పొట్లకాయ.. స్నేక్‌గార్డ్. చూడడానికి పాములా భయపెడుతుంది. కానీ.. ధైర్యంగా నమిలి మింగేస్తే సరి. పొట్టలోకి వెళ్లి చల్లగా కాపాడుతుంది. సమ్మర్ గార్డ్ ఫ్యామిలీలో ఇదీ ఒకటి. పొట్టను కాపాడే కాయ.. పొట్లకాయ. వేడి నుంచి రక్షించే.. కూరగాయ ఇది. దీనినే ఎన్నో రకాలుగా వండవచ్చు. ఎంతో రుచిగా మార్చవచ్చు. అలాగే పచ్చడి చేసి నిల్వ చేయవచ్చు కూడా. మరి ఈ పొట్లకాయ రుచుల తీరేంటో తెలుసుకుందాం..
పొట్లకాయ పెసరపప్పు..
కావలసినవి.. పొట్లకాయ ముక్కలు– 2 కప్పులు; పెసరపప్పు – అర కప్పు ; కొబ్బరి తురుము – అర కప్పు ; ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – 2 టీ స్పూన్‌లు ; ఎండుమిర్చి – 2 ; కరివేపాకు – 2 రెమ్మలు ; ఇంగువ– పావు టీ స్పూన్ ; నూనె లేదా నెయ్యి – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; చక్కెర – టీ స్పూన్.
తయారీ..
- బంగాళాదుంపను శుభ్రం చేసి నిలువుగా కోసి గింజలను తొలగించిన తర్వాత ముక్కలు చేయాలి. పెసరపప్పు కడిగి పక్కన పెట్టాలి.
- పాత్రలో రెండు కప్పుల నీటిని పోసి మరిగేటప్పుడు పొట్లకాయ ముక్కలు, పెసరపప్పు వేసి ఉడికించాలి.
- పప్పు ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత ఉప్పు కలిపి పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
- ముక్కలు ఉడకడానికి నీరు సరిపోకపోతే మరికొంత నీటిని చిలకరించి ఉడికించాలి.
- బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి.
- అవి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి.
- మినప్పప్పు వేగిన తర్వాత చక్కెర, ఉడికించి సిద్ధంగా ఉంచిన పొట్లకాయ – పెసరపప్పును వేసి కలపాలి.
- తేమ ఆవిరి అయ్యే వరకు కలియబెడుతూ వేయించి చివరగా కొబ్బరి తురుము వేసి కలపాలి.
- కొబ్బరి రుచి కూరగాయ ముక్కలకు పట్టడం కోసం ఓ నిమిషం పాటు గరిటెతో కలియబెడుతూ వేయించి స్టవ్ ఆపేయాలి.
- వేడి తగ్గే కొద్దీ కూర రుచి ఇనుమడిస్తుంది. ఇది సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా రుచిగా ఉంటుంది.
పొట్లకాయ పెసరపప్పు, పొట్లకాయ పొరిచ్చ కొళంబు
పొట్లకాయ పొరిచ్చ కొళంబు..
కావలసినవి: కందిపప్పు – అరకప్పు; పొట్లకాయ ముక్కలు – 3 కప్పులు ; సాంబారు పొడి – టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మకాయ రసం – ఒక టేబుల్ స్పూన్. పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్‌లు; పచ్చి శనగపప్పు – 2 టీ స్పూన్‌లు ; ఎండుమిర్చి – 2; మినపప్పు– టీ స్పూన్ ; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు ; ఇంగువ – చిటికెడు ; నూనె – టీ స్పూన్. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ;ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – టీ స్పూన్ ; కరివేపాకు– 2 రెమ్మలు.
తయారీ..
- కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి తగినంత నీటిని పోసి ఉడికించి పక్కన ఉంచాలి.
- పొడి కోసం తీసుకున్న దినుసులను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
- పొట్లకాయను శుభ్రంగా కడిగి తరిగి గింజలు తొలగించి ముక్కలను సిద్ధం చేసుకోవాలి.
- ఒక పాత్రలో ఉప్పు, సాంబారు, పొట్లకాయ ముక్కలు వేయాలి.
- ముక్కలు మునిగేటట్లు నీటిని పోసి మెత్తగా ఉడికించాలి.
- ఉడికిన కందిపప్పు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి.
- ఇందులో ఉడికించిన పొట్లకాయ ముక్కలను, మసాలా పొడి వేసి నీరు పోసి కలిపి ఉడికించాలి.
- పప్పు, కూరగాయ ముక్కలు, మసాలా పొడి అన్నింటి రుచి కలిసే వరకు ఉడికించి, నిమ్మరసం కలిపి దించేయాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు, నిమ్మరసం మరికొంత చేర్చుకోవచ్చు
- పోపు కోసం మందపాటి పాత్ర తీసుకోవాలి.
- పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు వేయించి కరివేపాకు వేసి ముందుగా ఉడికించి సిద్ధంగా ఉంచిన కందిపప్పు కూరగాయ ముక్కల మిశ్రమాన్ని పోసి కలిపి దించేయాలి. ఘుమఘుమలాడే పొట్లకాయ పొరిచ్చ కొళంబు రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది.
పొట్లకాయ పచ్చడి
కావలసినవి: పొట్లకాయ ముక్కలు – కప్పు; ఎండుమిర్చి –3 ; మినప్పప్పు – టేబుల్ స్పూన్ ; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ; వేరు శనగపప్పు లేదా నువ్వులు లేదా కొబ్బరి తురుము – పావు కప్పు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్; చింతపండు– అంగుళం ముక్క ; బెల్లం పొడి– టీ స్పూన్ (ఇష్టమైతేనే). పోపు కోసం: నూనె– టేబుల్ స్పూన్ ; ఆవాలు– టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్ ; ఎండుమిర్చి– ఒకటి; ఇంగువ– చిటికెడు ; కరివేపాకు– 2 రెమ్మలు.
తయారీ..
- మందపాటి బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి మినప్పప్పు, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చిని దోరగా వేయించి మరొక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
- అదే బాణలిలో పొట్లకాయ ముక్కలను వేసి పచ్చిదనం తగ్గేవరకు వేడి చేసి ఆపేయాలి.
- చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి, అందులోనే చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మరో రౌండ్ తిప్పాలి.
- ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసి మరొక పాత్రలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి పచ్కడిలో వేసి కలపాలి. ఇది అన్నంలోకి ఇడ్లీ, దోసెల్లోకి కూడా రుచిగా ఉంటుంది.
పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ వేపుడుకూర
పొట్లకాయ వేపుడుకూర..
కావలసినవి: పొట్లకాయ ముక్కలు – పావుకేజీ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; జీలకర్ర– టీ స్పూన్ ; పసుపు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; ఇంగువ– చిటికెడు ; కారం – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి– టేబుల్ స్పూన్ ; నీరు– పావు కప్పు ; వేరుశనగ పప్పుల పొడి లేదా శనగపిండి– టేబుల్ స్పూన్.
తయారీ..
బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, పసుపు, ఇంగువ వేసి కలపాలి.
పచ్చిదనం పోయిన తర్వాత ఇందులో ఉప్పువేసి, కొద్దిగా నీటిని పోసి కలపాలి.
మసాలా పొడులన్నీ సమంగా కలుస్తాయి.
ఇప్పుడు స్టవ్ ఆపేసి బాణలిలో పొట్లకాయ ముక్కలు వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి.
ముక్కలకు మసాలా సమంగా పట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ముక్కల్లో నీటిని పోసి కలిపి మంట తగ్గించి మూత పెట్టాలి.
రెండు నిమిషాలకోసారి మూత తీసి గరిటెతో ముక్కలను కలిపి మళ్లీ మూత పెడుతుండాలి. పది నిమిషాలకు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి.
ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించి మళ్లీ మూత పెట్టి ఉడికించాలి.
చివరగా వేరుశనగపప్పు పొడి లేదా శనగపిండి చల్లి బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది.
ఇవి చదవండి: Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..?
Comments
Please login to add a commentAdd a comment