వర్షాకాలం సీజన్‌లో వేడి వేడిగా వంటకాలు చేసుకోవాలనుకుంటున్నరా అయితే ఇవి మీకోసమే.. వేడితో పాటుగా కొంచెం రుచిగానూ, కారంగానూ ఉండటానికి ఈ విధంగా తయారుచేయండి..
ఎగ్–చీజ్ అవకాడో..
కావలసినవి:
అవకాడో – 4 (ఒక్కో అవకాడోను నిలువుగా రెండు ముక్కలుగా చేసి.. గింజ తొలగించి పెట్టుకోవాలి)
గుడ్లు – 8 (రెండు బౌల్స్‌లో తెలుపు సొన, పసుపు సొన వేరు వేరుగా చేసుకోవాలి)
చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు
బటర్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు, మిరియాల పొడి – కొద్దికొద్దిగా
ఉల్లికాడ ముక్కలు – అర టేబుల్ స్పూన్
టొమాటో ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా తిరిగి, నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి)
తయారీ:
– ముందుగా గుడ్డు తెల్లసొనలో కొద్దిగా ఉప్పు, బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
– పసుపు సొనలో చీజ్ తురుము వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలుపుకోవాలి.
– అనంతరం ఒక్కో అవకాడో ముక్కలో కొంచెం కొంచెం తెల్లసొన మిశ్రమాన్ని నింపి.. దానిపైన పసుపు సొన మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి.
– అనంతరం వాటిపైన కొన్నికొన్ని టొమాటో ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసుకుని.. వాటిపైన మిరియాల పొడి, కొంచెం ఉప్పు జల్లుకుని.. ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి.
– వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి ఈ అవకాడోలు.
నూడుల్ చికెన్‌బాల్స్..
కావలసినవి:
నూడుల్స్ – ఒకటిన్నర కప్పు (వేడి నీళ్లల్లో ఉyì కించి పెట్టుకోవాలి)
గరం మసాలా, ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి – 2 టీ స్పూన్ల చొప్పున
మిరియాల పొడి – కొద్దిగా
చికెన్ – పావు కప్పు (కొద్దిగా మసాలా, కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు జోడించి కాసేపు నానబెట్టాలి. తర్వాత మెత్తగా ఉడికించి, చల్లారనిచ్చి తురుములా చేసుకోవాలి)
ఓట్స్ పౌడర్, జొన్న పిండి, గోధుమ పిండి, బీట్‌రూట్ రసం – పావు కప్పు చొప్పున
టొమాటో సాస్ – 6 టేబుల్ స్పూన్ల పైనే
కొబ్బరి పాలు – అర కప్పు
నూనె – సరిపడా
తయారీ:
– ముందుగా నూడుల్స్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి.. ఒక్కో టీ స్పూన్ చొప్పున వేసుకుని.. నూనెలో బాగా వేయించుకోవాలి.
– 2 లేదా 4 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకుని బాగా కలిపి.. çస్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
– ఈలోపు మరో స్టవ్ మీద కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని.. ఉడికిన చికెన్ తురుము, మిగిలిన గరం మసాలా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి.. వేసుకుని బాగా కలిపి.. కొబ్బరి పాలు పోసుకుని దగ్గరపడే వరకూ చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
– అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
– చల్లారిన చికెన్ మిశ్రమంలో ఓట్స్ పౌడర్, జొన్నపిండి, గోధుమ పిండి వేసుకుని బాగా కలిపి.. బీట్‌రూట్ రసం కొద్దికొద్దిగా వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.
– అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
– ఈ ముద్దను చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.
– ఈ సమయంలో కేక్ బౌల్ ట్రే తీసుకుని.. ప్రతి బౌల్‌కి ఆయిల్ రాసుకుని.. కొన్నికొన్ని నూడుల్స్ వేసుకుని.. గ్లాసు సాయంతో గుంతలా గట్టిగా ఒత్తుకోవాలి.
– తర్వాత వాటిని అదే షేప్‌లో ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి.
– అనంతరం ఒక్కో చికెన్ బాల్‌ను మిగిలిన టొమాటో సాస్‌లో ముంచి.. ఒక్కో నూడుల్ బౌల్‌లో వేసుకుని.. సర్వ్ చేసుకోవాలి.
మిల్క్– కోకో డోనట్స్..
కావలసినవి:
మిల్క్ పౌడర్ – 2 కప్పులు
కోకో పౌడర్ – 1 కప్పు
ఫుడ్ కలర్ – అభిరుచిని బట్టి
పంచదార పొడి – 1 కప్పు
మజ్జిగ – ముప్పావు కప్పు
బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్ – 1 టీ æస్పూన్ చొప్పున, గుడ్లు – 2, నూనె – సరిపడా
ఉప్పు – కొద్దిగా
తయారీ:
– ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మిల్క్ పౌడర్, కోకో పౌడర్, పంచదార పొడి, బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
– అందులో కొద్దికొద్దిగా మజ్జిగ పోసుకుంటూ కలపాలి.
– దానిలో వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, ఫుడ్ కలర్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.
– డోనట్స్ మేకర్‌కి కొద్దిగా నూనె రాసి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని, ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి.
– అనంతరం నచ్చిన విధంగా చాక్లెట్ క్రీమ్‌తో లేదా కొబ్బరి తురుము– పాకంతో గార్నిష్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ డోనట్స్.
ఇవి చదవండి: త‍్వరగా.. మేకప్ వేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనిని వాడండి..
Comments
Please login to add a commentAdd a comment