ఆ కేఫ్‌కి కష్టమర్లు మంచి రేటింగే ఇచ్చారు. ఫేస్‌బుక్ 5కు 5 పాయింట్లు ఇచ్చింది. కోల్‌కతా ప్రజలకు తెలుసు తమకు ఆ కేఫ్‌ను ప్రోత్సహించాలని. అందుకే అక్కడకు వెళతారు. మాక్‌టైల్స్ తాగుతారు. పఫ్‌లు తింటారు. బేకరి ఐటమ్స్ పార్శిల్ కట్టించుకుంటారు. 7 నుంచి 9 మంది స్త్రీలు ఎప్పుడూ అక్కడ చిరునవ్వుతో పని చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉండి ప్రశాంతంగా ఉండే బేకరి కేఫ్ పేరు ‘క్రస్ట్ అండ్ కోర్’. దక్షిణ కోల్‌కతాలోని ‘చేట్ల’ ప్రాంతంలో ఉంటుంది. ఏమిటి దాని విశేషం? మానసిక సమస్యల నుంచి బయటపడిన ఏ ఆధారం లేని స్త్రీలు అక్కడ పని చేస్తారు. ఇలా వారి కోసమే నడిచే బేకరి దేశంలో ఇదే కావచ్చు.
మానసిక హింస
భౌతిక హింసలో గాయం అయితే మందు రాస్తే తగ్గిపోవచ్చు. కాని మానసిక హింస తాలూకు దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. అవి క్రమేపి మానసిక రుగ్మతలుగా మారతాయి. వాటికి వైద్యం చేయించుకోవాలని చాలామంది మహిళలకు తెలియదు. ఒకవేళ తెలిసినా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు కాని సైకియాట్రిస్ట్‌ల దగ్గరకు వెళ్లరు. చివరకు ఆ రుగ్మతలు ముదిరిపోతాయి. ఏమీ తెలియని స్థితిలో ఇళ్ల నుంచి బయటపడి సమాజం దృష్టిలో ‘పిచ్చివాళ్లు’ అన్న ముద్ర పడి తిరుగుతుంటారు. ఇలా తిరిగే స్త్రీల కోసం కోలకతాలో ‘ఈశ్వర సంకల్ప’ అనే ఎన్.జి.ఓ పని చేస్తోంది. వీళ్లు ‘సర్బరి షెల్టర్’ అనే ఒక హోమ్‌ను నడుపుతున్నారు. ఇందులో అచ్చంగా మానసిక సమస్యలతో రోడ్ల మీద తిరిగే స్త్రీలను తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తారు. వీరికి వైద్యం చేయించి బేకింగ్‌లో శిక్షణ ఇచ్చి ఈ బేకరిలో ఉపాధి కల్పిస్తున్నారు. 2018లో ఇలా మానసిక సమస్యల నుంచి బయటపడిన స్త్రీల కోసం ‘క్రస్ట్ అండ్ కోర్’ బేకరినీ తయారు చేశారు. గత మూడేళ్లుగా ఈ బేకరి విజయవంతంగా నడుస్తూ ఉంది.
గృహహింసతో మానసిక సమస్యలు
‘సర్బరి షెల్టర్’లో ఆశ్రయం పొంది బేకరిలో పని చేస్తున్న మహిళలందరూ దారుణమైన గృహహింసకు పాల్పడిన వారే. భర్త, అత్తింటివారు పదేపదే భౌతికదాడికి పాల్పడటం, మానసికంగా భయభ్రాంతం చేయడం వల్ల అదీ ఒకరోజు రెండు రోజులు కాదు మూడునాలుగేళ్లు వరుసగా చేయడం వల్ల మతి చలించి ముఖ్యంగా ‘స్క్రిజోఫోబియా’ బారిన పడి ఇళ్లు వదిలినవాళ్లే అంతా. వీరు చాలారోజులు రైల్వేస్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చివరకు ఈ హోమ్‌కు పోలీసుల ద్వారా చేరుతారు. ‘వాళ్లకు ఒక్కొక్కరికి సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు వైద్యం చేయిస్తాం. అప్పుడు నార్మల్ అవుతారు. ఆ తర్వాత కూడా మందులు తప్పనిసరిగా కొనసాగిస్తూ పని చేసుకోవాల్సి ఉంటుంది’ అని హోమ్ నిర్వాహకులు చెప్పారు.
కొత్త జీవితం
‘నేను బిస్కెట్లు బాగా చేస్తాను. కేక్‌లు అవీ చేయడం రాదు’ అని ఈ కేఫ్‌లో పని చేసే ఒక మహిళ చెప్పింది. ‘నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. నాదంటూ ఒక ఇల్లు ఉండాలి’ అందామె. మిగిలిన వారిలో ముంబై నుంచి తప్పిపోయి వచ్చినవారు, అస్సాం వైపు నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరి వయసులో 26 నుంచి 45 వరకూ ఉన్నాయి. ‘మీ కేఫ్‌లో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి’ అనే చిన్న మాటకు వాళ్లు చాలా బ్రైట్‌గా నవ్వుతారు. ఆ చిన్న ప్రశంస వారికి పెద్ద ఆరోగ్యహేతువుతో సమానం. ‘మానసిక సమస్యల నుంచి బయటపడిన వారు కొంత బెరుకుగా, ఎదుటివారి మీద ఆధారపడేలా ఉంటారు. వీరిని సమాజం కలుపుకుని మద్దతు ఇవ్వకపోతే తమలో తాము ముడుచుకుపోతారు. నలుగురిలో కలవడానికే భయపడిపోతారు. కేఫ్ పెట్టడం ద్వారా వీరు నలుగురినీ కలిసేలా చేసి వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాం’ అని కేఫ్‌లో సూపర్‌వైజర్‌గా పని చేసే మహిళ చెప్పారు. ఈ సూపర్‌వైజర్ మాత్రం ‘నార్మల్’ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ. ఈమె తనతో పని చేసే ఈ మహిళలను కనిపెట్టుకుని ఉంటుంది. ఈ కేఫ్‌కు వెళితే బయట ‘మేము ప్రతికూలతలను జయించాం. మేము చాంపియన్స్’ అని ఉంటుంది.
నిజమే. వారు చాంపియన్స్
మనసు చీకటి గుయ్యారాల్లో జారి పడిపోయినా తిరిగి వెలుతురు వెతుక్కుంటూ దానిని దారికి తెచ్చుకున్నారు. సమస్యలు, సవాళ్లు తద్వారా మానసిక బలహీనత ఎవరికైనా సహజం. దానికి వైద్యం తీసుకోవాలి. స్నేహితుల సపోర్ట్ తీసుకోవాలి. అన్నింటిని దాటి కొత్త జీవితం మొదలెట్టాలి.
క్రస్ట్ అండ్ కోర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే.
– సాక్షి ఫ్యామిలీ
మనసు కుదుట పడింది కాఫీ తాగండి
Published Sat, Apr 3 2021 1:08 AM | Last Updated on Sat, Apr 3 2021 8:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment