ఉపాధి
ఒక అందమైన ఆలోచనను సక్రమంగా అమలులో పెడితే పల్లెటూరు నుంచి కూడా విదేశాలకు విస్తరించవచ్చు అని నిరూపిస్తుంది చిలువేరు సాహితి. చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఉపాధిని సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసులో తనతోపాటు మరో ఇరవై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో వ్యవసాయాధారిత జీవనాల మధ్య వెలుగుతున్న సాహితిని పలకరిస్తే విజయావకాశాన్ని వంటలతో అందిపుచ్చుకుంటున్నానని వివరిస్తుంది.
‘‘నాకు రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం నాకో ఉపాధిని కల్పిస్తుంది అని మాత్రం ఊహించలేదు. బీటెక్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో నాలుగేళ్లు ఉద్యోగం చేశాను. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో ఊరు వచ్చేశాను. ఆ టైమ్‌లో మా అమ్మ కన్యాకుమారి చేసే వంటలను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని. ఖాళీ సమయంలో సరదాగా తీసుకున్న వంటల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ పేజీ క్రియేట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టులకు లైకులు వెల్లువెత్తుతుండేవి.
ఒకటి నుంచి మొదలు..
ఓరోజున ఉన్నట్టుండి ఒక ఫాలోవర్ నుంచి ‘మాకు స్వీట్స్ చేసి పంపుతారా’ అంటూ ఒక పోస్ట్ వచ్చింది. కాదనటమెందుకులే, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అని... ఆ ఆర్డర్ పూర్తిచేసి, కొరియర్ ద్వారా పంపించాం. ఆ తర్వాత మరో రెండు ఆర్డర్లు వచ్చాయి. అలా నెలకు ఒకటి రెండు ఆర్డర్లు రావడం మొదలయింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. నా వంటలకు మంచి డిమాండ్ ఉందని అర్థమైంది. దానినే ఉపాధిగా ఎందుకు చేసుకోకూడదూ అని... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఫుడ్ తయారీనే వ్యాపారంగా ఎంచుకున్నాను. ముందు మా ఇంటివరకే పనులు ఉండేవి. తర్వాత పనులు పెరగడంతో ఊళ్లోనే ఉన్న మా చుట్టుపక్కల మహిళలను ఫుడ్ తయారీకి నియమించుకున్నాం. స్నాక్స్, ఊరగాయలు, స్వీట్లు, మసాలా పొడులతో పాటు మిల్లెట్ ఉత్పత్తులు, ఇన్‌స్టంట్ మిక్స్‌లు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు నెలకు 30 నుంచి 40 ఆర్డర్లు వస్తున్నాయి.
మరో 20 మందికి...
పదిహేనేళ్లుగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఒక ఉద్యోగికి వచ్చే ప్యాకేజీని ఇప్పుడు నా వ్యాపారం ద్వారా పొందుతున్నాను. నాతోపాటు మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాను. వీరిలో పదిమంది తమ ఇళ్ల నుంచే పచ్చళ్లు, పొడులు, ఇతర పిండి వంటలు తయారు చేసి వాటిని అందంగా ΄్యాక్ చేసి ఇస్తారు. మా ఇంటి మొదటి అంతస్తులోని రెండు గదులను నా కంపెనీ ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’కి కేటాయించుకున్నాను. పదిహేను రకాల పచ్చళ్లు, 40 రకాల పిండి వంటలు, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్సర్లు, మసాల పొడులు.. దాదాపు 70 ర కాల వంటకాలు తయారు చేస్తుంటాం. మన దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ.. దేశాలలో ఉండే మన తెలుగువారికి కొరియర్ ద్వారా పచ్చళ్లు, పొడులు పంపిస్తున్నాను.
ఎక్కడా ప్లాన్ లేదు..
ఏ మాత్రం ప్లాన్ లేకుండా నా వ్యాపారం వృద్ధి చెందుతూ వస్తోంది. ఇంట్లో పెట్టిన ఆవకాయతో ఆరంభమైన ఈ బిజినెస్‌లో వచ్చిన ఆర్డర్ల ప్రకారం పెట్టుబడి పెడుతూ, ఆదాయాన్ని పొందుతున్నాను. ఫుడ్ బిజినెస్ కాబట్టి ఏడాది క్రితం లైసెన్స్ కూడా తీసుకున్నాను. మా ఊరికి మరింత పేరుతెచ్చేలా ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ బ్రాండ్ ఉత్పత్తులను విస్తరించాలనుకుంటున్నాను. కానీ, తయారీ మాత్రం మా ఊరి నుంచి, మా ఇంటి నుంచే చేస్తుంటాను.
సవాళ్లను అధిగమిస్తూ..
రుచికరమైన వంటకాల తయారీలో పదార్థాలు కూడా అంతే నాణ్యమైనవి ఉండాలి. సరైన శుభ్రత పాటించాలి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను సేకరించడం, వాటిని సమయానుకూలంగా తయారీలో వాడటం పెద్ద సవాల్‌గానే ఉంటోంది. అలాగే, సీజనల్‌గా ఉండే సమస్యల్లో ముఖ్యంగా వర్షాకాలం ΄్యాకింగ్‌లు తడవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు తిరిగి రీప్లేస్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా మందితో డీల్ చేయాలి, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి సహనంతో ఉండాలి. ఈ ప్రయాణం నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది.
‘చిన్న అమ్మాయివే కానీ, మా ఇంట్లో బామ్మలు చేసిన వంటకాల రుచి చవి చూస్తున్నాం’ అంటూ మా వంటకాలను రుచి చూసినవారు నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్‌ల ద్వారా ప్రశంసలు తెలియచేస్తుంటారు. నాణ్యత ద్వారా వారి ఆశీస్సులను, అభిమానాన్ని, మద్దతును ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటాను అంటూ ఆనందంగా వివరిస్తుంది సాహితి.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment