పది కుటుంబాలకు నలుగురు వండి పెడతారు. రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండీ వండీ వండీ అలసిపోయేవారూ ఉద్యోగాల వల్ల టైమ్ లేని వారు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నవారు ఇదేదో బాగుందే అనుకుంటున్నవారు కేరళలో కమ్యూనిటీ కిచెన్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. అంటే పది కుటుంబాలు కలిసి ఓ నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆ మహిళలు ఆ పది కుటుంబాలకు వంట చేసి పంపిస్తున్నారు. ఇది రోజు రోజుకూ పెరుగుతున్న ట్రెండ్.
'ప్లాన్ చేస్తే పోయేదేమీ లేదు వంట చేసే బాధ తప్ప’ అంటున్నారు కేరళ వాసులు. ‘వంట గది వద్దు. వంట మీద ఆదాయం ముద్దు’ అనే నినాదం కూడా ఇస్తున్నారు. ఇదంతా గత ఒకటి రెండేళ్లలో జరిగిన మార్పు. కేరళలోని పొన్నాని’ అనే టౌన్‌లో ఇద్దరు స్నేహితుల కుటుంబాలకు వచ్చిన ఆలోచన ‘సహకరణ కిచెన్’ (కమ్యూనిటీ కిచెన్) ఉద్యమానికి కారణం అయ్యింది.
వంట చేసి పెడతారా?
పొన్నానిలో రమేష్ వలియిల్ అనే బ్యాంక్ ఎంప్లాయే రోజూ వంట కోసం భార్య పడే బాధలు చూసేవాడు. ఉదయాన్నే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్ వండి బాక్స్ కట్టివ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లకు ఆమె జబ్బు పడింది. డాక్టర్లు వంట చేయవద్దన్నారు. ఏం చేయాలో రమేష్‌కు ΄పాలుపోలేదు. మరోవైపు అదే ఊళ్లో ఉన్న కలీముద్దీన్, అతని భార్య మాజిద అడ్వకేట్లు. ఉదయాన్నే ఇంటికొచ్చే క్లయింట్లను చూసుకోవాలా వంట గొడవలో ఉండాలా అనేది సమస్య అయ్యింది.
ఈ కుటుంబాలు రెండూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక తమకెవరైనా వండిపెట్టే వాళ్లుంటే బాగుండు అనుకున్నారు. అది కూడా ఇంటికొచ్చి కాదు. ఎక్కడైనా వండి పెట్టి అందించే వారు కావాలి. అందుకని వారే ఇద్దరు స్త్రీలను వెతికారు. వారికోసమని ఒక ఖాళీ స్థలం వెతికి షెడ్ వేశారు. తమ కుటుంబాలతో పాటు మరో ఎనిమిది కుటుంబాలను కలిపారు. మొత్తం పది కుటుంబాల కోసం అలా కమ్యూనిటీ కిచెన్ మొదలయ్యింది. వంట బాధ నుంచి పెద్ద ఉపశమనం లభించింది.
మొదటి రోజే మెను
రోజూ ఉదయాన్నే 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తయారయ్యి ఈ పది కుటుంబాల గడపలకు చేరేవి. వంట చేసే మనుషులకు ఇలా చేరవేసే మనుషులు తోడయ్యారు. వంట ఖర్చు అన్ని కుటుంబాలు సమానంగా పంచుకున్నా నెలకు వంట చేసి పెట్టేవారికి మంచి గిట్టుబాటుగానే ఉంది. కాకుంటే వీళ్లు ఉదయాన్నే నాలుగ్గంటలకంతా లేచి వంట మొదలుపెట్టాలి. మెనూ వాట్సాప్ గ్రూప్‌లో మొదటిరోజు పోస్ట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, పుట్టు, ఆపమ్, ఉప్మా లాంటివి ఉంటాయి. భోజనంలో నాలుగు రకాల కూరలు చికెన్, ఫిష్ ఉంటాయి. ఈ కుటుంబాల వాళ్లు ఫోన్లు చేసి వాట్సప్ కాల్స్ చేసి వంటను అజమాయిషీ చేస్తారు. మసాలాలు ఏవి వేయాలో చెప్తారు. అంతా ఆరోగ్యకరమైన తిండి లభించేలా చూస్తారు.
లాభాలు ఎన్నో
వంట తప్పితే మొదట చాలా టైము అందరి దగ్గరా మిగులుతోంది. ‘ఇంతకుముందు పిల్లలు స్పెషల్‌గా ఏదైనా చేసిపెట్టమంటే రోజువారి వంటతో ఓపిక లేక చేసేదాన్ని కాదు. ఇప్పుడు చేసి పెడుతున్నాను’ అని ఒక తల్లి చెప్పింది. ‘పది ఇళ్ల వంట వల్ల అయ్యే ఇంధనం, వచ్చే చెత్త కంటే కమ్యూనిటీ కిచెన్ వల్ల అయ్యే ఇంధనం, మిగిలే చెత్త తక్కువ. డబ్బు ఆదా అవుతుంది కూడా’ అంది మరో గృహిణి. అదీగాక దీనివల్ల మరో నలుగురికి పని దొరకడం మంచి విషయంగానే చూస్తున్నారు.
ఊరూరూ వ్యాపించాయి
మలబార్ జిల్లాలోని పొన్నాని నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ వెంటనే పక్క జిల్లా అయిన కోళికోడ్‌కు వ్యాపించింది. ప్రస్తుతం మలప్పురం, బలుస్సేరి, కన్నూర్, చెవరంబలమ్... ఇలా ఒక్కో ఊరిలో కమ్యూనిటీ కిచెన్‌లు వెలుస్తున్నాయి. సూత్రం ఒకటే– నలుగురు కలిసి కిచెన్ నడుపుతారు. కేవలం పది లేదా 11 కుటుంబాలకు వండుతారు. ఈ సంఖ్య వల్ల పెద్ద పెద్ద వంట పాత్రలు, భారీ పొయ్యి, ఎక్కువ శ్రమ, సిబ్బంది అవసరం తప్పుతోంది. ఇద్దరు ముగ్గురు గృహిణులు కలిసి తమ ఇళ్లలోనే వండి బాక్సులు పంపిస్తున్నారు. ఇవి సక్సెస్ అవుతున్నాయి కూడా!
మహిళలే... వండాలా?
ఈ కిచెన్‌ల మీద ఒకటి రెండు విమర్శలు ఉన్నాయి. అవేమిటంటే ‘కమ్యూనిటీ కిచెన్స్‌లో కూడా ఆడవాళ్లే వండాలా’ అని ప్రగతివాదులు అంటుంటే ‘ఇంట్లో వంట మానేసి ఈ వేషాలా’ అని మగ దురహంకారులు అంటున్నారు. విమర్శలు ఎలా ఉన్నా ఏదో ఒకరోజు ఇళ్లలో వంట చేయడం కంటే ఇలాంటి కిచెన్‌ల మీద అందరూ ఆధారపడే రోజు తప్పక వస్తుంది. మంచిదే.
Comments
Please login to add a commentAdd a comment