ఇంటి పనులతోనే సమయం సరిపోవడం లేదనే కంప్లైంట్ గృహిణుల నోట తరచూ వినిపిస్తుంటుంది. కొందరు మాత్రం కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడా
సద్వినియోగం చేసుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. అలాంటి కొందరిలో పద్మాసని దరూరి ఒకరు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న
53 ఏళ్ల పద్మాసని దరూరి గృహిణిగా ఉంటూ సంస్కృతంతో పాటు అనేక భాషల మీద పట్టు సాధించారు.
భర్త ఉద్యోగరీత్యా పుణెలో ఉండటంతో అక్కడి స్థానిక వంటకాలను నేర్చుకున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేసే సమయానికి వచ్చేసరికి నగరవాసులకు ‘పావ్ మంత్ర’ పేరుతో మహారాష్ట్రియన్ వంటకాలను పరిచయం చేస్తూ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు. లోనూ ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్‌ను ్రపారంభిస్తున్నారు.గృహిణిగా ఉంటూనే వ్యాపారవేత్తగా ఎదిగిన పద్మాసని దరూరిని పలకరిస్తే ఇలా ఎన్నో కబుర్లు మన ముందుంచారు.
‘‘మనలో అభిరుచి ఉండాలే గానీ ఎక్కడ ఉన్నా దానిని వృద్ధిలోకి తీసుకురావచ్చు. మా వారి ఉద్యోగ రీత్యా పుణేలో ఉండేవాళ్లం. గృహిణిగా ఇల్లు, పిల్లల పనులు ఎప్పుడూ ఉండేవే. పిల్లలు హై స్కూల్‌కి వచ్చాక నేను వేదాంత అకాడమీలో చేరి మూడు నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకున్నాను. మన పురాణేతిహాసాలు చదువుతూ సబ్జెక్ట్‌పై పట్టు సాధించగలిగాను.
కార్పొరేట్ కంపెనీలలో పని చేసేవారి ఆసక్తిని బట్టి, అక్కడకు వెళ్లి సంస్కృతం క్లాసులు తీసుకునేదాన్ని. రామాయణ, మహా భారతాల గురించి క్షుణ్ణంగా వివరించేదాన్ని. వేదాంత అకాడమీలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వచ్చి పిల్లలకు చెబుతుండేదాన్ని. దీంతో వారు స్కూల్లో చదువుకున్న విషయాలే కాకుండా మన వేదాల గురించి, పురాణాల గురించీ కూడా తెలుసుకోగలిగారు.
వివిధ రకాల భాషలు
సంస్కృతంతో పాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీ.. ఇలా రకరకాల భాషలను ఆసక్తితో నేర్చుకున్నాను. వీటితోపాటు దేశంలోని అన్ని రకాల ్రపాచీన సంస్కృతుల గురించి తెలుసుకోవడం, వాటిని ఆచరించడం చేస్తుండేదాన్ని. ఈ క్రమంలో అన్ని రకాల వంటకాల తయారీని ఇష్టంగా చేసేదాన్ని. వాటిని మా ఇంట్లో వారికే కాదు మా చుట్టుపక్కల వారికీ రుచి చూపించేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. మా అబ్బాయిలిద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తయ్యాక నాకు మరింత వెసులుబాటు దొరికింది. నా వంటకాల రుచితో బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది.
రుచిగా.. పావ్ మంత్ర
తరచూ ఇంట్లో బిజినెస్ ఆలోచనల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను, మా పెద్దబ్బాయి కలిసి ఒక ఫుడ్ స్టార్టప్ ్రపారంభించాలనుకున్నాం. మా స్టార్టప్‌కి వాత్సల్య అనే పేరు అనుకున్నాం. పుణెలో స్థానిక ఫుడ్ వడాపావ్. అక్కడ స్ట్రీట్‌ఫుడ్‌గా దీనికి పేరుంది. హైదరాబాద్ వాసులకు ఈ వడాపావ్ రుచిని కొత్తగా అందించాలనుకున్నాను.
పుణెలో వడాపావ్ టేస్ట్, మన దగ్గర టేస్ట్‌కి భిన్నంగా ఉంటుంది. ఏ పనైనా ఒకసారి మొదలుపెడితే దాంట్లో నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిందే అనుకొని వ్యాపారంలోకి దిగాను. పావ్‌కి విభిన్నమైన రుచిని తెప్పించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి, విజయవంతమయ్యాం. మా పిల్లలు వామన్, కేశవ్ లు తమ పూర్తి సహకారాన్ని నాకు అందించారు. దాంతో ‘పావ్‌మంత్ర’ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను కరోనా సెకండ్ వేవ్‌లో మాదాపూర్‌లో ్రపారంభించాం. మా స్టార్టప్‌కి మహారాష్ట్ర, ఫార్సీ ఆంబియన్స్ వచ్చేలా ΄్లాన్ చేశాం.
కొద్ది రోజుల్లోనే నోటి మాట ద్వారానే అందరికీ తెలియడంతో మంచి పేరు వచ్చింది. నేను కన్న కల రెండున్నరేళ్లలోనే సాకారం అయ్యింది. ఈ నెలలో పుణెలో ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్‌ను అందించబోతున్నాను. గృహిణిగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉన్న నేను 53 ఏళ్ల వయసులో ఇలా బిజినెస్ ఉమెన్‌గా ఎదుగుతానని అస్సలు ఊహించలేదు. నా అభిరుచికి మేరకు ఒక్కో ప్రయత్నం చేస్తూ ప్రయాణిస్తున్నాను.
ఈ ప్రయాణంలో నా పిల్లలు తోడయ్యారు. తొంభై ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులూ నా ఆసక్తిని, అభిరుచిని గౌరవిస్తూ తమ ఆశీస్సులను అందిస్తున్నారు. అమ్మనాన్నలను చూసుకుంటూ, భర్త, పిల్లల బాగోగులను గమనిస్తూ, నన్ను నేనుగా మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నం ఎప్పుడూ నాకు మంచి ఫలితాలను ఇస్తూ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ వివరించారు పద్మాసని.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment