వాతావరణం మారింది... వర్షాలు మొదలయ్యాయి. సీజనల్ కోల్డ్... ఇంకా అనుబంధ సమస్యలు కూడా. ఇమ్యూనిటీ పుష్కలంగా ఉండడమే అన్నింటికీ పరిష్కారం. ఆహారంలో రుచికి తోడుగా ఆరోగ్యాన్ని జోడించాలి. రోజూ ఏదో ఒక ఆకు కూర తింటే ఆరోగ్యం పరిపూర్ణం. రోజూ ఆకు కూరలేనా... అని పిల్లలు ముఖం చిట్లిస్తే... పిల్లలు ఇష్టపడే కాంబినేషన్‌లతో వండి పెట్టండి.
ఆలూ మేథీ..
కావలసినవి..
బంగాళదుంప– 200 గ్రా;
మెంతి ఆకు – మీడియం సైజు కట్ట ఒకటి;
ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;
నూనె – 2 టేబుల్ స్పూన్‌లు;
జీలకర్ర – టీ స్పూన్;
ఇంగువ – పావు టీ స్పూన్;
వెల్లుల్లి తరుగు – టీ స్పూన్;
అల్లం తరుగు – టీ స్పూన్;
పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;
ఎండుమిర్చి – 2; పసుపు – అర టీ స్పూన్;
ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్‌లు
తయారీ..
– బంగాళదుంప ఉడికించి తొక్క తీసి ముక్కలు చేయాలి.
– మెంతి ఆకులు వలిచి శుభ్రంగా కడిగి, నీరంతా పోయిన తర్వాత తరిగి పక్కన పెట్టుకోవాలి.
– బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర వేయాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి సన్నమంట మీద వేయించాలి.
– పసుపు, బంగాళాదుంప ముక్కలు వేయాలి. మసాలా దినుసులు ముక్కలకు పట్టేటట్లు మధ్య మధ్య కలియబెడుతూ ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.
– ఇప్పుడు ధనియాల పొడి, మెంతి ఆకు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద మగ్గనిచ్చి దించేయాలి. పిల్లల లంచ్ బాక్సుకు ఇది మంచి పోషకాహారం.
క్యారట్ మొరింగా కర్రీ..
కావలసినవి..
క్యారట్ – పావు కేజీ;
మునగ ఆకు – వంద గ్రాములు;
జీలకర్ర – అర టీ స్పూన్;
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;
పచ్చిమిర్చి – 4 (తరగాలి);
వెల్లుల్లి రేకలు – 3 (తరగాలి);
అల్లం తరుగు – టీ స్పూన్;
పసుపు – పావు టీ స్పూన్;
ధనియాల పొడి – 2 టీ స్పూన్‌లు;
నూనె – 2 టీ స్పూన్‌లు.
తయారీ..
– క్యారట్‌ని శుభ్రం చేసి తరగాలి. మునగ ఆకును కడిగి నీరు పోయేటట్లు చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టాలి.
– బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి, వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి.
– మునగాకు కలిపి రెండు నిమిషాలు(పచ్చివాసన పోయే వరకు) వేగిన తర్వాత క్యారట్ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.
– అరకప్పు నీరు పోసి కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాల్లో క్యారట్ ముక్కలు ఉడుకుతాయి.
– మూత తీసి నీరు ఆవిరయ్యే వరకు కలిపి దించేయాలి. ఇష్టమైతే కూరలో చివరగా కొబ్బరి పొడి చల్లుకోవచ్చు.
గమనిక: మునగ ఆకు లేకపోతే మెంతి ఆకుతో చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment