమైన ఒత్తిడికి లోనైన దీపిక ఆత్మహత్యా యత్నం చేసింది. పూర్తిగా శోధించిన పోలీసులకు వాళ్ల కాలనీలోని అబ్బాయిలే ఆమెను టార్గెట్ చేశారని తెలిసింది. ఆత్మహత్యకు రెండవ ప్రధాన కారణం.. ఏ తల్లిదండ్రులకైనా వారి అతి పెద్ద పీడకల ఏంటంటే తమ పిల్లల మరణానికి సాక్ష్యం ఇవ్వడం. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం 2018లో 10,159 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే 2019కి ఆ సంఖ్య 3.4 శాతం పెరిగిందని తన నివేదికలో పొందుపరిచింది. ప్రతి రోజూ 381 టీనేజర్లు ఆత్మహత్య లు చోటుచేసుకుంటున్నట్టు, దీంట్లో పరీక్షల్లో ఫెయిలవడం ఇతరత్రా కారణాలు మొదటి కారణంగా ఉంటే, సోషల్ మీడియానే రెండవ ప్రధాన కారణంగా ఉంటోందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే 67 శాతం టీనేజర్ల జీవితాలు అధ్వానంగా ఉన్నట్టు, 73 శాతం మంది ఇతరులకు తమ రూపాన్ని చూపించుకునే ఫొటోలు పోస్ట్ చేయడం పట్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు, 60 శాతం జనాదరణ కోసం, 80 శాతం మంది సోషల్ మీడియా డ్రామా ద్వారా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు. పది నుండి 14 ఏళ్ల వయసు గల బాలికలలో ఆత్మహత్య శాతం మూడు రెట్లు పెరిగిందని, సోషల్‌మీడియా వాడకం రోజుకు 2–3 గంటలపాటు ఏకధాటిగా ఉపయోగించే టీనేజర్లలో బాధ, ఆత్మహత్య టెండెన్సీ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని అమెరికా పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తమ నివేదికలో పొందుపరిచారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీనేజర్లు ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ చేయడం మేలు సోషల్ మీడియాలో అందరి మెప్పు పొందడం అనేది అసాధ్యం. వ్యతిరేక వ్యాఖ్యలు రావచ్చు అనే అవగాహన కూడా ఉండాలి. అలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కావాలని రెచ్చగొట్టే వాఖ్యలకు పాల్పడుతున్నవారి అకౌంట్‌ను బ్లాక్ చేయడం అనేది మేలైన, సులువైన ఆప్షన్. లేదంటే, పట్టించుకోకుండా వదిలేయవచ్చు. కామెంట్స్ డిలీట్ చేసే ఆప్షనూ ఉంటుంది. దీనిని ఉపయోగించుకోవచ్చు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయకుండా నిరోధించవచ్చు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉన్నట్టే వ్యతిరేక కామెంట్స్ పట్ల కూడా సరైన నిర్ణయం తీసుకునే సమర్థత మీ చేతుల్లోనే ఉంది. ఇతర వ్యక్తులు ఎలాగూ అగ్నికి ఆజ్యం పోయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి, వ్యతిరేక వ్యాఖ్యల çపట్ల మరింతగా ప్రోత్సహించేవారిని కూడా అకౌంట్లో లేని విధంగా నియంత్రించుకునే అధికారం మన చేతుల్లోనే ఉందని గ్రహించాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాద్ గైడెన్స్ అవసరం టీనేజర్స్‌లో ఒత్తిడి పెంచే వాటిలో సోషల్‌మీడియా వాడకం ప్రధానంగా ఉంటోంది. వీటిలో జరిగే రకరకాల నేరాలు ముఖ్యంగా అమ్మాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నేరం జరిగేంత వరకు చూడకుండా తల్లిదండ్రులే ముందస్తు గైడెన్స్ ఇవ్వడం మంచిది. సోషల్‌మీడియా ప్రభావం గురించి టీనేజర్స్‌తో తల్లితండ్రులూ తరచూ సంభాషిస్తూ ఉండటం, వారి అకౌంట్స్‌ను గమనిస్తూ ఉంటే సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. దీపికా పాటిల్, స్పెషల్ ఆఫీసర్, (దిశా చట్టం అమలు విభాగం), ఆంధ్రప్రదేశ్ -
మనసు కుదుట పడింది కాఫీ తాగండి
ఆ కేఫ్‌కి కష్టమర్లు మంచి రేటింగే ఇచ్చారు. ఫేస్బుక్ 5కు 5 పాయింట్లు ఇచ్చింది. కోల్‌కతా ప్రజలకు తెలుసు తమకు ఆ కేఫ్‌ను ప్రోత్సహించాలని. అందుకే అక్కడకు వెళతారు. మాక్టైల్స్ తాగుతారు. పఫ్‌లు తింటారు. బేకరి ఐటమ్స్ పార్శిల్ కట్టించుకుంటారు. 7 నుంచి 9 మంది స్త్రీలు ఎప్పుడూ అక్కడ చిరునవ్వుతో పని చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉండి ప్రశాంతంగా ఉండే బేకరి కేఫ్ పేరు ‘క్రస్ట్ అండ్ కోర్’. దక్షిణ కోల్‌కతాలోని ‘చేట్ల’ ప్రాంతంలో ఉంటుంది. ఏమిటి దాని విశేషం? మానసిక సమస్యల నుంచి బయటపడిన ఏ ఆధారం లేని స్త్రీలు అక్కడ పని చేస్తారు. ఇలా వారి కోసమే నడిచే బేకరి దేశంలో ఇదే కావచ్చు. మానసిక హింస భౌతిక హింసలో గాయం అయితే మందు రాస్తే తగ్గిపోవచ్చు. కాని మానసిక హింస తాలూకు దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. అవి క్రమేపి మానసిక రుగ్మతలుగా మారతాయి. వాటికి వైద్యం చేయించుకోవాలని చాలామంది మహిళలకు తెలియదు. ఒకవేళ తెలిసినా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు కాని సైకియాట్రిస్ట్‌ల దగ్గరకు వెళ్లరు. చివరకు ఆ రుగ్మతలు ముదిరిపోతాయి. ఏమీ తెలియని స్థితిలో ఇళ్ల నుంచి బయటపడి సమాజం దృష్టిలో ‘పిచ్చివాళ్లు’ అన్న ముద్ర పడి తిరుగుతుంటారు. ఇలా తిరిగే స్త్రీల కోసం కోలకతాలో ‘ఈశ్వర సంకల్ప’ అనే ఎన్.జి.ఓ పని చేస్తోంది. వీళ్లు ‘సర్బరి షెల్టర్’ అనే ఒక హోమ్‌ను నడుపుతున్నారు. ఇందులో అచ్చంగా మానసిక సమస్యలతో రోడ్ల మీద తిరిగే స్త్రీలను తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తారు. వీరికి వైద్యం చేయించి బేకింగ్‌లో శిక్షణ ఇచ్చి ఈ బేకరిలో ఉపాధి కల్పిస్తున్నారు. 2018లో ఇలా మానసిక సమస్యల నుంచి బయటపడిన స్త్రీల కోసం ‘క్రస్ట్ అండ్ కోర్’ బేకరినీ తయారు చేశారు. గత మూడేళ్లుగా ఈ బేకరి విజయవంతంగా నడుస్తూ ఉంది. గృహహింసతో మానసిక సమస్యలు ‘సర్బరి షెల్టర్’లో ఆశ్రయం పొంది బేకరిలో పని చేస్తున్న మహిళలందరూ దారుణమైన గృహహింసకు పాల్పడిన వారే. భర్త, అత్తింటివారు పదేపదే భౌతికదాడికి పాల్పడటం, మానసికంగా భయభ్రాంతం చేయడం వల్ల అదీ ఒకరోజు రెండు రోజులు కాదు మూడునాలుగేళ్లు వరుసగా చేయడం వల్ల మతి చలించి ముఖ్యంగా ‘స్క్రిజోఫోబియా’ బారిన పడి ఇళ్లు వదిలినవాళ్లే అంతా. వీరు చాలారోజులు రైల్వేస్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చివరకు ఈ హోమ్‌కు పోలీసుల ద్వారా చేరుతారు. ‘వాళ్లకు ఒక్కొక్కరికి సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు వైద్యం చేయిస్తాం. అప్పుడు నార్మల్ అవుతారు. ఆ తర్వాత కూడా మందులు తప్పనిసరిగా కొనసాగిస్తూ పని చేసుకోవాల్సి ఉంటుంది’ అని హోమ్ నిర్వాహకులు చెప్పారు. కొత్త జీవితం ‘నేను బిస్కెట్లు బాగా చేస్తాను. కేక్‌లు అవీ చేయడం రాదు’ అని ఈ కేఫ్‌లో పని చేసే ఒక మహిళ చెప్పింది. ‘నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. నాదంటూ ఒక ఇల్లు ఉండాలి’ అందామె. మిగిలిన వారిలో ముంబై నుంచి తప్పిపోయి వచ్చినవారు, అస్సాం వైపు నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరి వయసులో 26 నుంచి 45 వరకూ ఉన్నాయి. ‘మీ కేఫ్‌లో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి’ అనే చిన్న మాటకు వాళ్లు చాలా బ్రైట్‌గా నవ్వుతారు. ఆ చిన్న ప్రశంస వారికి పెద్ద ఆరోగ్యహేతువుతో సమానం. ‘మానసిక సమస్యల నుంచి బయటపడిన వారు కొంత బెరుకుగా, ఎదుటివారి మీద ఆధారపడేలా ఉంటారు. వీరిని సమాజం కలుపుకుని మద్దతు ఇవ్వకపోతే తమలో తాము ముడుచుకుపోతారు. నలుగురిలో కలవడానికే భయపడిపోతారు. కేఫ్ పెట్టడం ద్వారా వీరు నలుగురినీ కలిసేలా చేసి వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాం’ అని కేఫ్‌లో సూపర్వైజర్గా పని చేసే మహిళ చెప్పారు. ఈ సూపర్వైజర్ మాత్రం ‘నార్మల్’ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ. ఈమె తనతో పని చేసే ఈ మహిళలను కనిపెట్టుకుని ఉంటుంది. ఈ కేఫ్‌కు వెళితే బయట ‘మేము ప్రతికూలతలను జయించాం. మేము చాంపియన్స్’ అని ఉంటుంది. నిజమే. వారు చాంపియన్స్ మనసు చీకటి గుయ్యారాల్లో జారి పడిపోయినా తిరిగి వెలుతురు వెతుక్కుంటూ దానిని దారికి తెచ్చుకున్నారు. సమస్యలు, సవాళ్లు తద్వారా మానసిక బలహీనత ఎవరికైనా సహజం. దానికి వైద్యం తీసుకోవాలి. స్నేహితుల సపోర్ట్ తీసుకోవాలి. అన్నింటిని దాటి కొత్త జీవితం మొదలెట్టాలి. క్రస్ట్ అండ్ కోర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. – సాక్షి ఫ్యామిలీ -
వ్యాక్సిన్‌పై వార్.. 100 కోట్లకు దావా!
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేశారు. టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. టీకా వలంటీరుగా పనిచేసిన ఆ 40 ఏళ్ల వ్యాపార వేత్త తరఫున ఒక న్యాయ సేవల సంస్థ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, ఆస్ట్రా జెనెకా సీఈఓ.. తదితరులకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని తన క్లయింట్‌కు ఇచ్చిన సమాచార పత్రంలో పేర్కొన్నారని, అందువల్లనే ఆయన వలంటీరుగా చేరేందుకు అంగీకరించారని ఆ సంస్థ వివరించింది. టీకా తీసుకున్న 10 రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది. మాట్లాడలేకపోవడం, ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం.. తదితర సమస్యలు తలెత్తాయని, ఆ తరువాత ఐసీయూలో చేర్చి చికిత్స అందించారని వలంటీరుగా పనిచేసిన వ్యక్తి భార్య వివరించారు. 100కోట్లకు దావా : సీఐఐ ఈ ఆరోపణలను ఆదివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నష్ట పరిహారం కోరుతూ రూ. 100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. కాగా, టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. క్లినికల్ ట్రయల్స్‌లో చోటు చేసుకునే టీకా దుష్ప్రభావాలపై.. ముఖ్యంగా దుష్ప్రభావాలకు, టీకాకు ఉన్న సంబంధంపై క్షుణ్నంగా, శాస్త్రీయంగా పరిశోధన జరుగుతుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. హడావుడిగా విచారణ జరిపి, ఒక అంచనాకు రావడం సరికాదన్నారు. -
షాకింగ్: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో..
సాక్షి, హైదరాబాద్: కరోనా మానసికంగానూ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఇది ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక సమస్యలనూ సృష్టిస్తున్నట్టు ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. వైరస్ మెదడుపై ప్రభావం చూపడంతో పాటు నిద్రలేమి, మనోవ్యథ, కుంగుబాటు, ఒత్తిళ్లు, ఆదుర్దా, ఆందోళన, అయోమయం వంటి మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నట్టు తేల్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో, మరణం అంచు వరకు వెళ్లి తిరిగొచ్చిన వారి లో ఈ మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు పేర్కొంది. అలాగే, అమెరికాలోని పలు వైద్యపరిశోధన సంస్థలు తాజాగా లక్షలాది మంది పేషెంట్ల హెల్త్‌రికార్డ్‌లు (62 వేల మంది కోవిడ్ పేషెంట్లతో సహా) పరిశీలించి.. మానసిక అనారోగ్య అంశాలు, సమస్యలపై లోతైన విశ్లేషణ నిర్వహించాయి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 20 శాతం కంటే ఎక్కువ మందిలో 90 రోజుల్లోనే మానసిక వ్యాకులత, కుంగుబాటుతో మెదడుపై ప్రతి కూల ప్రభావాలు బయటపడినట్టు ఇవి గుర్తించాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది ఆస్పత్రులకు చికిత్సకు వస్తున్నట్టు స్పష్టమైంది. ఈ వివరాలన్నీ ఇటీవల ‘లాన్సెట్ సైకియాట్రీ’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. (కరోనా వ్యాక్సిన్ : ఫైజర్ పురోగతి) అన్ని అధ్యయనాల సారమిదే.. కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి మానసిక సమస్యలున్న వారికి ఇతరులతో పోలిస్తే 65% మేర కోవిడ్–19 సోకే అవకాశాలెక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. కరోనా కారణంగా కలుగుతున్న మానసిక అనారోగ్యంతో కొందరిలో చిత్తవైకల్యం, మెదడు సరిగా పనిచేయకపోవడం వంటి తీవ్ర సమస్యలూ ఎదురయ్యే అవకాశాలున్నట్టు తమ పరిశీలనలో వెల్లడైందని బ్రిటన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ హారిసన్ చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారికి సంబంధించిన ఆందోళన, భయాల వల్ల ఇలాంటి మానసిక సమస్యలు కలుగుతుండొచ్చని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మైఖేల్ బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. కోవిడ్–19 అనేది కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం వల్ల ఇతర మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయని లండన్ కింగ్స్ కాలేజీ సైకియాట్రీ ప్రొఫెసర్ సైమన్ వెస్లీ అంటున్నారు. (‘ఫైజర్’ వ్యాక్సిన్ భారత్‌కు వస్తుందా!?) భయమే పెద్ద సమస్య మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటుతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువుంటుంది. కాబట్టి వైరస్ బారినపడే అవకాశాలెక్కువ. ఆదుర్దా, ఆందోళన, భయం, నిద్రలేమి సమస్యలతో మా వద్దకు పేషెంట్లు వస్తున్నారు. కోవిడ్ అంటే ముందే ఏర్పడిన భయంతో పాజిటివ్ అని తేలాక మరింత కుంగిపోతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమకు కరోనా వచ్చిందని, అదెక్కడ తమ ఆప్తులకు సోకుతుందోనన్న ఆందోళనకు గురవుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా ఆరోగ్యం క్షీణిస్తుందా? గుండెపోటు వస్తుందా? ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే కోలుకోవడం కష్టమేమో వంటి సందేహాలను వెలిబుచ్చుతున్నారు. – డాక్టర్ నిశాంత్ వేమన, సైకియాట్రిస్ట్ -
కుంగుబాటులో టీనేజీ
సాక్షి, అమరావతి: కరోనా, లాక్డౌన్ వల్ల మన దేశంలో లక్షల మంది పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గత నాలుగైదు నెలలుగా విద్యాసంస్థలు మూతపడి ఉండడం పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి పిల్లల్లో, టీనేజ్ వయసున్న 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. డిగ్రీ ఆ పై చదివే విద్యార్థుల్లో భవిష్యత్‌పై భయాందోళనలు నెలకొంటున్నట్లు చెబుతున్నాయి. తమకు సిలబస్ పూర్తికాకపోవడం, పరీక్షలు జరగకపోవడంతో వారంతా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామన్న భయాందోళనలతో ఉన్నారని అంటున్నాయి. ఆహారపు అలవాట్లలో తేడాతో ఊబకాయం ► గతంలో స్కూళ్లు ఉండేటప్పుడు పిల్లలు నిర్ణీత సమయంలో ఆహారాన్ని స్వీకరించేవారు. ఇప్పుడు ఇళ్లలోనే ఉండడంతో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఆటలు, శారీరక శ్రమ లేక ఊబకాయానికి లోనవుతున్నారు. ► పెద్ద పిల్లలు పూర్తిగా టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లకే అతుక్కుపోయి ఉంటుండటం వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తోంది. ► త్వరగా పడుకొని ఉదయాన్నే లేచే అలవాటు పూర్తిగా మారిపోయింది. రాత్రి 12 వరకు సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తూ తిరిగి ఉదయం 10 తర్వాత నిద్ర లేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్‌కు అడిక్ట్.. ► స్కూళ్లు లేకపోవడంతో పిల్లలు సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లలో పబ్జీ, ఇతర ఆన్లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. ► చదువులపై ఆసక్తి తగ్గింది. బయటకు వెళ్లవ ద్దంటున్న తల్లిదండ్రులపై ఎదురుతిరుగుతున్నారు. వారిలో భావోద్రేకాలు పెరిగిపోతున్నాయి. ► ముఖ్యంగా 13, 14 ఏళ్ల పిల్లలు అయితే అమ్మాయిలతో చాటింగ్ చేయడం, అవాంఛిత వెబ్సైట్లను చూడటం వంటివాటితో పెడదారి పడుతున్నారు. ► ఉద్వేగపూరిత మార్పులతో మానసిక కుంగుబాటుకు, ఆందోళనకు లోనవుతున్నారు. ► విద్యాసంవత్సరంలో చాలా వ్యవధి వచ్చి నందున పిల్లల్లో గతంలో నేర్చుకున్న నైపు ణ్యాలు మరుగున పడిపోతున్నాయని, తదు పరి తరగతుల్లో వారు దీనివల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని ఉపాధ్యాయ సం ఘాలు అంటున్నాయి. యుక్త వయసు పిల్లల్లో తల్లిదండ్రులకు ఎదురుతిరగడం, ప్రతి దానికి మానసికంగా కుంగిపోవడం, ఎమోషనల్ స్ట్రెస్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆందోళన వద్దు కరోనా వల్ల ఉద్యోగాలు రావేమోనన్న ఆందోళన వద్దు. విద్యార్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక ప్రత్యా మ్నాయ చర్యలు తీసుకుంటోంది. కరోనాతో నష్టపోతున్న కాలాన్ని భర్తీ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి స్కూళ్లు తెరవడం ద్వారానే... జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలు తెరవడం ద్వారానే పిల్లల మానసిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తి అంతగా ఉండదు. ఐరన్, జింక్, విటమిన్ల లోపం పిల్లలను వెన్నాడుతోంది. – డాక్టర్ ఆర్ వెంకట్రాముడు, సైకియాట్రీ ప్రొఫెసర్, రిమ్స్ మెడికల్ కాలేజీ, కడప పిల్లలతో ఎక్కువ సేపు గడపాలి పిల్లలు ఇళ్లలోనే ఉండిపోవడంతో వారిలో మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సేపు గడుపుతూ ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణులు, విజయవాడ చురుకుదనం తగ్గింది మా పాప కేజీబీవీలో ఇంటర్ చదివి మంచి మార్కులు తెచ్చు కుంది. స్కూల్లో పిల్లలు, టీచర్లతో చురుగ్గా ఉండేది. కరోనా వల్ల ఇంటి దగ్గరే ఉండిపోవడంతో ఇప్పుడు ఆ చురుకుదనం తగ్గింది. – కేజీబీవీ విద్యార్థిని రమణి తల్లి నందపు వరలక్ష్మి, కనపాక, విజయనగరం -
మానసిక సమస్యలుంటే 108కి కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో కుంగుబాటు, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు ఎదురైతే 108 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయవచ్చని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్(ఐపీఎం) డైరెక్టర్ డా.శంకర్ పేర్కొన్నారు. ఐ అండ్ పీఆర్ శాఖ బోర్డురూంలో సైక్రియాట్రిస్ట్ డా.నివేదితతో కలసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజుకు 3వేల కాల్స్‌కు జవాబిచ్చేలా 36 టెలిఫోన్ లైన్లు, 5 డెడికేటెడ్ లైన్లను, 53 మంది కౌన్సెలర్లు షిఫ్ట్‌ల వారీగా పనిచేసేలా, ఎప్పటికప్పుడు సైక్రియాట్రిస్ట్ల ద్వారా సలహా సూచనలిచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. కాగా, ఈ హెల్ప్‌లైన్‌కు ప్రస్తుతం బిర్యానీ మిస్ అవుతున్నామని, స్నేహితులతో హ్యాంగౌట్స్‌కు వెళ్లలేకపోతున్నామంటూ యువత ఫోన్లు చేస్తున్నారని సైక్రియాట్రిస్ట్ డా.నివేదిత తెలిపారు. అలాంటి వారికి ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో వివరిస్తున్నట్టు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని ఒకరిద్దరు ఫోన్ చేయగా.. అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించి వారిని కాపాడినట్లు చెప్పారు. -
పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!
ప్రాణాంతక పబ్జీ గేమ్‌ను ఇష్టపడే వాళ్లకు దాని సృష్టికర్తలు శుభవార్త చెప్పారు. పబ్జీ మొబైల్ గేమ్ రెండేళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా మరో సరికొత్త అప్డేట్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు తెలిపారు. తొలుత టైమ్‌పాస్ బాటిల్ గేమ్‌గా మొదలైన పబ్జీ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎన్నో అప్డేటెడ్ వెర్షన్లు వచ్చాయి. ఆయుధాలే ప్రధానంగా సాగే ఈ ఆటలో.. తాజా పన్నెండో వెర్షన్లో మరిన్ని నూతన ఆయుధాలను ప్రవేశపెట్టనున్నారు. బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ గేమ్ అప్డేటెడ్ వెర్షన్ 0.17.0 గా రానుంది. (చదవండి : అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి గలాటా) ఇక బాటిల్ గ్రౌండ్లో శత్రువులను ఎదుర్కొనే క్రమంలో గేమర్ ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 12 వ సీజన్లో కీలకమైన డెత్ రీప్లే అవకాశం కల్పిస్తున్నారు. శత్రువుల దాడిలో గేమర్ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు డెత్ రీప్లే ఆప్షన్ తోడ్పడుతుంది. చేసిన పొరపాట్లేవో తెలుసుకుని, మరోసారి గేమర్ చనిపోకుండా కాపాడుకునేందుకు ఈ ఆప్షన్ సహకరిస్తుంది. ఇక పబ్జీ గేమ్‌తో మొబైల్స్‌కు అతుక్కుపోయే వారిని ఈ వెర్షన్ ఇంకెలా మారుస్తుందో మరి..! గంటల తరబడి పబ్జీలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, మానసిక రుగ్మతలు కొని తెచ్చుకున్న వారి గురించి తెలిసే ఉంటుంది..! (చదవండి : ప్రాణం తీసిన పబ్జీ.. యువకుడికి బ్రైయిన్ స్ట్రోక్) -
రేడియేషన్ పడకుండా ఉండాలంటే?
రేడియేషన్ సమస్య వల్ల గర్భస్త శిశువుల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని చదివాను. రేడియేషన్ ప్రభావం పడకుండా ఉండాలంటే సెల్ టవర్లు ఉన్న ప్రాంతాలలో ఉండకూడదా? లేక సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడకూడదా? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.సుచిత్ర, మదనపల్లి సెల్ టవర్స్ నుంచి nonionizing కొంచెం ఎక్కువ ప్రీక్వెన్సీ 19-00 MHZ ఉన్న ఎలక్ట్రోమెగ్నటిక్ రేడియేషన్స్ విడుదల అవుతాయి. ఈ తరంగాల వల్ల వీటికి మరింత చేరువలో ఎక్కువ కాలం అక్కడే ఉన్నవాళ్లలో తలనొప్పి, కొద్దిగా మతిమరుపు, నిద్రపట్టకపోవడం, కొందరిలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనలు తేలిపాయి. అలాగే గర్భిణీలు సెల్ టవర్లకు మరీ సమీపంలో నివసిస్తుంటే పుట్టబోయే పిల్లల్లో, పుట్టిన తర్వాత వారిలో ఏకాగ్రత తగ్గడం, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని, జంతువులు మీద చేసిన కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు. అలాగే సెల్ఫోన్లలో రోజూ ఎక్కువ సేపు మాట్లాడటం, అవి శరీరానికి దగ్గర్లో ఎక్కువ సమయం, ఉండటం వల్ల కూడా శిశువుకి ప్రభావం పడే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని జంతువుల మీద చేసిన కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత వీలు అయితే అంత సెల్ఫోన్లో మాట్లాడటం, వైఫై వాడి నెట్ చూడటం తగ్గిస్తే అంత మంచిది. కావాలంటే ల్యాండ్‌లైన్ ఫోన్ వాడుకోవచ్చు. సెల్ టవర్స్ నుంచి కనీసం అరకిలోమీటర్ దూరంలో ఉండటం మంచిది. రేడియేషన్ ఎఫెక్ట్ కంటే కూడా సెల్ఫోన్లతో, అనవసరమైన విషయాలు గంటలు గంటలు మాట్లాడటం, నెట్, ఫేస్బుక్ వంటివి చాలా సేపు చూడటం వల్ల అనవసరమైన సందేహాలు, భయాలు వంటివి ఏర్పడటం, మానసికంగా సరిగా ఉండకపోవడం వల్ల కూడా బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ సమయంలో టైమ్‌పాస్‌కి కొద్దిగా నడక, ధ్యానం, మంచి పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం వంటివి అలవాటు చేసుకోవటం మంచిది. ∙నా వయసు 25. ప్రస్తుతం మూడోనెల. గర్భిణులకు ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం... మొదలైనవి సమృద్ధిగా అందాలంటే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలో వివరంగా తెలియజేయగలరు. నాకు పిండిపదార్థాలు ఎక్కువగా తినే అలవాటు ఉంది. ప్రెగ్నెన్సిగా ఉన్నప్పుడు ఎక్కువగా తినవచ్చా?– ఆర్.శ్రీలత, తుంగతుర్తి గర్భిణీలలో శిశువు తొమ్మిది నెలల పాటు ఆరోగ్యంగా పెరగాలంటే, తల్లి నుంచి సరైన పోషకపదార్థాలు బిడ్డకు చేరాలి. అలాగే తల్లి శరీరంలో జరిగే మార్పులకు కూడా ఇవి అవసరం. తల్లీ బిడ్డ అవసరాలకు కూడా ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం మొదలైన మినరల్స్ ఎంతో అవసరం, కీలకం. ఇవి కొద్ది మోతాదులో రోజూ అవసరం కాబట్టి వాటిని మైక్రోనూట్రియంట్స్ అంటారు. ఐరన్ తల్లిలో రక్తం సమృద్ధిగా పెరగడానికి తోడ్పడుతుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. తద్వారా శరీరంలోని అన్నికణాలకు ఆక్సిజన్‌ను అందజేస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. కాల్షియం, ఎముకలు, దృఢంగా బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. జింక్, కణాలలోని డీఎన్ఏ మరియు ప్రొటీన్స్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. పొటాషియం, కండరాల నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. పైన చెప్పిన మినరల్స్‌తో పాటు ఐయోడిన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా బిడ్డలోని అన్ని అవయవాల ఎదుగుదలకు ఎంతో అవసరం. ఆహారంలో తాజా ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, పాలు, పెరుగు, కొద్దిగా డ్రైఫ్రూట్స్ వంటివి అలాగే మాంసాహారలు అయితే గుడ్లు, మాంసం, చేపలు మితంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకపదార్థాలు తల్లి నుంచి బిడ్డకు చేరి, బిడ్డ మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. పిండిపదార్థాలలో ఎక్కువగా కార్భోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగటం, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి షుగర్ శాతం పెరిగి గర్భంలో మధుమేహవ్యాధి వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న బరువును బట్టి, ఫ్యామిలీ హిస్టరీ షుగర్ ఉన్నప్పుడు వీలైనంత వరకు తక్కువ తీసుకుంటే మంచిది. అలాగే డాక్టర్ సలహామేరకు పోషక ఆహారంతో పాటు అవసరమైతే ఐరన్, కాల్షియం, మినరల్స్ విటమిన్స్‌తో కూడిన మందులు తీసుకోవడం కూడా మంచిది. ∙నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. చలికాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి తెలియజేయగలరు. నాకు దుప్పటి పూర్తిగా కప్పుకొని పడుకునే అలవాటు ఉంది. గర్భిణిలు ఇలా పడుకోవచ్చా? ఫోలిక్ యాసిడ్ ఉపయోగం ఏమిటి? తప్పనిసరిగా తీసుకోవాలా? – బి.చంద్రిక, రామచంద్రాపురం చలికాలంలో గర్భిణులలో చర్మం ఎక్కువగా పగిలే అవకాశాలు డిహైడ్రేషన్, జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ వంటి అనేక ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో దాహం లేకపోయినా కనీసం 2–3 లీటర్లు మంచినీళ్లు తీసుకోవాలి. వీలైనంత వరకు రద్దీ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకోవాలి. ఈ సమయంలో జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ తొందరగా వేరేవాళ్ల నుంచి లేదా చల్ల వాతావరణం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. వీలయితే డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చరైజర్ వాడటం మంచిది. గోరువెచ్చని నీళ్లలో స్నానం చెయ్యవచ్చు. తాజాగా కూరగాయలు, పప్పులు, పండ్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. వెచ్చని వులెన్ దుస్తులు శరీరంతో పాటు చేతులకి, కాళ్లకి కూడా మరీ బిగుతుగా లేకుండా ధరించవచ్చు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకపోతే దుప్పటి పూర్తిగా కప్పుకోవచ్చు. రోజూ కొద్దిసేపు వాకింగ్, మెడిటేషన్, యోగా వంటి వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చెయ్యడం మంచిది. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే జలుబు, దగ్గు వంటి వ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో రోగ నిరోధక శక్తి, మామూలు సమయంలో కంటే తక్కువగా ఉండటం వల్ల, అంటువ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ అనేది బి9 అనే బీకాంప్లెక్స్ విటమిన్ జాతికి చెందినది. ఇది శరీరంలోని కణాలలో డీఎన్ఏ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది ప్రెగ్నెన్సీ రాకముందు, వచ్చిన తర్వాత కూడా వాడటం వల్ల బిడ్డ ఎదుగుదల, అవయవాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మెదడు నాడీ వ్యవస్థ సరిగా ఏర్పడటానికి దోహదపడుతుంది. దీని లోపం వల్ల కొంత మంది శిశువులలో అవయవలోపాలు, మెదడు, వెన్నుపూస ఏర్పడటంలో లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి గర్భిణీలు తప్పనిసరిగా మొదటి మూడునెలలు ఫోలిక్ యాసిడ్ 5mg మాత్ర రోజుకొకటి వేసుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్ -
నిద్రే చెలిమి కలిమి
ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు నిద్రలేమికి దారితీస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.స్త్రీలైనా, పురుషులైనా వయోజనులైన వారికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని, నిద్ర అంతకంటే తక్కువ అయితే మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తరచుగా నిద్రకు అంతరాయం ఏర్పడటం, తగినంత నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువసేపు మెలకువగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తడం వంటివి దీర్ఘకాలం కొనసాగితే మానసిక కుంగుబాటు, ఆందోళన తలెత్తుతాయని బింగ్హామ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ మెరెడిత్ కోలెస్ చెబుతున్నారు. నిద్ర తగినంతగా లేనివారిని ప్రతికూల భావనలు వెంటాడుతాయని, ఇలాంటి పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినట్లయితే తీవ్రమైన మానసిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
మీలో ఒత్తిడి పెరుగుతోందా...?
సెల్ఫ్ చెక్ పని, మానసిక సమస్యలు కారణం ఏదైనా ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణం అయ్యింది. మ్యూజిక్ వినటం, సినిమాలు చూడటంతో కొందరు స్ట్రెస్‌ను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ అలా చేయలేక అనారోగ్యం పాలవుతుంటారు. స్ట్రెస్‌వల్ల మీరు సిక్‌గా మారారేమో చెక్ చేసుకోండి. 1. రెస్ట్ తీసుకొనే సమయం దొరికి నా సరిగా నిద్రపోలేక పోతున్నారు. ఎ. కాదు బి. అవును 2. స్ట్రెస్ నుంచి దూరం అవ్వటానికి దురలవాట్లు (మద్యం, ధూమపానం మొదలైనవి) నేర్చుకోవాలనిపిస్తోంది. ఎ. కాదు బి. అవును 3. మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నా మీరు మాత్రం ఎప్పుడూ మూడీగానే ఉంటారు. ఎ. కాదు బి. అవును 4. తరచుగా అలసిపోయినట్లు ఉండటం వల్ల ఏదైనా పనిని మధ్యలోనే వదిలివేయవలసి వస్తోది. ఎ. కాదు బి. అవును 5. కోపాన్ని అణచుకోవటం చాలా కష్టంగా మారింది. ఎ. కాదు బి. అవును 6. ఆందోళనలో ఉన్నప్పుడు గందరగోళానికి గురవుతున్నారు. ఎ. కాదు బి. అవును 7. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని, మీ శ్రేయోభిలాషుల నుంచి సూచనలు అందుతున్నాయి. ఎ. కాదు బి. అవును 8. ఆహారం మరీ ఎక్కువ లేదా మరీ తక్కువగా తీసుకుంటున్నారు. ఎ. కాదు బి. అవును 9. ఏ పనిమీదా శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఎ. కాదు బి. అవును 10. మతిమరుపు వస్తోంది, ఎక్కుసార్లు తలనొప్పితో బాధపడుతున్నారు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు నాలుగు వస్తే మీరిప్పుడిప్పుడే ఒత్తిడికి గురవుతున్నారు. ఏడు దాటితే మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల్లో ఉండి ఉంటారు, వెంటనే ఒత్తిడిని నియంత్రించుకోగలిగే మార్గాలను ఫాలో అవ్వండి. ‘ఎ’ లు ఏడు కంటే ఎక్కువ వస్తే మీలో ఆందోళనకు తావులేదు. -
యాంటీబయోటిక్స్‌తో మతిభ్రమణం!
పరిపరి శోధన చిన్నా చితకా ఇబ్బందులకు ఎడా పెడా యాంటీబయోటిక్స్ వాడటం చాలామందికి అలవాటే. అయితే, మోతాదు చూసుకోకుండా ఇష్టానుసారం యాంటీబయోటిక్స్ వాడితే ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించిన యాంటీబయోటిక్స్ వాడటం వల్ల శారీరక సమస్యలు మాత్రమే కాదు, కొందరిలో తాత్కాలిక మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్త డాక్టర్ శామిక్ భట్టాచార్య చెబుతున్నారు. దీర్ఘకాలంగా మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడేవారిలో రకరకాల భ్రమలు కలగడం, సంధి ప్రేలాపనలు వంటి లక్షణాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు ఆయన తెలిపారు. -
ఆరోజు... ఘోరాలు నేరాలు జరుగుతాయా?!
అవాస్తవం నిండు చంద్రుడిని చూస్తూ కవిత్వం చెప్పేవారు కొందరైతే... నిలువెల్లా భయపడేవారు కొందరు. ఆకాశంలో నిండు చంద్రుడు కనిపించే రోజుల్లో అనేక అనర్థాలు జరుగుతాయని, పూర్ణ చంద్రుడు మనిషిలో చిత్ర విచిత్ర ప్రవర్తనకు కారణమవుతాడని, మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆ తీవ్రత మరింత ఎక్కువవుతుందని, మనిషిలో దాగిన నేరప్రవృత్తి పెరిగిపోయి ఘోర నేరాలు జరుగుతాయని... ఇలా రకరకాల అపోహలున్నాయి. పూర్ణ చంద్రుడిలోని శక్తి మనిషి మెదడులోని నీటిపై ప్రభావం చూపుతుందనే విషయం ప్రచారంలో ఉంది. మనిషి మానసిక ప్రవృత్తిలో వచ్చే మార్పులకు, నేరాలు ఘోరాలకు నిండు చంద్రుడికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో జరిగిన 23 స్టడీలపై కెనడియన్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐ.డబ్ల్యూ. కెల్లీ బృందం సమీక్ష జరిపింది. రెండిటికీ మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. -
ఫ్రెండ్స్ దూరమవుతున్నారా?
శరీర దుర్వాసనతో... కొందరికి కొద్దిపాటి ఎండలోకి వెళ్లినా చాలు, చెమటలు పట్టేస్తాయి. ఇలా అయితే పర్లేదు. కానీ శరీరం నుంచి దుర్వాసన వచ్చేస్తుంది. దాంతో మిగతావాళ్లు ఇలాంటి దుర్వాసన వచ్చే వారి నుంచి దూరంగా ఉంటుంటారు. పక్కవాళ్లు భరించలేనంత దుర్వాసన వస్తుండేవాళ్లు సామాజికంగా న్యూనతకు గురవుతారు. దాంతో అనేక ఇతర మానసిక సమస్యలకూ లోనవుతుంటారు. శరీరం నుంచి ఇలా దుర్వాసన రావడానికి కారణాలూ, ఆ సమస్యకు పరిష్కారాలను ఒకసారి పరిశీలిద్దాం. డర్టీ స్మెల్ కీప్స్ ఫ్రెండ్స్ ఎ మైల్ ఎవే! ఆహారం వల్ల... రోజూ తినే ఆహారంలో వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కొన్ని రకాల ఆకుకూరలు, కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. శరీరం నుంచి దుర్వాసన వెలువడటాన్ని వైద్య పరిభాషలో ‘బ్రామ్‌హిడరోసిస్’ అంటారు. చర్మంపై ఉండే చెమట గ్రంథుల నుంచి చెమట వెలువడుతుంది. చాలామంది చెమట నుంచే ఈ దుర్వాసన వస్తుందని అనుకుంటారు. కానీ చెమటలో ఎలాంటి దుర్వాసనా ఉండదు. మరి అలాంటప్పుడు చెమట పట్టినవారి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుందో పరిశీలిద్దాం. మానవ శరీరంపై చెమటలనే స్రవించే గ్రంథులు రెండు రకాలుగా ఉంటాయి. అవి... ఎక్రైన్ గ్లాండ్స్ : ఇవి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకూ అందరిలోనూ ఉంటాయి. మన జన్యుస్వభావాన్ని అనుసరించి శరీరంపై అంతటా వ్యాపించి ఉంటాయి. ముఖ్యంగా అరచేతులు, అరికాళ్లలో మరీ ఎక్కువగా ఉంటాయి. బయటి వాతావరణం వేడెక్కినప్పుడు వీటి నుంచి చెమట స్రవిస్తుంది. ఈ చెమట గాలి వీచినప్పుడు శరీరంలోని వేడిని గ్రహించి ఆ గాలికి ఆవిరైపోతుంది. అంటే ఆవిరయ్యే ప్రక్రియలో చెమట శరీరం నుంచి కొంతమేర వేడిమి గ్రహిస్తుంది. కాబట్టి ఏమేరకు వేడిని తీసుకుంటుందో ఆ మేరకు శరీరం చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రత బయట ఉన్న వాతావరణానికి వేడెక్కిపోకుండా, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత (98.4 డిగ్రీల ఫారెన్‌హీట్) వద్ద స్థిరంగా ఉండేలా చేసేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. అందుకే చల్లని గాలి వీచినప్పుడు శరీరం చల్లబడి హాయిగా అనిపిస్తుంది. అపోక్రైన్ గ్లాండ్స్: ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేవి చిన్నప్పటి నుంచీ ఉండవు. యుక్తవయసు వచ్చాక ఇవి బాహుమూలాలతోపాటు శరీరంలోని మరికొన్ని ఇతర ప్రాంతాల్లోనూ పెరుగుతాయి. ఇవి ఆ ప్రాంతంలో ఉండే వెంట్రుకలు అంకురించే ప్రదేశంలో ఉండి, చెమటను స్రవిస్తుంటాయి. అందుకే యుక్తవయసులో ఉన్నవారికి బాహుమూలాలతో పాటు కొందరిలో ప్రైవేట్‌పార్ట్స్ వద్ద చెమటలు స్రవిస్తాయి. దుర్వాసనకు కారణమయ్యే ఇతర అంశాలు... చెమట గ్రంథులు శరీరంపై వ్యాపించే తీరు తల్లిదండ్రుల జన్యువుల నుంచి పిల్లలకు వస్తుంది. అందుకే తల్లి లేదా తండ్రి... వీరిలో ఎవరికైనా శరీరం నుంచి దుర్వాసన వచ్చే సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ. ఇక స్థూలకాయంతో ఉన్నవారు, ఇతర చర్మ సమస్యలు / ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి దుర్వాసన సమస్య అధికం. ముఖ్యంగా ఇంటెర్ట్రిగో, ట్రైకోమైసోసిస్ ఆగ్జిలరీస్, ఎరిత్మా సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. ఇక దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, గౌట్, మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, టైఫాయిడ్ ఉన్నవారి నుంచి కూడా చెడువాసన వస్తుంటుంది. అలాగే శుభ్రత విషయంలో బద్ధకంగా ఉండేవారిలోనూ, మద్యం సేవించేవారి దగ్గర్నుంచి, పెన్సిలిన్, బ్రోమైడ్స్ వంటి మందుల వాడకం వల్ల కూడా మేని నుంచి దుర్గంధం వెలువడటం అనే సమస్య తలెత్తవచ్చు. చెమటకు వాసన లేకపోయినా... ఎందుకీ దుర్వాసన? ఉక్కగా ఉన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా చెమట ఎక్కువగా పడుతుంది. అదే యుక్తవయస్కుల్లో, మధ్యవయస్కుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యుక్తవయస్కులైప్పటి నుంచీ అటు ఎక్రైన్ గ్రంథులు, ఇటు అపోక్రైన్ గ్రంథులు ఈ రెండూ పనిచేస్తుండటం వల్ల చెమటలు ఎక్కువగా పడతాయన్నమాట. దాంతో యుక్తవయస్కులు, పెద్దవయసు వారి చెమటలలో దుర్వాసన కలిగించే ప్రాపినీ బ్యాక్ట్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. చెమటలు ఎంతగా పడుతుంటే ఈ ప్రాపినీ బ్యాక్టీరియా అంతగా వృద్ధిచెందుతుంటాయి. అందుకే పిల్లల కంటే పెద్దల వద్దనే చెమట పట్టగానే వాసన రావడం ఎక్కువ. దుర్వాసన తొలగించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం బాహుమూలాలను సబ్బుతో శుభ్రపరుచుకోవడం చెమట అధికంగా పట్టే ప్రదేశాలను పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి తొడుక్కునే దుస్తులు చెమటను పీల్చుకునేవి, శుభ్రమైనవి, పొడిగా ఉండాలి బాక్టీరియా సంఖ్యను తగ్గించేది, చర్మతత్వానికి సరిపడే డియోడరెంట్స్ వాడాలి వాసనకు కారణమయ్యే బాహుమూలాల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి. యాంటీసెప్టిక్ సబ్బులను స్నానానికి ఉపయోగించాలి తాజా ఆహారం తీసుకోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే దుర్వాసన సమస్యే కాకుండా, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరానికి పూసే లేపనాలతో... సాధారణంగా చెమటలు పట్టేవారు యాంటీపెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ అనే శరీరానికి పూసే లేపనాలతో తమ శరీర దుర్వాసనను తగ్గించుకుంటుంటారు. యాంటీ పెర్స్పిరెంట్స్ అన్నవి పేరును బట్టి చెమట పట్టడాన్ని తగ్గించవు. ఇందులో అల్యూమినియమ్ క్లోరోహైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియమ్ ఫీనాల్ సల్ఫొనేట్, అల్యూమినియమ్ సల్ఫేట్, జిర్కోనియమ్ క్లోరో హైడ్రేట్స్ వంటి లవణాలు ఉంటాయి. ఇవి చెమటగ్రంథి ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి, చెమట తక్కువగా పట్టేలా చేస్తాయి. వాటి ప్రభావం తగ్గాక మళ్లీ చెమటపడుతుంది. ఇలా తాత్కాలికంగా చెమటగ్రంథిని మూసేస్తుంది కాబట్టి దీన్ని యాంటీపెర్స్పిరెంట్స్ అంటారు. ఎలా వాడాలి...? యాంటీపెర్స్పిరెంట్స్ను రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, స్నానం చేశాక, ఒంటిని పొడిగా తుడుచుకున్న తర్వాత వాడాలి. ఎందుకంటే ఆ సమయంలో చెమట తక్కువగా ఉంటుంది. కాబట్టి చెమటగ్రంథులు వాటిని ఎక్కువగా గ్రహిస్తాయి. మళ్లీ పొద్దున్నే యాంటీపెర్స్పిరెంట్స్ను కడిగేసుకోవాలి. ఇలా ఓ 15 రోజులు చేయాలి. ఆ తర్వాత రోజు విడిచి రోజు చొప్పున మరో నెలరోజులు వాడాలి. యాంటీ పెర్స్పిరెంట్స్ను నోరు, ముక్కు, కనురెప్పలు, మర్మావయవాల వద్ద అస్సలు వాడకూడదు. బాహుమూలాల్లోనూ అక్కడి రోమాలు తొలగించిన రోజున అస్సలు ఉపయోగించవద్దు. * డియోడరెంట్స్ను రోజూ పొద్దున్నే స్నానం చేశాక బయటికి వెళ్లే ముందు శరీరంపై రాసుకోవాలి. ఆర్. రాధిక, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మటాలజిస్ట్, డెర్మటోసర్జన్, నేషనల్ స్కిన్ సెంటర్, సికింద్రాబాద్ -
ఒత్తిడిని అధిగమిస్తేనే జీవితం
మానవ జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సహజమే అరుునా.. శృతిమించడం వల్లే సమస్యలు అధికమవుతున్నాయి.. ఎల్కేజీ చదివే చిన్నారి నుంచి తల నెరిసిన తాతయ్య వరకు అందరికీ సమస్యలే. చదువు, ఉద్యోగం, కుటుంబరీత్యా, ఒంటరితనం ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో అనేక సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రేమించిన యువతి దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాదిగా మారడం, అనుకున్నది సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన, భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం వంటివి సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానసిక సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మానసిక అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - ముంబై కాలంతో పాటు పరుగెడుతున్న సిటీ లైఫ్‌లో మానసిక ప్రశాంతత లోపించింది. గతంలో ఇళ్ల వద్ద అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, బాబాయి ఇలా పెద్దలనే వారు ఉండేవారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు ఇలా చిన్నవాళ్లు కలహించుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా ఆదిలోనే పరిష్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారిని ఓదార్చేవారు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవల ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏటా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే వారోత్సవాల్లో మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అంటే 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో మానసిక వైకల్యం (స్కిజోఫ్రీనియా), నివారణోపాయూలపై డబ్ల్యూహెచ్‌వో అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు * మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో అధికశాతం మంది డిప్రెషన్‌కు గురవుతుండగా, మరికొంతమంది పర్సనాలటీ డిజార్డర్స్, లైంగిక సమస్యలు, భాగస్వామితో విభేదాలు, స్మోకింగ్, మద్యపానానికి అలవాటుపడుతున్నారు. * పారానాయిడ్ సైకోట్రిక్ అనే సమస్యకు గురయిన వారికి సకాలంలో చికిత్స అందించనట్లయితే సైకోలుగా మారడం, కుటుంబసభ్యులను హింసించడం, హత్యాయత్నం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా ఉండాలంటే.. * మానసిక ఒత్తిడిని గురవరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. * ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి. * కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. ఈర్ష, ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. * ఇతరులను చిరునవ్వుతో పలకరించండి.. అభినందించంది.. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి. * సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్‌కు లోనుకావద్దు. * జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి. * పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి, పొరపాట్లు సరిదిద్దండి. * మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు. తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి. * భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. దానిని సరిచేసుకుంటే అది మీకు దూరంగా ఉంటుంది. * ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు. * పిల్లలతో సరదాగా గడపండి.. మాట్లాడండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండండి. -
మెదడుకు ఆహారం... గాలి!
మీకు తెలుసా మెదడు బరువు మనిషి బరువులో మూడు శాతానికి మించదు. అయితే మనిషి పీల్చుకున్న ప్రాణవాయువు (ఆక్సిజన్) 20 శాతానికి పైగా మెదడుకే చేరుతుంది. ప్రహేళికలను పరిష్కరించడం, చదవడం, ఏకాగ్రతతో వినడం వంటి పనులు చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆక్సిజన్ కావాలి. దేహం పని చేయడానికి ఆహారం ఎలాగో మెదడు పని చేయాలంటే గాలి అలాగన్నమాట. ఆక్సిజన్ తగినంత అందకపోతే మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, మానసిక సమతౌల్యంలో లోపం వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయి. వీటితోపాటు తగినంత ప్రాణవాయువు కోసం శ్వాస త్వరత్వరగా, వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది అసంకల్పితంగా జరిగిపోతుంది.