మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.
కేరళ పాలాపం..
కావలసినవి..
బియ్యం– పావు కేజీ;
పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;
నీరు– వంద మిల్లీలీటర్లు;
చక్కెర – అర స్పూన్;
ఉప్పు – అర స్పూన్;
బేకింగ్ సోడా– చిటికెడు.
తయారీ..
బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.
మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.
మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.
ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.
ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.
మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.
ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.
మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.
అట్లకాడతో తీసి ప్లేట్‌లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.
ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.
నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.
పంజాబీ కడీ..
కావలసినవి..
– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;
పెరుగు– 2 కప్పులు;
నీరు– 4 కప్పులు;
పసుపు– చిటికెడు.
– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;
పసుపు – అర టీ స్పూన్;
ఇంగువ– పావు టీ స్పూన్;
ఆవాలు – టీ స్పూన్;
జీలకర్ర – టీ స్పూన్;
మెంతులు – అర టీ స్పూన్;
లవంగాలు – 3;
ఎండుమిర్చి – 2;
కరివేపాకు – 3 రెమ్మలు;
ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);
అల్లం– అంగుళం ముక్క (తరగాలి);
వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);
మిరపొ్పడి– అర టీ స్పూన్;
ధనియాల పొడి –2 టీ స్పూన్‌లు;
ఉప్పు – టీ స్పూన్;
గరం మసాలా– అర టీ స్పూన్;
ఆమ్‌చూర్ పౌడర్– 2 టీ స్పూన్‌లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;
కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;
ఎండుమిర్చి– 2;
కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;
కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్తయారీ..
ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.
స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.
అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.
ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.
ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్‌చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.
బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.
ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్‌లా కూడా తాగుతారు.
వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.
జైసల్మీరీ చనే..
కావలసినవి..
ముడి శనగలు – కప్పు;
నెయ్యి – టేబుల్ స్పూన్;
ఇంగువ – చిటికెడు;
జీలకర్ర– అర టీ స్పూన్;
జీలకర్ర పొడి– టీ స్పూన్;
ధనియాల పొడి – 2 టీ స్పూన్‌లు;
మిరపొ్పడి – టేబుల్ స్పూన్;
పసుపు– అర టీ స్పూన్;
గరం మసాలా పొడి– అర టీ స్పూన్;
పెరుగు– ఒకటిన్నర కప్పులు;
శనగపిండి –3 టేబుల్ స్పూన్‌లు;
కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.
తయారీ..
శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.
ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.
జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.
ప్రెషర్‌కుకర్‌లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.
చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.
ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా?
Comments
Please login to add a commentAdd a comment