చెట్టుకు మేకు కొట్టడం.. ఇది చాలా కామన్.. ఎంత అంటే.. మన ఇంట్లో గోడకు కొట్టినట్లు వీధుల్లోని చెట్లకు కొట్టేస్తుంటాం.. మన చిన్న చిన్న అవసరాల కోసం చెట్టే కదా అని లైట్ తీసుకుంటుంటాం.. పోస్టర్లు, బ్యానర్లు కట్టాలన్నా లేదా ఇంట్లోని ఫంక్షన్‌కి టెంట్ కోసమైనా సపోర్టు కోసం చెట్లకు మేకులు కొట్టేస్తూనే ఉంటాం.. దీనికి పట్టణాలు, పల్లెలు అని తేడా లేదు.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని బేధమూ లేదు.. ఎక్కడ చూసినా ఇదే తంతు.. అయితే.. ఇప్పుడు మన మనుగడకు చెట్లను నాటడం ఎంత అవసరమో.. అదే చెట్లకు కొట్టే మేకులను తీయడం కూడా అంత అవసరమంటున్నారు సామాజిక, పర్యావరణ వేత్తలు. ఇంతకీ చెట్లకు మేకులు ఎందుకు కొట్టకూడదు? పదే పదే మేకు కొడితే ఏమవుతుంది?
చెట్లకు కొట్టేసే మేకులు వాటి ఎదుగుదలను దెబ్బతీసి, వాటికి ఆహారం, నీరు అందే వ్యవస్థను పాడు చేసి అవి క్రమంగా మోడు వారేలా చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అందుకే ‘నెయిల్ ఫ్రీ ట్రీస్’. విచ్చలవిడిగా చెట్లకు కొడుతున్న మేకులను తొలగించడం ఇప్పుడో ఉద్యమం. సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రాచుర్యం పొందుతోంది. నాలుగేళ్ల క్రితం పుణేలో మాధవ్ పాటిల్ అన్న సామాజిక కార్యకర్త ఈ ఉద్యమానికి విత్తనం నాటారు. ఆయనతో స్వచ్ఛంద సంస్థలు జత కూడటంతో పుణేలో ముమ్మరంగా కార్యక్రమం సాగింది. ఆ తర్వాత తుషార్ వరంగ్ అనే కార్యకర్త ముంబైలో దీన్ని ప్రారంభించారు. రెండేళ్లుగా సెలవు రోజుల్లో చెట్ల నుంచి మేకులు తొలగించే కార్యక్రమాన్ని ప్రకృతి ప్రేమికులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
ముంబైలో ఈ ఉద్యమానికి అక్కడి మేయర్ పూర్తి సహకారం అందిస్తున్నారు. చెట్లకు మేకులు కొట్టడాన్ని నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు తెచ్చేందుకు కృషి చేసే దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి బెంగళూరుకు పాకింది. వినోద్ కర్తవ్య అనే డీఆర్‌డీఓ అసిస్టెంట్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో యువతీయువకులు ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ‘బృహత్ బెంగళూరు మహానగరపాలిక’జనవరి ఒకటిన తిరిగి ప్రారంభించిన ఉద్యమంలో స్వయంగా దాని కమిషనర్ మంజునాథ ప్రసాద్ పాల్గొని, చెట్లకు మేకులు కొట్టేవారి విషయంలో కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ప్రకటించారు. తర్వాత మైసూరు, తమిళనాడులోని పలు పట్టణాలు, కేరళ.. ఇలా ఉద్యమం పలుచోట్లకు పాకుతోంది. ఇప్పుడు మహారాష్ట్రలోని షోలాపూర్ సహా పలు చిన్న పట్టణాల్లోనూ మొదలైంది.
మేకులు కొడితే ఏమవుతుంది?
‘ఓ మనిషి శరీరంలో బుల్లెట్ దిగి అది అలాగే ఉండిపోతే ఎలా ఉంటుందో చెట్లకు మేకులు దిగితే అలాగే ఉంటుంది. చెట్ల బెరడు లోపల ఉండే వల్కలం, కేమ్యం (అవిభాజ్య కణజాలం)లను అది దెబ్బతీస్తుంది. దీని వల్ల చెట్లు నీటిని తీసుకునే, ఆహారాన్ని పొందే వ్యవస్థ దెబ్బతిని దాని పెరుగుదల మందగిస్తుంది. మేకుతో ఏర్పడే గాయాల నుంచి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ప్రవేశించి చెట్టు నాశనానికి కారణం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రక్రియతో చెట్లు చాలా శక్తిని కోల్పోతాయి. పదేపదే జరిగితే అది నీరసించి వాడిపోవచ్చు.
ఇక మేకుతో ఏర్పడే సందుల్లోంచి దాని ద్రవాలు లీకై కూడా నష్టం జరుగుతుంది. పెద్ద చెట్లకు ఎక్కువ మేకులు కొడితే.. అవి దెబ్బతింటాయి.. చిన్న చెట్లకు కొన్ని మేకులు కొట్టినా.. కొన్నాళ్లలో చనిపోవచ్చు.. అందుకే మేకులు కొట్టకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. మేకులు కొట్టేవారికి జరిమానాలు విధించాలి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ వి.ఎస్.రాజు, కాకతీయ విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర విశ్రాంత ఆచార్యులు
ఇక్కడ చాలా అవసరం
ఈ ఉద్యమం హైదరాబాద్‌కు మరింత అవసరం.. మేకులు కొట్టడం ఇక్కడ ఇష్టారాజ్యమే. ఇక్కడ నెయిల్ ఫ్రీ ట్రీస్ ఉద్యమం చాలా అవసరం. అంతేకాదు.. ఫుట్‌పాత్‌లపై చెట్ల మొదళ్లను ఆనుకుని కాంక్రీట్ చేస్తున్నారు. దీని వల్ల కూడా చెట్లు చచ్చిపోతాయి. – ఉదయకృష్ణ, వాటా ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment