
‘పెట్రోల్ బంక్‌లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.
ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్ బంక్. ఇద్దరు కలెక్టర్‌ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అయింది...
నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్‌డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్‌డీఏ, జడ్‌ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు.
అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది.
ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్ బంక్‌ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.
కలలో కూడా ఊహించలేదు
నారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.
– జగదీశ్వరి, సెల్స్ ఉమన్ , జడ్.ఎం.ఎస్. పెట్రోల్ బంకు
మరింత మందికి ఉపాధి
నారాయణపేట జడ్‌ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్‌ఎంఎస్‌కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.
– చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్
– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట
Comments
Please login to add a commentAdd a comment