నువ్వుల పొడి, కొబ్బరి పొడి, కరివేపాకు పొడి, అవిశె గింజల పొడి
'సంక్రాంతి రుచుల తియ్యటి రుచి బయటపడాలనిపిస్తోందా! నోటికి కారంగా, పొట్టకు తేలిగ్గా ఉండే ఆహారం తినాలనిపిస్తోందా! ఉన్నది ఆరు రుచులే.. కానీ జిహ్వ మరింత రుచిని కోరుకుంటుంది. నాలుకకు మమకారం మాత్రమే కాదు రుచి కారమూ ఇష్టమే. పోపుల పెట్టెలో దినుసులన్నీ కలిపి రకరకాల కారం పొడులు చేద్దాం.'
నువ్వుల పొడి..
కావలసినవి: తెల్ల నువ్వులు – వంద గ్రాములు; ఎండు మిర్చి– 10; మినప్పప్పు – అర టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు– రుచికి తగినంత.
తయారీ..
- మందపాటి బాణలిలో నువ్వులు వేసి మీడియం మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టాలి.
- మరొక బాణలిలో ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయించి చివరగా జీలకర్ర వేసి దించేయాలి.
- ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో నువ్వులు, పోపు దినుసులు, ఇంగువ, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి.
ఈ పొడిని అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లో తినవచ్చు. కూరల్లో కలుపుకోవచ్చు. వేపుళ్లలో పైన చల్లుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులు ఆహారంలో ఈ పొడి ఉండేలా చూసుకోవడం మంచిది.
కొబ్బరి పొడి..
కావలసినవి: ఎండుకొబ్బరి తురుము – వంద గ్రాములు; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; వేయించిన శనగపప్పు – టీ స్పూన్; మిరప్పొడి– టేబుల్ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి.
తయారీ..
- బాణలిలో పచ్చి శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి.
- వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మిరప్పొడి, ఉప్పు కలిపి పొడి చేయాలి.
ఇడ్లీ, దోశెలు, అన్నంలోకి బాగుంటుంది. వేపుళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి కలిపితే రుచి ఇనుమడిస్తుంది.
కరివేపాకు పొడి..
కావలసినవి: కరివేపాకు– వందగ్రాములు (మంచి నీటిలో శుభ్రం చేసి ఆరబెట్టి ఈనెలు తీసిన ఆకులు); ఎండు మిర్చి– పది; ఆవాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు – అర టీ స్పూన్; చింతపండు – అర అంగుళం పాయ; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ పొడి– పావు టీ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత.
తయారీ..
- బాణలిలో నూనె వేడి చేసి వేరు శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి.
- అవి వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
- ఆకులో పచ్చిదనం పోయే వరకు చిన్న మంట మీద వేయించాలి.
- ఆకు వేగిన తర్వాత చింతపండు, ఇంగువ, వెల్లుల్లిరేకలు, ఉప్పు వేసి దించేయాలి.
- చల్లారే కొద్దీ ఆకు పెళపెళలాడుతుంది. పూర్తిగా చల్లారిన వెంటనే మిక్సీలో వేసి పొడి చేయాలి.
- రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవాలి.
ఈ పొడి వేడి అన్నం, ఇడ్లీ, దోశెల్లోకి రుచిగా ఉంటుంది. ఆకలి మందగించినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు ఈ పొడి తింటే జీర్ణవ్యవస్థ క్రమబద్ధమవుతుంది.
గమనిక: చల్లారిన వెంటనే పొడి చేయకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఆకు మెత్తబడి పోతుంది. సరిగ్గా మెదగదు.
అవిశె గింజల పొడి..
కావలసినవి: అవిశె గింజలు – వందగ్రాములు; ఎండు మిర్చి – పది; ఆవాలు – అర టీ స్పూన్; మిరియాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; వేరు శనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; ఇంగువ– అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి.
తయారీ..
- బాణలిలో అవిశె గింజలను మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి.
- మరొక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, వేరు శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి.
- దినుసులన్నీ చక్కగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు అవిశె గింజలు, ఇంగువ వేసి కలిపి దించేయాలి.
- వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి.
ఇది పూర్తిగా ఆరోగ్యకారకం. గుండె వ్యాధుల నివారణ, డయాబెటిస్ నియంత్రణకు డాక్టర్లు అవిశె గింజలను సూచిస్తున్నారు. రుచి కోసం చూడకుండా రోజూ ఒక స్పూన్ అన్నంలో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లలో ఏదో ఒకరకంగా తీసుకోవడం మంచిది.
ఇవి చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని చూపించిన ప్రదాని మోదీ!
Comments
Please login to add a commentAdd a comment