Community Kitchen
-
ఆ ఊరు వాంరదరికీ ఒకటే కిచెన్..!
ఊళ్లో పేదరికం కనిపిస్తుంది’ అనే మాట వినిపిస్తుంటుంది. అయితే గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో ‘పేదరికం’ కంటే ఒంటరితనమే ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి ఒక గ్రామం... చందనంకి. ఒంటరితనం బాధితులైన ఈ ఊరి వృద్ధులు ‘కమ్యూనిటీ కిచెన్’లతో ఒంటరితనానికి దూరం కావడమే కాదు కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నారు.గుజరాత్‌లోని మెహసానా జిల్లా చందనంకి గ్రామంలో... పిల్లల కేరింతలు కనిపించవు. యువకుల ఆకతాయి మాటలు వినిపించవు. వృద్ధులు తప్ప ఎవరూ కనిపించని ఆ ఊళ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్లుగా ఉంటుంది. ఊరే ఒక వృద్ధాశ్రమంగా మారినట్లు అనిపిస్తుంది.అసలు ఈ ఊరి వాళ్లు ఎక్కడికి వెళ్లారు?చాలామంది పట్టణాల్లో స్థిరపడ్డారు. వారి కొడుకులు, కూతుళ్లు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో చదువుకుంటున్నారు. ఒకప్పుడు సందడికి చిరునామాగా ఉన్న ఆ ఊరు ఇప్పుడు నిశ్శబ్దానికి నిర్వచనంలా మారింది. కేవలం అయిదు వందల మంది మాత్రమే ఆ ఊళ్లో ఉంటున్నారు. వారిలో అత్యధికులు వృద్ధులే. ‘మా అబ్బాయి ఎప్పుడోగానీ నన్ను చూడడానికి రాడు’ అంటుంది ఒక బామ్మ.‘నన్ను నీతోపాటు తీసుకెళ్లరా అని మా అబ్బాయితో ఎన్నో సార్లు అంటాను. కాని నా మాట పట్టించుకోడు’ అంటుంది కోపంగా మరో బామ్మ. ‘నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు. మాతోపాటు వచ్చేయ్ అంటారు పిల్లలు. కాని నేను ఆ పట్టణాల్లో ఉండలేను. ఇక్కడే పుట్టాను. ఇక్కడే చస్తాను’ ఊరి మీద ప్రేమ వ్యక్త పరుస్తుంది ఇంకో బామ్మ. ఒంటరి దీపాలుగా మారిన బామ్మలకు ఊళ్లోనే ఉండిపోవడానికి వేరు వేరు కారణాలు ఉండవచ్చు. అయితే అందరినీ ఏకం చేసిన కారణం... ఒంటరితనం.ఒంటరితనం మాట ఎలా ఉన్నా ఊళ్లో చాలామంది వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. అయినప్పటికీ వారిని పట్టించుకునేవారు లేరు. అనారోగ్యంతో వంట చేసుకోవడం వారికి ఇబ్బందిగా మారింది. ఒక్క పూట కోసం వంట వండుకున్న వాళ్లు ఓపిక లేక అదే భోజనాన్ని మరుసటి రోజు కూడా తినడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.... ఈ నేపథ్యంలోనే గ్రామస్తుల ఆలోచన నుంచి ‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటయింది.నెలకు రెండు వేలు చెల్లిస్తే... ప్రతి పూటా వేడి వేడి భోజనం చేయవచ్చు. ఆరోగ్యకరమైన భోజనం మాట ఎలా ఉన్నా ‘కమ్యూనిటీ కిచెన్’ అనే పెద్ద ఫ్యామిలీలో వృద్ధులందరూ కుటుంబ సభ్యులుగా మారిపోయారు. ఒకరితో ఒకరు ఎంతోసేపు మాట్లాడుకుంటున్నారు. దీని వల్ల తమలో తెలియని ఆత్మీయత పెరిగింది. గతంలో ఎవరి ఇంట్లో వారు ఉండడం వల్ల ఎవరు ఎలా ఉన్నారు అనేది తెలిసేదికాదు. ఇప్పుడు రోజు కలుసుకోవడం వల్ల అన్ని విషయాలు మాట్లాడుకోగలుగుతున్నారు. మనసులో భారం దించుకొని ఒంటరితనానికి దూరం అవుతున్నారు. ఒకరి పక్కన ఒకరు కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ కలిసి తినడం అనేది భోజనానికి సంబంధించిన విషయమే కాదు మానసికంగా శక్తిని ఇచ్చే విషయం అని ఈ ఊరి ‘కమ్యూనిటీ కిచెన్’ నిరూపిస్తుంది. ‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటులో పూనమ్భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. భార్యా, బిడ్డలు పట్టణంలో ఉన్నా సరే, తాను మాత్రం ఊరిను వెదుక్కుంటూ వచ్చాడు. ఎంతోమంది వృద్ధులకు బిడ్డగా మారాడు. ‘కమ్యూనిటీ కిచెన్’ల కోసం గ్రామస్తులు నెల జీతంతో కుక్‌లను నియమించుకున్నారు. వారికి ఉచిత నివాసం కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో సందడి లేకపోయినా ‘కమ్యూనిటీ కిచెన్’లో మాత్రం సందడి ఉంటుంది. నవ్వులకు దూరం అయిన వృద్ధుల నవ్వులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ‘కమ్యూనిటీ కిచెన్’ సాధించిన విజయం గురించి చెప్పుకోవడానికి ఈ నవ్వులే సాక్ష్యం.(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!) -
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపం నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్‌ను తీసుకురావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పథకాలను సమీక్షించడంపై తమకున్న అధికారాలు పరిమితమని జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్ఎఫ్ఎస్ఏ) చట్టం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో స్కీమ్ తీసుకురావాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, గతంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి పిల్లల్లోపోషకాహార లోపాన్ని, ఆకలి చావులను నివారించేందుకు అవసరమైన చర్చలు జరపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్ రూపొందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ ప్రజా పయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
కమ్యూనిటీ కిచెన్: వంట చేసే పనిలేదు, ఇంటికే భోజనం వచ్చేస్తుంది
పది కుటుంబాలకు నలుగురు వండి పెడతారు. రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండీ వండీ వండీ అలసిపోయేవారూ ఉద్యోగాల వల్ల టైమ్ లేని వారు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నవారు ఇదేదో బాగుందే అనుకుంటున్నవారు కేరళలో కమ్యూనిటీ కిచెన్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. అంటే పది కుటుంబాలు కలిసి ఓ నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆ మహిళలు ఆ పది కుటుంబాలకు వంట చేసి పంపిస్తున్నారు. ఇది రోజు రోజుకూ పెరుగుతున్న ట్రెండ్. 'ప్లాన్ చేస్తే పోయేదేమీ లేదు వంట చేసే బాధ తప్ప’ అంటున్నారు కేరళ వాసులు. ‘వంట గది వద్దు. వంట మీద ఆదాయం ముద్దు’ అనే నినాదం కూడా ఇస్తున్నారు. ఇదంతా గత ఒకటి రెండేళ్లలో జరిగిన మార్పు. కేరళలోని పొన్నాని’ అనే టౌన్లో ఇద్దరు స్నేహితుల కుటుంబాలకు వచ్చిన ఆలోచన ‘సహకరణ కిచెన్’ (కమ్యూనిటీ కిచెన్) ఉద్యమానికి కారణం అయ్యింది. వంట చేసి పెడతారా? పొన్నానిలో రమేష్ వలియిల్ అనే బ్యాంక్ ఎంప్లాయే రోజూ వంట కోసం భార్య పడే బాధలు చూసేవాడు. ఉదయాన్నే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్ వండి బాక్స్ కట్టివ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లకు ఆమె జబ్బు పడింది. డాక్టర్లు వంట చేయవద్దన్నారు. ఏం చేయాలో రమేష్‌కు ΄పాలుపోలేదు. మరోవైపు అదే ఊళ్లో ఉన్న కలీముద్దీన్, అతని భార్య మాజిద అడ్వకేట్లు. ఉదయాన్నే ఇంటికొచ్చే క్లయింట్లను చూసుకోవాలా వంట గొడవలో ఉండాలా అనేది సమస్య అయ్యింది. ఈ కుటుంబాలు రెండూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక తమకెవరైనా వండిపెట్టే వాళ్లుంటే బాగుండు అనుకున్నారు. అది కూడా ఇంటికొచ్చి కాదు. ఎక్కడైనా వండి పెట్టి అందించే వారు కావాలి. అందుకని వారే ఇద్దరు స్త్రీలను వెతికారు. వారికోసమని ఒక ఖాళీ స్థలం వెతికి షెడ్ వేశారు. తమ కుటుంబాలతో పాటు మరో ఎనిమిది కుటుంబాలను కలిపారు. మొత్తం పది కుటుంబాల కోసం అలా కమ్యూనిటీ కిచెన్ మొదలయ్యింది. వంట బాధ నుంచి పెద్ద ఉపశమనం లభించింది. మొదటి రోజే మెను రోజూ ఉదయాన్నే 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తయారయ్యి ఈ పది కుటుంబాల గడపలకు చేరేవి. వంట చేసే మనుషులకు ఇలా చేరవేసే మనుషులు తోడయ్యారు. వంట ఖర్చు అన్ని కుటుంబాలు సమానంగా పంచుకున్నా నెలకు వంట చేసి పెట్టేవారికి మంచి గిట్టుబాటుగానే ఉంది. కాకుంటే వీళ్లు ఉదయాన్నే నాలుగ్గంటలకంతా లేచి వంట మొదలుపెట్టాలి. మెనూ వాట్సాప్ గ్రూప్‌లో మొదటిరోజు పోస్ట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, పుట్టు, ఆపమ్, ఉప్మా లాంటివి ఉంటాయి. భోజనంలో నాలుగు రకాల కూరలు చికెన్, ఫిష్ ఉంటాయి. ఈ కుటుంబాల వాళ్లు ఫోన్లు చేసి వాట్సప్ కాల్స్ చేసి వంటను అజమాయిషీ చేస్తారు. మసాలాలు ఏవి వేయాలో చెప్తారు. అంతా ఆరోగ్యకరమైన తిండి లభించేలా చూస్తారు. లాభాలు ఎన్నో వంట తప్పితే మొదట చాలా టైము అందరి దగ్గరా మిగులుతోంది. ‘ఇంతకుముందు పిల్లలు స్పెషల్‌గా ఏదైనా చేసిపెట్టమంటే రోజువారి వంటతో ఓపిక లేక చేసేదాన్ని కాదు. ఇప్పుడు చేసి పెడుతున్నాను’ అని ఒక తల్లి చెప్పింది. ‘పది ఇళ్ల వంట వల్ల అయ్యే ఇంధనం, వచ్చే చెత్త కంటే కమ్యూనిటీ కిచెన్ వల్ల అయ్యే ఇంధనం, మిగిలే చెత్త తక్కువ. డబ్బు ఆదా అవుతుంది కూడా’ అంది మరో గృహిణి. అదీగాక దీనివల్ల మరో నలుగురికి పని దొరకడం మంచి విషయంగానే చూస్తున్నారు. ఊరూరూ వ్యాపించాయి మలబార్ జిల్లాలోని పొన్నాని నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ వెంటనే పక్క జిల్లా అయిన కోళికోడ్‌కు వ్యాపించింది. ప్రస్తుతం మలప్పురం, బలుస్సేరి, కన్నూర్, చెవరంబలమ్... ఇలా ఒక్కో ఊరిలో కమ్యూనిటీ కిచెన్లు వెలుస్తున్నాయి. సూత్రం ఒకటే– నలుగురు కలిసి కిచెన్ నడుపుతారు. కేవలం పది లేదా 11 కుటుంబాలకు వండుతారు. ఈ సంఖ్య వల్ల పెద్ద పెద్ద వంట పాత్రలు, భారీ పొయ్యి, ఎక్కువ శ్రమ, సిబ్బంది అవసరం తప్పుతోంది. ఇద్దరు ముగ్గురు గృహిణులు కలిసి తమ ఇళ్లలోనే వండి బాక్సులు పంపిస్తున్నారు. ఇవి సక్సెస్ అవుతున్నాయి కూడా! మహిళలే... వండాలా? ఈ కిచెన్ల మీద ఒకటి రెండు విమర్శలు ఉన్నాయి. అవేమిటంటే ‘కమ్యూనిటీ కిచెన్స్‌లో కూడా ఆడవాళ్లే వండాలా’ అని ప్రగతివాదులు అంటుంటే ‘ఇంట్లో వంట మానేసి ఈ వేషాలా’ అని మగ దురహంకారులు అంటున్నారు. విమర్శలు ఎలా ఉన్నా ఏదో ఒకరోజు ఇళ్లలో వంట చేయడం కంటే ఇలాంటి కిచెన్ల మీద అందరూ ఆధారపడే రోజు తప్పక వస్తుంది. మంచిదే. -
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో గ్రూపు ఏర్పాటు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల పథకానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కార్యదర్శుల బృందం రూపొందించనుంది. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేలా పూర్తి పారదర్శకంగా ఉండేలా పథకాన్ని రూపొందించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఈనెల 29న మరోసారి కేంద్ర, రాష్ట్రాల ఆహార కార్యదర్శులు సమావేశం కానున్నారు.