బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.
వీట్ వెజిటబుల్ దోసె..
కావలసినవి..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;
ఉప్పు – పావు టీ స్పూన్;
నీరు – పావు కప్పు;
టొమాటో ముక్కలు – పావు కప్పు;
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;
క్యారట్ తురుము – పావు కప్పు;
పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;
కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్‌లు;
నూనె – 6 టీ స్పూన్‌లు.
తయారీ..
– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.
– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.
– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.
– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.
– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.
చిల్లీ ఇడ్లీ..
కావలసినవి..
ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;
రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్‌లు;
తరిగిన అల్లం – 2 టీ స్పూన్‌లు;
తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్‌లు;
తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్‌లు;
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;
క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;
టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్‌లు;
చక్కెర– అర టీ స్పూన్;
వినెగర్– టీ స్పూన్;
సోయాసాస్ – టీ స్పూన్;
ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;
నూనె – 3 టేబుల్ స్పూన్‌లు.
తయారీ..
– పెనంలో రెండు టేబుల్ స్పూన్‌ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.
– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.
– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.
– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.
ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?!
Comments
Please login to add a commentAdd a comment