న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపం నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్‌ల స్కీమ్‌ను తీసుకురావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పథకాలను సమీక్షించడంపై తమకున్న అధికారాలు పరిమితమని జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) చట్టం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో స్కీమ్ తీసుకురావాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, గతంలో కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి పిల్లల్లోపోషకాహార లోపాన్ని, ఆకలి చావులను నివారించేందుకు అవసరమైన చర్చలు జరపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌ల స్కీమ్ రూపొందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ ప్రజా పయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment