Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా! | Preparation Method Of Vinayaka Chavitikai Special Dishes | Sakshi
Sakshi News home page

Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!

Published Fri, Sep 6 2024 8:42 AM | Last Updated on Fri, Sep 6 2024 8:42 AM

Preparation Method Of Vinayaka Chavitikai Special Dishes

వంటిల్లు

రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!

ఉండ్రాళ్లు..
కావలసినవి..
బియ్యపు రవ్వ– కప్పు;
నీరు – 2 కప్పులు;
పచ్చి శనగపప్పు – 2 టేబుల్‌ స్పూన్‌లు;
నెయ్యి– టీ స్పూన్‌;
ఉప్పు – పావు టీ స్పూన్‌;
పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)

తయారీ..
– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.
– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.
– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.
– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.
– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.
– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.

పూర్ణం కుడుములు..
కావలసినవి..
బియ్యప్పిండి– కప్పు;
నీరు – కప్పు;
నెయ్యి – టీ స్పూన్‌;
ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;
బెల్లం పొడి– ముప్పావు కప్పు;
పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్‌లు;
యాలకుల పొడి– అర టీ స్పూన్‌

తయారీ..
– శనగపప్పును కడిగి రెండు టేబుల్‌ స్పూన్‌ల నీరు పోసి కుక్కర్‌లో నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.
– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.
– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్‌ స్పూన్‌ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.
– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.
– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.
– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.
– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.

ఇక కుడుముల కోసం..
– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.
– నీరు మరిగేటప్పుడు స్టవ్‌ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.
– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.
– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.
– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.
– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.
– ప్రెషర్‌ కుకర్‌లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్‌ ఆపేయాలి.
– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement