ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్‌ర్‌ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.
ఆంధ్రా ఆవకాయ..
కావలసినవి..
పచ్చి మామిడి ముక్కలు – కేజీ;
పచ్చి శనగలు – 50 గ్రాములు;
సన్న ఆవాలు –పావు కేజీ;
మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;
గుంటూరు మిరపపొడి –పావు కేజీ;
ఉప్పు – నూట యాభై గ్రాములు;
పసుపు – టేబుల్ స్పూన్;
నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.
తయారీ..
ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్‌ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.
మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.
అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.
శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.
వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.
మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.
ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
బెల్లం ఆవకాయ..
కావలసినవి..
మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;
మిరపపొడి– 200 గ్రాములు;
ఉప్పు – 200 గ్రాములు;
ఆవపిండి– 100 గ్రాములు;
నూనె – 200 గ్రాములు.
తయారీ..
మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.
బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.
పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.
ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.
నువ్వుల ఆవకాయ..
కావలసినవి..
మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;
నువ్వులు – ఒకటిన్నర కప్పులు;
మిరపపొడి– ముప్పావు కప్పు;
ఉప్పు–పావు కప్పు;
పసుపు – అర టీ స్పూన్;
వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.
తయారీ..
నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.
మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.
ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.
ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.
ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెల్లుల్లి ఆవకాయ..
కావలసినవి..
మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);
వెల్లుల్లి – 200 గ్రాములు;
ఉప్పు – 100 గ్రాములు;
మిరపపొడి– 200 గ్రాములు;
ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);
పసుపు – టీ స్పూన్;
మెంతులు – టేబుల్ స్పూన్;
నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.
తయారీ..
ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.
వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్‌లో వేసి గాలికి ఆరనివ్వాలి.
మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.
మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.
మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.
ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.
నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment