ఐఐఎం గ్రాడ్యుయేట్‌ : లైఫ్‌లో రిస్క్‌ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు | Meet Divya Rao IIM Graduate Who Became Ca Now Earns Rs 4.5 Crore Monthly With Rameshwaram Cafe, Know Her Success Story | Sakshi
Sakshi News home page

ఐఐఎం గ్రాడ్యుయేట్‌ : లైఫ్‌లో రిస్క్‌ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు

Published Thu, Jan 23 2025 1:21 PM | Last Updated on Thu, Jan 23 2025 3:34 PM

Meet Divya Rao IIM graduate who became CA  now earns Rs 4.5 crore monthly

జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి.  జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్‌ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్‌ ఉంటుందని నమ్మేవారు  చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో  ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది.  ఎలా?  తెలుసుకోవాలని ఉందా?

దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో  21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో  ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో  ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.  ఒక ఎగ్‌  పఫ్ తినడానికి  కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది.  కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ  చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది.   అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.

వ్యాపారవేత్తగా  ఎలా మారింది?
ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్‌ బిజినెస్‌ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్‌ బిజినెస్‌ అంటే దివ్య  తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?"  అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది.  (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)

ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది.  అలా రాఘవ్‌కు ఫుడ్‌ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది.  దీంతో బిజినెస్‌ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో  పెళ్లితో ఒక్కటయ్యారు. 

భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’  ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్‌ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్‌ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది.  రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో   కూడా ప్లాన్‌ చేస్తున్నారు ఈ  దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో  బ్రాంచెస్‌   తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు.

రామేశ్వరం కెఫే
కర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్‌. అక్కడికి వెళ్లినవారు  ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్‌. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది.   ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో   భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు.  తనకిష్టమైన ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.

కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్‌, బాత్‌, రోటీ, పరోటాతోపాటు,  రైస్‌ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే   టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది.  ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను  వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా  దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement