ఊళ్లో పేదరికం కనిపిస్తుంది’ అనే మాట వినిపిస్తుంటుంది. అయితే గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో ‘పేదరికం’ కంటే ఒంటరితనమే ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి ఒక గ్రామం... చందనంకి. ఒంటరితనం బాధితులైన ఈ ఊరి వృద్ధులు ‘కమ్యూనిటీ కిచెన్’లతో ఒంటరితనానికి దూరం కావడమే కాదు కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నారు.
గుజరాత్‌లోని మెహసానా జిల్లా చందనంకి గ్రామంలో... పిల్లల కేరింతలు కనిపించవు. యువకుల ఆకతాయి మాటలు వినిపించవు. వృద్ధులు తప్ప ఎవరూ కనిపించని ఆ ఊళ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్లుగా ఉంటుంది. ఊరే ఒక వృద్ధాశ్రమంగా మారినట్లు అనిపిస్తుంది.
అసలు ఈ ఊరి వాళ్లు ఎక్కడికి వెళ్లారు?
చాలామంది పట్టణాల్లో స్థిరపడ్డారు. వారి కొడుకులు, కూతుళ్లు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో చదువుకుంటున్నారు. ఒకప్పుడు సందడికి చిరునామాగా ఉన్న ఆ ఊరు ఇప్పుడు నిశ్శబ్దానికి నిర్వచనంలా మారింది. కేవలం అయిదు వందల మంది మాత్రమే ఆ ఊళ్లో ఉంటున్నారు. వారిలో అత్యధికులు వృద్ధులే. ‘మా అబ్బాయి ఎప్పుడోగానీ నన్ను చూడడానికి రాడు’ అంటుంది ఒక బామ్మ.
‘నన్ను నీతోపాటు తీసుకెళ్లరా అని మా అబ్బాయితో ఎన్నో సార్లు అంటాను. కాని నా మాట పట్టించుకోడు’ అంటుంది కోపంగా మరో బామ్మ. ‘నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు. మాతోపాటు వచ్చేయ్ అంటారు పిల్లలు. కాని నేను ఆ పట్టణాల్లో ఉండలేను. ఇక్కడే పుట్టాను. ఇక్కడే చస్తాను’ ఊరి మీద ప్రేమ వ్యక్త పరుస్తుంది ఇంకో బామ్మ. ఒంటరి దీపాలుగా మారిన బామ్మలకు ఊళ్లోనే ఉండిపోవడానికి వేరు వేరు కారణాలు ఉండవచ్చు. అయితే అందరినీ ఏకం చేసిన కారణం... ఒంటరితనం.
ఒంటరితనం మాట ఎలా ఉన్నా ఊళ్లో చాలామంది వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. అయినప్పటికీ వారిని పట్టించుకునేవారు లేరు. అనారోగ్యంతో వంట చేసుకోవడం వారికి ఇబ్బందిగా మారింది. ఒక్క పూట కోసం వంట వండుకున్న వాళ్లు ఓపిక లేక అదే భోజనాన్ని మరుసటి రోజు కూడా తినడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.... ఈ నేపథ్యంలోనే గ్రామస్తుల ఆలోచన నుంచి ‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటయింది.
నెలకు రెండు వేలు చెల్లిస్తే... ప్రతి పూటా వేడి వేడి భోజనం చేయవచ్చు. ఆరోగ్యకరమైన భోజనం మాట ఎలా ఉన్నా ‘కమ్యూనిటీ కిచెన్’ అనే పెద్ద ఫ్యామిలీలో వృద్ధులందరూ కుటుంబ సభ్యులుగా మారిపోయారు. ఒకరితో ఒకరు ఎంతోసేపు మాట్లాడుకుంటున్నారు. దీని వల్ల తమలో తెలియని ఆత్మీయత పెరిగింది. గతంలో ఎవరి ఇంట్లో వారు ఉండడం వల్ల ఎవరు ఎలా ఉన్నారు అనేది తెలిసేదికాదు.
ఇప్పుడు రోజు కలుసుకోవడం వల్ల అన్ని విషయాలు మాట్లాడుకోగలుగుతున్నారు. మనసులో భారం దించుకొని ఒంటరితనానికి దూరం అవుతున్నారు. ఒకరి పక్కన ఒకరు కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ కలిసి తినడం అనేది భోజనానికి సంబంధించిన విషయమే కాదు మానసికంగా శక్తిని ఇచ్చే విషయం అని ఈ ఊరి ‘కమ్యూనిటీ కిచెన్’ నిరూపిస్తుంది.
‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటులో పూనమ్‌భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. భార్యా, బిడ్డలు పట్టణంలో ఉన్నా సరే, తాను మాత్రం ఊరిను వెదుక్కుంటూ వచ్చాడు. ఎంతోమంది వృద్ధులకు బిడ్డగా మారాడు. ‘కమ్యూనిటీ కిచెన్’ల కోసం గ్రామస్తులు నెల జీతంతో కుక్‌లను నియమించుకున్నారు.
వారికి ఉచిత నివాసం కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో సందడి లేకపోయినా ‘కమ్యూనిటీ కిచెన్’లో మాత్రం సందడి ఉంటుంది. నవ్వులకు దూరం అయిన వృద్ధుల నవ్వులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ‘కమ్యూనిటీ కిచెన్’ సాధించిన విజయం గురించి చెప్పుకోవడానికి ఈ నవ్వులే సాక్ష్యం.
(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment